అలసి పోతున్నారు..
కొవిడ్ వచ్చి కోలుకున్న వారిలో సమస్యలు
నెలలు గడిచినా రాని సత్తువ
ఒక్కొక్కరిలో ఒక్కో సమస్య
హైదరాబాద్ సిటీ: ఎప్పుడూ చలాకీగా ఉండే రామారావు ఈ మధ్య నీరసించి పోయాడు. గతంలోల హుషారు ఉండటం లేదు. ఎక్కువ దూరం నడవలేకపోతున్నాడు. కొద్ది పనికే అలిసిపోతున్నాడు. డాక్టర్ దగ్గరకు వెళ్తే కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. వైరస్ బారి నుంచి కోలుకుని నెలలు గడిచినా దాని తాలుకు ఇబ్బందులు కొందరిని వదలడం లేదని చెబుతున్నారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ సర్వే నిర్వహించింది. కొవిడ్ బారిన పడి కోలుకున్న సుమారు వంద మందిని కలుసుకుని మాట్లాడింది. ఇందులో చాలా మంది ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
ఒంటి నొప్పులు
కొవిడ్ నుంచి కోలుకున్నా.. చాలా మంది తొందరగా అలసిపోతున్నారు. వంటి నొప్పులు వేదిస్తున్నాయి. మరికొందరు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. తరచుగా జ్వరం వస్తోందని, ఫ్యాన్ గాలి ఎక్కువైతే ముక్కులు మూసుకుపోతున్నాయని ఇంకొందరు తెలిపారు. ఎక్కువ దూరం నడవలేకపోతున్నామనీ చెప్పారు.
కొత్త సమస్యలు..
కొవిడ్ తగ్గినప్పటికీ కొంత మంది కొత్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌కు సంబంధించిన మందుల వినియోగం వల్ల మధుమేహం, కిడ్నీ, బీపీ, జట్టు ఊడిపోవడం, జీర్ణకోశ సమస్యలు, గైనిక్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అప్పటికే మధుమేహం ఉన్న వారు శరీరంలో చక్కెర నిల్వలు కొంచెం పెరిగినట్లు తెలిపారు.
రోగ నిరోధక శక్తి లేక..
కొవిడ్ వైరస్ నశించినప్పటికీ దాని తాలుకు ప్రభావం శరీరంలో కొంత కాలం ఉంటుంది. కొందరిలో 4 నుంచి 12 వారాలు లక్షణాలు ఉంటున్నాయి. అలాంటి వారిలో అక్యూడ్ కొవిడ్ ఉన్నట్లే. దాని పోస్టు కొవిడ్ సిండ్రోమ్‌గా వ్యవహారిస్తుంటాం. ఇది ఒక్కో అవయవంపై ఒక్కో రీతిన ప్రభావం చూపుతుంది. చాలా మందికి విటమిన్ లోపం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కొవిడ్ తగ్గినప్పటికీ, అస్వస్థతకు గురవుతుంటారు. నీరసం, హుషారుగా లేకపోవడం, ఆయాసం, కొన్ని సందర్భాల్లో జర్వం లాంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. బాధితుల కొవిడ్ చరిత్ర తెలుసుకుని పరీక్షించడంతో వారు ఇతర జబ్బుల బారిన పడుతున్నట్లు తేలుతోంది. దాని ఆధారంగా చికిత్సలు అందిస్తున్నాం. అయితే ఇలాంటి లక్షణాలతో వచ్చే వారిపై మ్యాలిక్యులర్ స్థాయిలో సమగ్ర అధ్యాయనం చేయాల్సిన అవసరముంది.
- డాక్టర్ నవోదయ, సీనియర్ జనరల్ ఫిజిషియన్, కేర్ ఆస్పత్రి
ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంది
కొవిడ్ తగ్గిన తర్వాత దాని నుంచి వచ్చే రుగ్మతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఏదో ఒక సమస్యతో వైద్యులను సంప్రదిస్తున్నారు. కొందరి ముక్కులు బ్లాక్ కావడం, గొంతు గరగర, నిరంతరం దగ్గు, బలహీనత, నడుము నొప్పి, కండరాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. కొందరు ఆక్యూట్ కరోనరీ సిండ్రోమ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొవిడ్ తగ్గిన మొదటి మూడు నెలలు శారీరక శ్రమ, కఠినమైన పనులు చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీసే ప్రమాదముంది.
డాక్టర్ శ్యామల అయ్యంగార్, సీనియర్ ఇంటర్నల్ మెడిసిన్, అపోలో ఆస్పత్రి
ఈఎన్టీ సమస్యలు
పోస్ట్ కొవిడ్‌లో బాధితులు ఎక్కువగా చెవికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. కొందరిలో బ్యాక్టీరియల్ సైనోసిస్ వంటి ఇబ్బందులు కూడా గమనిస్తున్నాం. ఇలాంటివి కొందరిలో మందులతో వెంటనే తగ్గుతుండగా, మరికొందరిని ఎక్కువ రోజులు బాధిస్తున్నాయి.
డాక్టర్ సంపూర్ణ ఘోష్, ఈఎన్టీ వైద్యురాలు, మెడికవర్ ఆస్పత్రి