ఆగని ఉధృతి

ABN , First Publish Date - 2021-05-11T06:54:50+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇతర జిల్లాల్లో కొంతవరకు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నా.. ఇక్కడ మాత్రం మహమ్మారి వేగం అంతకంతకూ పుంజుకుంటూనే ఉంది. జిల్లాలో సోమవారం 2,352 మందికి కొత్తగా వైరస్‌ నిర్ధారణ కాగా, ఈ కేసులు రాష్ట్రంలో జిల్లాను తొలిస్థానంలో ఉంచాయి.

ఆగని ఉధృతి

సోమవారం జిల్లాలో 2,352 మందికి వైరస్‌ నిర్ధారణ

రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్‌లు జిల్లాలోనే నమోదు

మొత్తం 1,65,545కు చేరిన కేసులు..

ఒక్కరోజులో పది మంది మృతి

25 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసుల సంఖ్య

30 ఆసుపత్రులను కొవిడ్‌ చికిత్స నుంచి  తొలగించడంతో తగ్గిపోయిన బెడ్ల సంఖ్య

అంతర్రాష్ట జిల్లాల వెళ్లాలంటే పోలీసు శాఖ నుంచి ఈ-పాస్‌ తప్పనిసరి

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇతర జిల్లాల్లో కొంతవరకు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నా.. ఇక్కడ మాత్రం మహమ్మారి వేగం అంతకంతకూ పుంజుకుంటూనే ఉంది. జిల్లాలో సోమవారం 2,352 మందికి కొత్తగా వైరస్‌ నిర్ధారణ కాగా, ఈ కేసులు రాష్ట్రంలో జిల్లాను తొలిస్థానంలో ఉంచాయి. ఇతర జిల్లాల్లో కేవలం వెయ్యి, పదిహేను వందల్లో ఉంటే ఇక్కడ మాత్రం తరచూ రెండు వేల కంటే పాజిటివ్‌లు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పడకలు నిండిపోయి కొత్తగా వచ్చే బాధితులకు బెడ్లు అందడం లేదు. దీంతో కొవిడ్‌ మరణాలు అంత కంతకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. అటు ఇతర చికిత్సలు, కొవిడ్‌ వైద్యం అందించలేమని పలు ఆసుపత్రులు చేతులెత్తేయడంతో 30 ప్రైవేటు ఆసు పత్రులను కొవిడ్‌ చికిత్సల జాబితా నుంచి కలెక్టర్‌ తొలగించారు. మునుపు 77 ఆసుపత్రులు కలిపి 651 ఐసీయూ పడకలు ఉండగా ఇప్పుడు 505కు పడిపోయాయి. ఆక్సిజన్‌ పడకలు 2,677కు గాను, 2,501కు చేరాయి. దీంతో బెడ్ల లభ్యత మరింత క్లిష్టంగా మారింది. అటు కాకినాడ జీజీహెచ్‌,రాజమహేంద్రవరం డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, కిమ్స్‌లలో పడకలు అసలు ఖాళీ అవక కొత్తగా వచ్చే బాధితుల పడుతున్న కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో బాధితులు ఏంచేయాలో తెలియక రోదన చెందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే లక్షలకులక్షలు కట్టలేక పడక దొరికే వరకు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. కాగా జిల్లాలో సోమవారం 2,352 పాజిటివ్‌లు నమోదవగా, అత్యధికంగా కాకినాడ నగరంలో 302, కాకినాడ రూరల్‌లో 52, రాజమహేంద్రవరంలో 218, రాజమహేంద్రవరం రూరల్‌లో 36, మామిడికుదురు, గంగవరం మండలాల్లో 98 చొప్పున నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో 1,759 మందిని హోంఐసోలేషన్‌కు అనుమతించారు. కాగా సోమవారం పాజిటివ్‌లతో మొత్తం కేసులు 1,65,545కు చేరాయి. కొవిడ్‌తో చికిత్స పొందుతున్న మొత్తం బాధితులు 25 వేలకు చేరువయ్యారు. కాగా కొవిడ్‌ మరణాలు జిల్లాలో సోమవారం పది నమోదైనట్టు ప్రభుత్వం బులిటెన్‌లో ప్రకటించగా, మొత్తం మరణాల సంఖ్య 781కు చేరాయి. కాగా అంతర్‌రాష్ట్రాలు, జిల్లాలు వెళ్లే వారికి ఇకపై ఈ పాస్‌ తప్పనిసరని పోలీసుశాఖ ప్రకటించింది. పాస్‌లు కావాలనుకునే వారు పోలీసుశాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

నేడు కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఉండదు : జేసీ కీర్తి 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే 10: జిల్లాలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఈనెల 11వ తేదీ మంగళవారం నాడు ఎక్కడా ఎవరికీ, ఏ రకమైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఉండదని జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.


Updated Date - 2021-05-11T06:54:50+05:30 IST