రెండు రోజుల్లోనే 18 పాజిటివ్‌ కేసులు..

ABN , First Publish Date - 2020-04-03T09:24:10+05:30 IST

జిల్లాలో కరోనా కోరలు చాచింది..

రెండు రోజుల్లోనే 18 పాజిటివ్‌ కేసులు..

భయం గుప్పెట్లో!

23కు చేరిన బాధితుల సంఖ్య

వీరిలో అత్యధికలు ఢిల్లీ సమావేశాలకు వెళ్లొచ్చినవారే

విజయవాడ నగరంలో 18 పాజిటివ్‌ కేసులు 

తాజాగా జగ్గయ్యపేట, ముప్పాళ్ల, నూజివీడుల్లో ఐదు కేసులు 

చెన్నై నుంచి జార్ఖండ్‌ వెళుతున్న మరో యువకుడికీ పాజిటివ్‌


విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా కోరలు చాచింది. పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కొందరి అవగాహనా రాహిత్యమే ఎందరో వైరస్‌బారిన పడేలా చేసింది. జిల్లాలో బుధవారం ఒక్కరోజే పది పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గురువారం మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా 23కు చేరుకుంది. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతంగా కృష్ణాజిల్లా నిలిచింది.


గురువారం వరకు ఒక్క విజయవాడ నగరంలోనే మొత్తం 18 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, జగ్గయ్యపేటలో ఇద్దరికి, నందిగామ మండలం చందర్లపాడు ముప్పాళ్ల గ్రామంలో ఒకరికి, నూజివీడులో ఇద్దరికీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన 23 పాజిటివ్‌ కేసుల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు నలుగురు, వారితో కాంటాక్ట్‌ అయినవారు ఒకరు కాగా, మిగిలినవారు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయినవారే కావడంతో జిల్లా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


కరోనా భూతం జిల్లా అంతటా పంజా విసురుతోంది. ఢిల్లీలో మత ప్రార్థనలకు హాజరై తిరిగి వచ్చినవారితోపాటు వారితో కాంటాక్ట్‌ అయినవారికీ వైరస్‌ సోకింది. బుధవారం ఒక్కరోజే విజయవాడ నగరంలో పది పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గురువారం మరో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా 23కు చేరుకుంది. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతంగా కృష్ణాజిల్లా నిలిచింది. గురువారం వరకు ఒక్క విజయవాడ నగరంలోనే మొత్తం 18 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, జగ్గయ్యపేటలో ఇద్దరికి, నందిగామ మండలం చందర్లపాడు ముప్పాళ్ల గ్రామంలో ఒకరికి, నూజివీడులో ఇద్దరికీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 


అత్యధికులు ఢిల్లీ వెళ్లిచ్చిన వారే...

ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన 23 పాజిటివ్‌ కేసుల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు నలుగురు, వారితో కాంటాక్ట్‌ అయినవారు ఒకరు కాగా, ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు పది మంది, వారితో కాంటాక్ట్‌ అయినవారు మరో ఏడుగురికి కరోనా సోకింది. 


విజయవాడలో ప్యారిస్‌ నుంచి వచ్చిన కొత్తపేట చేపల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన యువకుడికి తొలుత కరోనా పాజిటివ్‌ వచ్చింది. తర్వాత ఆమెరికా నుంచి వచ్చిన గాయత్రీనగర్‌కు చెందిన యువకుడికి, స్వీడన్‌ నుంచి వచ్చిన అయోధ్యనగర్‌కు చెందిన వ్యక్తికి, ఆ తరువాత మక్కా (సౌదీ)కి వెళ్లొచ్చిన కృష్ణలంక రాణిగారితోటకు చెందిన వృద్ధుడికి కరోనా సోకింది. విదేశాలకు వెళ్లి వచ్చిన ఈ నలుగురికి పాజిటివ్‌ వచ్చిన తర్వాత కొన్ని రోజులు జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ఇక భయం లేదని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి ఢిల్లీ నుంచి జిల్లాకు వ్యాపించి మరింత విజృంభించింది. బుధవారం 10, గురువారం 8 కలిపి మొత్తం 18 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 


ఢిల్లీ నుంచి జిల్లాకు..  

