Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 25 Jan 2022 13:01:27 IST

207 జిల్లాల్లో ‘పాజిటివిటీ’ కలకలం

twitter-iconwatsapp-iconfb-icon
207 జిల్లాల్లో పాజిటివిటీ కలకలం

పరీక్ష చేయించుకుంటున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి కొవిడ్‌

వచ్చే 15కల్లా కేసులు తగ్గే అవకాశం?


న్యూఢిల్లీ, జనవరి 24: దేశంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దడ పుట్టిస్తోంది. ఆదివారం రోజున ఇది 17.78 శాతం ఉండగా, సోమవారానికల్లా 20.75 శాతానికి పెరిగింది. కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటున్న ప్రతి 100 మందిలో ఎంతమందికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతోందో తెలిపే సూచిక ‘పాజిటివిటీ రేటు’. ఇది దేశంలోని 207 జిల్లాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తిరువనంతపురం (కేరళ), ఫరీదాబాద్‌ (హరియాణ), ఉత్తర గోవా జిల్లాల్లో పాజిటివిటీ రేటు సగటున 46 శాతం మేర ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ లెక్కన అక్కడ కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. రోహ్‌తక్‌ (హరియాణా), పుణె (మహారాష్ట్ర), మొహాలీ (పంజాబ్‌) జిల్లాల్లోనూ పాజిటివిటీ 40 శాతానికిపైనే ఉండగా, దక్షిణ గోవా జిల్లాలో ఇది 39 శాతానికి చేరువలో ఉంది. మరోవైపు వరుసగా నాలుగోరోజూ దేశంలో కరోనా కేసులు తగ్గాయి. సోమవారం నాటికి గడచిన 24 గంటల్లో కొత్తగా 3.06 లక్షల మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. క్రియాశీల కేసుల సంఖ్య మాత్రం మరో 62,130 పెరిగింది. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 241 రోజుల (2021 మే నాటి) గరిష్ఠానికి పెరిగి 22.49 లక్షలకు చేరింది. కరోనాతో 439 మంది మృతిచెందారు. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ (81)కు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దీనిపై పవార్‌ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో హోం ఐసొలేషన్‌లో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సోమవారం ఫోన్‌ చేసి ఆరోగ్యసమాచారం తెలుసుకున్న ప్రముఖుల్లో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఉన్నారు. 


నాలుగు మహానగరాల్లో కేసులు డౌన్‌.. 

దేశంలో కరోనా కేసులు ఫిబ్రవరి 15కల్లా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో కేసులు తగ్గుతుండటాన్ని అందుకు ఒక సంకేతంగా భావించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఆ నాలుగు నగరాల్లో కొవిడ్‌ కేసులు పతాక స్థాయికి చేరాయని, కేసులు తగ్గడం కూడా కొన్ని రోజుల క్రితమే మొదలైందని గుర్తు చేస్తున్నారు. క్రితం రోజుతో పోలిస్తే సోమవారం కొత్త కొవిడ్‌ కేసులు.. ఢిల్లీలో 9,197 నుంచి 5,760కు తగ్గాయని తెలిపారు. కరోనా మహమ్మారి త్వరలో ఎండెమిక్‌ (స్థానిక వ్యాప్తి) దశకు చేరొచ్చని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సీనియర్‌ సాంక్రమిక వ్యాధి నిపుణుడు సంజయ్‌ రాయ్‌ అంచనా వేశారు. వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతుండటం, కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతుండటం, జనసాంద్రత ఎక్కువగా నగరాలు మినహా మిగతా చోట్ల కరోనా వ్యాప్తి తక్కువ ఉండటం వంటి కారణాలు సానుకూలంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ (సీజీహెచ్‌ఎ్‌స)కు సంబంధించిన వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను పునరుద్ధరించారు. వాటిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం ఢిల్లీలో ప్రారంభించారు.అప్పుడు 6 లక్షలు.. ఇప్పుడు 16 లక్షలు 

ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో భారీగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల్లో ఎక్కువ భాగం భారత్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సోమవారం తెలిపింది. గత వారం రోజుల వ్యవధిలో భారత్‌లో కేసుల సంఖ్య 150 శాతం మేర పెరిగిందని పేర్కొంది. జనవరి 10-16తో ముగిసిన వారంలో భారత్‌లో 6.38 లక్షల కొత్త కేసులే నమోదవగా, జనవరి 17-23 మధ్యలో కొత్తగా 15.94 లక్షల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని గుర్తుచేసింది. కరోనాలో మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ వ్యాఖ్యానించారు. కాగా, రికార్డు స్థాయిలో దాదాపు 13 నెలల పాటు చైనాలోని జియాన్‌ నగరంలో కొనసాగిన లాక్‌డౌన్‌ సోమవారంతో ముగిసింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.