రోహిత్‌కు మళ్లీ పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-06-30T08:44:57+05:30 IST

రోహిత్‌కు మళ్లీ పాజిటివ్‌

రోహిత్‌కు మళ్లీ పాజిటివ్‌

బుమ్రాకు పగ్గాలు?

ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు డౌటే


న్యూఢిల్లీ: కొవిడ్‌ కారణంగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్‌ అయిన ఐదో టెస్ట్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరమవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే అతని స్థానంలో పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. బుధవారం తాజాగా నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌లో రోహిత్‌కు మళ్లీ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో శుక్రవారం నుంచి జరిగే టెస్ట్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గాయంతో కేఎల్‌ రాహుల్‌ కూడా టూర్‌కు అందుబాటులో లేని నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ బుమ్రాకు టెస్ట్‌ సారథ్య బాధ్యతలు అప్పగించే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. ఇదే జరిగితే గత 35 ఏళ్లలో జట్టు పగ్గాలు అందుకొన్న తొలి భారత పేసర్‌గా బుమ్రా రికార్డులకెక్కనున్నాడు. 1987లో కెప్టెన్సీ నుంచి కపిల్‌దేవ్‌ను తప్పించిన తర్వాత మరో ఫాస్ట్‌ బౌలర్‌ భారత జట్టును నడిపించలేదు. విలక్షణమైన బౌలింగ్‌ యాక్షన్‌తో కెరీర్‌లో వేగంగా ఎదిగిన బుమ్రా 29 టెస్టుల్లో 123 వికెట్లు పడగొట్టాడు. అతడిని భవిష్యత్‌ కెప్టెన్‌గా తీర్చిదిద్దుతామని సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ గతంలోనే అన్నాడు. కాగా, పేసర్లకు సారథ్య బాధ్యతలు అందించే సంప్రదాయం భారత్‌లో లేదు. కానీ, పాకిస్థాన్‌ను పేస్‌ దిగ్గజాలు ఇమ్రాన్‌ఖాన్‌, వకార్‌ యూనిస్‌, వసీం అక్రమ్‌, వెస్టిండీస్‌ను కోట్నీ వాల్ష్‌ లాంటి వారు సమర్థంగా నడిపించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్‌ జట్టుకు వరల్డ్‌ నెం.1 పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు బుమ్రాకు కెప్టెన్సీ అప్పగిస్తే.. సంప్రదాయాన్ని బ్రేక్‌ చేయడమే కాకుండా 90 ఏళ్ల భారత టెస్ట్‌ చరిత్రలో బుమ్రా 36వ టెస్ట్‌ సారథిగా నిలవనున్నాడు.


ఓపెనర్లుగా పుజార-గిల్‌?

రోహిత్‌ ఐసోలేషన్‌లో ఉండడంతో.. ఓపెనింగ్‌ జోడీ ఎవరనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో శుభ్‌మన్‌ గిల్‌తో కలసి పుజార ఇన్నింగ్స్‌ను ఆరంభించొచ్చు. విహారి పేరు కూడా వినిపిస్తున్నా.. అనుభవజ్ఞుడైన పుజార వైపే మొగ్గు చూపే అవకాశముందని బోర్డు అధికారి తెలిపారు. ముందు జాగ్రత్త కోసమే మయాంక్‌ అగర్వాల్‌ను పిలిపించారు తప్ప.. తుది జట్టు కూర్పులో అతడు లేడన్నారు. పుజార, గిల్‌, కోహ్లీ, శ్రేయాస్‌, విహారి, పంత్‌తోపాటు జడేజా, బుమ్రా, సిరాజ్‌, షమికి తుది జట్టులో చోటు ఖాయం కాగా.. శార్దూల్‌, అశ్విన్‌లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  


తొలి టీ20కి ‘పాండ్యా’ జట్టు!

టెస్ట్‌ మ్యాచ్‌ జూలై 5న ముగియనుండగా.. 7న సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో తొలి టీ20ని షెడ్యూల్‌ చేశారు. అయితే, టెస్ట్‌ ఆటగాళ్లకు మూడు రోజులు విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావించిన నేపథ్యంలో.. ఐర్లాండ్‌తో పొట్టి సిరీ్‌సకు ఎంపిక చేసిన హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని టీమ్‌నే బరిలో దించడానికి నిర్ణయించారు. రెండో టీ20 నుంచి ఫిట్‌గా ఉన్న స్టార్‌ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉంటారని బోర్డు వర్గాలు తెలిపాయి. 



Updated Date - 2022-06-30T08:44:57+05:30 IST