‘విభజన హామీల’ అమలుపై సానుకూలం!

ABN , First Publish Date - 2022-09-28T07:59:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణకు సంబంధించిన హామీల అమలులో కేంద్రం సానుకూలంగా స్పందించింది.

‘విభజన హామీల’ అమలుపై సానుకూలం!

  • గిరిజన వర్సిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై
  • వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశం
  • సంస్థల విభజనపై ‘న్యాయ సలహా’కు సూచన
  • ఏపీ వాదనలకు తెలంగాణ అభ్యంతరం
  • సింగరేణిని విభజించే ప్రశ్నే లేదని వెల్లడి
  • కేంద్ర ఉత్తర్వుల మేరకే షెడ్యూల్‌ 10 విభజన
  • హోం శాఖ భేటీలో రాష్ట్ర అధికారులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణకు సంబంధించిన హామీల అమలులో కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర అధికారులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. అపరిష్కృతంగా ఉన్న గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, వెనకబడిన జిల్లాలకు నిధుల విడుదల అంశాలను తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. స్పందించిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి.. ఆయా అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలను వేగంగా తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన, ఏపీ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ విభజనతోపాటు చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజనపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖ సలహా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన అంశాలపై మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా అధ్యక్షతన దాదాపు రెండు గంటలకుపైగా సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో 14 అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం చర్చల వివరాలిలా ఉన్నాయి. 


తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు నిధులు

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని 9 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాటిని విడుదల చేయాలంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్థిక శాఖకు సూచించారు.


గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు

రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేవనెత్తారు. వర్సిటీ ఏర్పాటుకు భూమి కూడా ఇచ్చామని చెప్పారు. స్పందించిన హోం శాఖ కార్యదర్శి.. ఈ అంశాన్ని పరిశీలించి వేగంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. 150 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించామన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని భల్లా రైల్వేశాఖను ఆదేశించారు. 


షెడ్యూల్‌ 9 సంస్థల విభజన

షెడ్యూల్‌ 9లో పేర్కొన్న 91 సంస్థలకుగాను 90 సంస్థల విభజనకు షీలా భిడే కమిటీ సిఫారసు చేసింది. విభజనకు భేదాభిప్రాయాలు లేని 53 ప్రభుత్వ రంగ సంస్థలు, కేవలం తెలంగాణకు అంగీకారయోగ్యమైన 15 సంస్థలు, తెలంగాణ అంగీకరించని 22 సంస్థల ప్రాతిపదికన మూడు దశల్లో సంస్థల విభజన జరపాలని కేంద్ర హోం శాఖ వివాదాల పరిష్కార సబ్‌ కమిటీ సూచించింది. అయితే, షీలా భిడే కమిటీ సిఫారసులను పూర్తి స్థాయిలో అంగీకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని సంస్థలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి పరిష్కారమయ్యే వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిరుపయోగంగా ఉన్న డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు చెందిన భూములను వినియోగించుకున్నామని, దానిపై ఏపీ.. హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నిపుణుల కమిటీ ఆ ఆస్తులను విభజించాలని సిఫారసు చేసిందని ప్రస్తావించారు. 


షెడ్యూల్‌ 9 సంస్థల అప్పులు, ఆస్తుల విభజనకు కేంద్ర ప్రభుత్వానికి పరిధి లేదంటూ ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖను సంప్రదించి అన్ని కోర్టు కేసులను అధ్యయనం చేయాలని కేంద్ర అధికారులకు హోం శాఖ కార్యదర్శి ఆదేశించారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 10లో పేర్కొన్న 142 సంస్థల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు సంస్థల నగదు బ్యాలెన్సులను జనాభా నిష్పత్తి, ఆస్తుల స్థానికత ఆధారంగా విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు తాము అంగీకరిస్తున్నామని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని, స్థానికత ఆధారంగా కాకుండా ఆస్తులను కూడా జనాభా నిష్పత్తి ఆధారంగా విభజించాలని వాదిస్తోందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు అకాడమీ విభజనపై తాము కోర్టును ఆశ్రయించామని, అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో షెడ్యూల్‌ 10 సంస్థల విభజనపై తదుపరి సమీక్ష అవసరం లేదని స్పష్టం చేశారు. 


ఏపీ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ విభజన

ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫసీ) బోర్డును పునర్వ్యవస్థీకరించాలని 2016లోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ బోర్డును ఏర్పాటు చేయలేదని, ఆలోపు ఏకపక్షంగా విభజన ప్రణాళికను రూపొందించి ఆమోదం కోసం అప్పటి కార్పొరేషన్‌ బోర్డు కేంద్రానికి పంపించిందని తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. ఈ సంస్థకు చెందిన భూముల అంశాన్ని వేరుగా, ఇతర అంశాలను వేరుగా చూడాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోందని.. అది తెలంగాణకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కాగా, హైకోర్టు స్టేటస్‌ కో విధించిన నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేయాలని తమ శాఖ అధికారులకు భల్లా సూచించారు. 


సింగరేణి, ఆప్మెల్‌ విభజన

సింగరేణికి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆస్తులు ఉన్నందున ఆ సంస్థ ఆస్తులను కూడా విభజించాలని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ అధికారులు  అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణిని విభజించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఆప్మెల్‌ కూడా సింగరేణి అనుబంధ సంస్థ అని, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఈక్విటీ మేరకు విభజించాలని స్పష్టం చేశారు. దీనిపై అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులకు హోం శాఖ కార్యదర్శి సూచించారు. 


పౌరసరఫరాల క్యాష్‌ క్రెడిట్‌, బియ్యం సబ్సిడీ

పౌరసరఫరాల సంస్థ విభజనకు ముందు తెలంగాణ కార్పొరేషన్‌ ఉపయోగించుకున్న క్యాష్‌ క్రెడిట్‌ అసలు మొత్తాన్ని.. కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ నిధులను విడుదల చేసిన తర్వాత తెలంగాణకు బదిలీ చేస్తామంటూ ఏపీ హామీ ఇవ్వాలన్న షరతుతోనే చెల్లించడానికి అంగీకరించామని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, క్యాష్‌ క్రెడిట్‌ అసలు మొత్తం తొలుత రూ.354 కోట్లుగా ఉందని, దాన్ని తర్వాత సవరించారని, బ్యాంకులను సంప్రదించిన తరువాతే ఏపీకి సొమ్ములు చెల్లిస్తామని తెలిపారు. 


విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థలు..

రాష్ట్ర విభజన చట్టంలో 12 సంస్థల ప్రస్తావన లేదని, వాటిని కూడా విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు కోరారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ అధికారులు.. ఆ సంస్థలను విభజిస్తే రాష్ట్ర విభజన చట్టానికి సవరణలు చేసినట్లు అవుతుందన్నారు. దీనిపై కేంద్ర న్యాయ శాఖను సంప్రదించి సలహా తీసుకోవాలని అధికారులకు భల్లా సూచించారు.

Updated Date - 2022-09-28T07:59:07+05:30 IST