రూ.5లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-03T09:52:01+05:30 IST

రూ.5 లక్షల విలువైన పత్తి విత్తనాలను సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరులో మంగళవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.5లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం

మూడు వందల ప్యాకెట్లలో 124 కిలోల పత్తి విత్తనాలు 

ములుగు మండలం కొత్తూరులోఅధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు 

నలుగురిపై కేసు నమోదు


గజ్వేల్‌/ములుగు, జూన్‌ 2: రూ.5 లక్షల విలువైన పత్తి విత్తనాలను సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరులో మంగళవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు వ్యవసాయశాఖ ఏడీ అశోక్‌కుమార్‌, గజ్వేల్‌ రూరల్‌ సీఐ కోటేశ్వర్‌రావు, విజిలెన్స్‌ ఏఎస్పీ కే.మనోహర్‌, విజిలెన్స్‌ సీఐ బాల్‌రెడ్డి, విజిలెన్స్‌ అగ్రికల్చర్‌ అధికారి రాజు, ములుగు ఏవో ప్రవీణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తూరు గ్రామంలోని జై హానుమాన్‌ సీడ్‌ క్వార్టర్స్‌, ప్లాస్టిక్‌ ఇండస్ట్రీలో విత్తనాలను అక్రమంగా ప్యాకింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.


దీంతో సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయగా, రూ.5లక్షల విలువ చేసే 337 ప్యాకింగ్‌ పత్తి విత్తన ప్యాకెట్లు (రెయిన్‌బో, సర్పంచ్‌, కావ్య, భూమి, విరాట్‌ పేర్లతో ఉన్నవి), 124 కిలోల లూస్‌ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పత్తి విత్తనాలను ప్యాకింగ్‌ చేస్తున్న గడీల గోవర్ధన్‌, యెల్మీ మహే శ్‌యాదవ్‌, గడీల ప్రకాశ్‌, గడీల మురళీ కేసు నమోదు చేసుకుని, వారి నుంచి ట్రీట్‌మెంట్‌ ప్యాకింగ్‌ మిషన్‌, ప్యాకింగ్‌ ప్యాకెట్లు, వెయింగ్‌ మిషన్‌, బైకును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7.60లక్షలు ఉంటుందని విజిలెన్స్‌ ఏఎస్పీ మనోహార్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రవన్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-06-03T09:52:01+05:30 IST