బుధ, గురువారాల్లో అత్యధికంగా నమోదైన 18 పాజిటివ్‌ కేసులూ ఢిల్లీలో జరిగిన తబ్లిక్‌ జమాత్‌ సమావేశాలకు హాజరై వచ్చిన వారు, వారి బంధువులు, వారితో కాంటాక్ట్‌ అయినవారే. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా సోకింది. ఈ కుటుంబంలో తండ్రీ కొడుకులు ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని రాగా.. వారి ద్వారా కుటుంబంలోని ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కుమ్మరిపాలెం ప్రాంతానికి చెందిన ఏడుగురికి, భవానీపురంలో ఒకరికి, పాయకాపురంలోని శాంతినగర్‌లో మరొకరికి, రాణిగారితోటకు చెందిన ఒక మహిళకు కరోనా సోకినట్లు బుధవారం నిర్ధారణ అయ్యింది.


గురువారం నమోదైన ఎనిమిది పాజిటివ్‌ కేసుల్లో విజయవాడ సనత్‌నగర్‌, ఆటోనగర్‌ చెక్‌పోస్టు ప్రాంతాలకు చెందినవారు ఇద్దరు కాగా.. జగ్గయ్యపేటకు చెందినవారు ఇద్దరు, చందర్లపాడు ముప్పాళ్లకు చెందిన ఒకరు, నూజివీడుకు చెందినవారు ఒకరు, జార్ఖండ్‌ నుంచి వచ్చిన మరో యువకుడు ఉన్నారు. చెన్నైలో భవన నిర్మాణ పనులు చేసుకుంటున్న జార్ఖండ్‌వాసులు కొందరు ఒక ట్రక్కులో దాక్కుని తమ ప్రాంతానికి వెళ్తుండగా, వారిని విజయవాడలో అధికారులు అడ్డుకుని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షించారు. ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా, వారిలో ఒక యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని తిరిగి రైలులో జిల్లాకు వస్తున్నవారితో కలిసి ప్రయాణించిన నూజివీడు యువకుడికి కూడా పాజిటివ్‌ రావడం గమనార్హం. 


31 క్వాంటైన్‌ కేంద్రాల్లో 270 మందికి వైద్యసేవలు 

జిల్లాలో కరోనా బాధితులు, అనుమానితుల సంఖ్య పెరుగుతుండంతో  31 క్వారంటైన్‌  కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో గురువారం సాయంత్రానికి  270 మంది వైద్యసేవలు పొందుతున్నట్లు  కలెక్టర్‌ ఇంతియాజ్‌, క్వారంటైన్‌  కేంద్రాల జిల్లా ప్రత్యేక అధికారి పి.విల్సన్‌బాబు తెలిపారు. ఈ కేంద్రాల వద్ద 13 అంబులెన్స్‌లు, వెంటిలేటర్లు, ఎన్‌95 మాస్కులు,  రోగులకు, వైద్యసిబ్బందికి అవసరమైన దుస్తులు సిద్ధంగా ఉంచినట్లు వారు తెలిపారు.  క్వారంటైన్‌ సెంటర్ల వద్ద పటిష్ట పోలీస్‌ బందోస్తును ఏర్పాటు చేశారు. 


పాతబస్తీలో ఆందోళన

వన్‌టౌన్‌: పాతబస్తీలో కరోనా కేసులు నమోదు కావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా అగ్నిమాపక శాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. తాజాగా విద్యాధరపురం గుప్తా సెంటర్‌కు చెందిన వ్యక్తి (35) ఢిల్లీలో జరిగిన ముస్లిం సభకు వెళ్లి వచ్చాడు. అతని తల్లిదండ్రులు గంటల వ్యవధిలోనే చనిపోయారు.


అనుమానంతో అధికారులు ఆ వ్యక్తి తండ్రికి, ఆ వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు, పని మనిషికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనికి ముందు ఆ వ్యక్తి భవానీపురం హెచ్‌బీ కాలనీలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగిని కలవటంతో ఆ ఉద్యోగినికి కూడా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. దీంతో విద్యాధరపురంలో ఐదు కేసులు, భవానీపురం హెచ్‌బీ కాలనీలో ఒక కేసు నమోదయ్యాయి. ఇలా క్రమంగా కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు భౌతిక దూరం పాటించకుండా దుకాణాలు వద్ద గుమిగూడుతున్నారు.


Updated Date - 2020-04-03T09:24:10+05:30 IST