మహిళల్లో పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావం

ABN , First Publish Date - 2022-08-30T20:05:40+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న 25 శాతం మంది మహిళల్లో నెలసరి సమస్యలు, మానసిక ఒత్తిడి, గుండె దడ, తలనొప్పి, నిద్రలేమి...

మహిళల్లో పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావం

రోనా నుంచి కోలుకున్న 25 శాతం మంది మహిళల్లో నెలసరి సమస్యలు, మానసిక ఒత్తిడి, గుండె దడ, తలనొప్పి, నిద్రలేమి, జుట్టు రాలిపోవడం, బడలిక, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, ఎక్కువ కాలం పాటు వాసన తెలియకపోవడం మొదలైన  ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కరోనా కారణంగా శరీరంలో చోటు చేసుకున్న అసాధారణ మార్పులు, మందుల ప్రభావం వల్ల మహిళల ప్రత్యుత్పత్వి పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి.


మధుమేహం, కాలేయ సమస్యలు, ఊబకాయం, గుండె జబ్బులు ఉన్న మహిళలకు కరోనా సోకడం వల్ల నెలసరి క్రమం తప్పడం, ఎక్కువ రోజుల పాటు, అధిక రుతుస్రావం, నెలసరి నొప్పి ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో పాటు సంతానలేమికి కూడా కరోనా ఒక పరోక్ష కారణమైంది.


కరోనాతో నెలసరి సమస్యలు

కరోనా సోకిన వారిలో హైపోథలామస్‌, పిట్యుటరీ, ఎండోక్రైన్‌ వ్యవస్థ పనితీరులో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా గర్భాశయం, అండాశయాల ప్రోస్టోగ్లాండిన్స్‌, హార్మోన్లలో అమతౌల్యాలు చోటు చేసుకుంటాయి. అంతే కాకుండా...


  • ఇమ్యూనిటీ, కణజాల వ్యవస్థ, రక్తం గడ్డకట్టే వ్యవస్థలో అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో నెలసరి సమస్యలు మొదలవుతాయి.
  • ఐసొలేషన్‌లో ఉండవలసి రావడం మూలంగా మానసిక ఒత్తిడి, ఆందోళనలకు లోనవుతారు. దాంతో కార్టిసాల్‌ మోతాదులు  పెరిగి, నెలసరి ఆలస్యమవుతుంది. తీసుకునే ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వల్ల, బరువు పెరుగుతారు. దాంతో జిఎన్‌ఆర్‌హెచ్‌ హార్మోన్‌ విడుదలలో అసమతౌల్యం ఏర్పడి నెలసరి సమస్యలు మొదలవుతాయి.
  • ఎండోమెట్రియంలోని ఎసిఇ2 రిసెప్టార్స్‌ ఈస్ర్టొడైల్‌, ప్రొజెస్టరాన్‌ ఉత్పత్తి మీద కూడా నేరుగా ప్రభావం పడుతుంది. ఇమ్యూనిటీ తగ్గడంతో ఎండోమెట్రియంలో ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ పెరుగుతుంది. 
  • కరోనా మూలంగా హైపాగ్జియా (కణజాలానికి ప్రాణవాయువు సరఫరా తగ్గడం) వల్ల గర్భాశయ రక్తనాళాలు సంకోచిస్తాయి. కరోనాలో ఉపయోగించే యాంటా కాగ్యులేటరీ డ్రగ్స్‌ వల్ల కూడా నెలసరిలో రక్తస్రావం పెరుగుతుంది.


చికిత్స ఇలా...

కరోనా తదనంతర నెలసరి సమస్యలకు ఆయుర్వేదంలో మంచి ఔషధాలున్నాయి. అవేంటంటే...


అశ్వగంధ: ఎండోక్రైన్‌ వ్యవస్థను నియంత్రిస్తుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ మీద పని చేస్తుంది. యాంగ్జయిటీ తగ్గిస్తుంది. షుగర్‌, బిపి, ఒబేసిటీ సమస్యలను తగ్గిస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది.


యష్టిమధు (అతి మధురం): బలవర్ధకం, వ్రణ రోపణం, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, గొంతునొప్పి తగ్గుతాయి. వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పని చేస్తుంది. 

అశోక: యుటిరైన్‌ టానిక్‌లా పని చేస్తుంది. ప్రోస్టాగ్లాండిన్‌ ఉత్పత్తి తగ్గించి, గర్భాశయ సంకోచ వ్యాకోచాలను తగ్గిస్తుంది. దాంతో నెలసరి నొప్పి తగ్గుతుంది. యుటెరైన్‌ సెడేటివ్‌గా పని చేసి, రుతుచక్రాన్ని క్రమబద్ధం చేస్తుంది. అధిక రుతుస్రావాన్ని తగ్గిస్తుంది. పిఎమ్‌ఎస్‌ సమస్యలను చక్కగా ఉపశమింపజేస్తుంది.

బల: అశ్వగంధ శతావరితో కలిపి అన్ని రకాల స్త్రీల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయవచ్చు. శారీరక బడలిక తగ్గుతుంది. శ్వాసకోశ నాళ సమస్యను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇన్‌ఫ్లూయెంజా, ముక్కు దిబ్బెడ సమస్యలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి, థైరాయిడ్‌ సమస్యల్లో కూడా ఈ మందును ఉపయోగిస్తారు.

లోధ్ర (లొద్దుగ పట్ట): ప్రొజెస్ట్రాన్‌, ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మోతాదులు పెరుగుతాయి. అండం విడుదల సమస్యకు కారణమయ్యే హర్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. నెలసరిలో అధిక రుతుస్రావాన్ని తగ్గిస్తుంది. నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌లో కనిపించే పొత్తికడుపు నొప్పి తగ్గుతుంది. 


ఔషధ ద్రవ్యాలను వివిధ మోతాదులో కలిపి లేదా విడివిడిగా ఆయుర్వేద గైనకాలజిస్టు సలహా మేరకు వినియోగించాలి. 


-డాక్టర్‌ యశోద పెనుబాల,

ప్రసూతి, స్త్రీల వైద్య నిపుణురాలు,

చిన్న పిల్లల విభాగం అధిపతి,

ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి,

హైదరాబాద్‌. ఫోన్‌ నెంబరు: 9052250341



Updated Date - 2022-08-30T20:05:40+05:30 IST