పదవులు– పరిధులు

ABN , First Publish Date - 2020-02-25T06:51:58+05:30 IST

సుప్రీంకోర్టు క్లిష్టమైన అంశాలపై చెప్పబోయే తీర్పులపై సమాజంలో ముందుగా కాస్తంత ఆందోళన ఉంటున్నప్పటికీ, తీర్పులు వెలువడిన తరువాత వందకోట్లమందీ వాటిని స్వాగతిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ శనివారం న్యూఢిల్లీలో జరిగిన న్యాయసదస్సులో వ్యాఖ్యానించారు.

పదవులు– పరిధులు

సుప్రీంకోర్టు క్లిష్టమైన అంశాలపై చెప్పబోయే తీర్పులపై సమాజంలో ముందుగా కాస్తంత ఆందోళన ఉంటున్నప్పటికీ, తీర్పులు వెలువడిన తరువాత వందకోట్లమందీ వాటిని స్వాగతిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ శనివారం న్యూఢిల్లీలో జరిగిన న్యాయసదస్సులో వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి మూడు ప్రధానాంగాలైన న్యాయ,శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిలో పనిచేసుకుంటూ దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ళను అధిగమించాయని ప్రధాని అన్నారు. అయోధ్య, ముమ్మారు తలాక్‌ ఇత్యాది అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, సందర్భం న్యాయసదస్సు కనుక అభ్యంతర పెట్టాల్సినదేమీ ఉండదు. భారత రాజ్యాంగం ఒక బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థకు పునాది వేసిందంటూ, ఆ స్వరూప స్వభావాలను నిలబెట్టేందుకు, కొనసాగించేందుకు సమష్టిగా కృషిచేస్తామని ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు వెలిబుచ్చిన అభిప్రాయాలపై చర్చ కన్నా, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా వ్యాఖ్యలపై ఇప్పుడు ఎక్కువ రచ్చ జరుగుతున్నది. అంతర్జాతీయ న్యాయసదస్సులో ప్రధాని నరేంద్రమోదీని ఈ న్యాయమూర్తి వ్యక్తిగత ప్రశంసలతో ముంచెత్తారన్నది విమర్శ. 


నరేంద్రమోదీ ఈ సదస్సుకు ప్రారంభోపన్యాసం చేశారు కనుక, ఆయనతో సహా ఉపన్యాసాలు చేసినవారందరినీ పేరుపేరునా గుర్తుచేసుకుంటూ జస్టిస్‌ మిశ్రా చివర్లో ధన్యవాదాలు తెలియచేయవలసి ఉంటుంది. సర్వసాధారణంగా ప్రసంగంలో ఆయా వక్తలు పేర్కొన్న అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఈ పని ముగుస్తుంది. కానీ, ఇక్కడ అతిథులందరూ మహామహులే. సమావేశానికి మోదీ ప్రసంగం చక్కని దిశానిర్దేశం చేసిందనీ, విస్తృతమైన చర్చకు వీలు కల్పించిందని పేర్కొన్న మిశ్రా తన ప్రసంగంలో భాగంగా ఎక్కువ మోతాదులో ఆయనను వ్యక్తిగతంగా మెచ్చుకున్నారు. అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ సమాజానికి మంచి మిత్రుడిగా అవతరించిందన్నారు. ప్రపంచస్థాయిలో ఆలోచిస్తూ, ఆచరణను దేశస్థాయికి అన్వయించగల వ్యక్తి మోదీ అంటూ ఆయన ప్రసంగానికి తన ధన్యవాదాలు తెలియచేశారు. వివాదానికి కారణమైన ఈ మాటలను పక్కనెబెడితే జస్టిస్‌ మిశ్రా తన ప్రసంగంలో వెలిబుచ్చిన ఇతరత్రా అంశాలు ఎంతో చక్కనివి. న్యాయవ్యవస్థను వెన్నెముకతో, శాసనవ్యవస్థను గుండెతో, పాలనావ్యవస్థను మెదడుతో పోల్చుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మూడు వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలన్నారు ఆయన. కానీ, ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రధానిని పదవిలో ఉన్న ఒక న్యాయమూర్తి ఇలా ఘనంగా కీర్తించడం విమర్శలకు తావిచ్చింది. 


కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలు సరైనవో కావో నిర్ణయించేది న్యాయమూర్తులే. వాటిని కూలంకషంగా పరిశీలించి, రాజ్యాంగానికీ, చట్టాలకు అనుగుణంగా ఉన్నవీ లేనిదీ తేల్చేది వారే. ప్రధాన న్యాయమూర్తి ఈ సదస్సులో హామీ ఇచ్చినట్టుగా భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించాల్సింది వారే. అలా ఉండటమే కాక, దాని స్వతంత్రతమీద ప్రజల్లో ఎటువంటి అపోహలకూ తావివ్వని విధంగా నడుచుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. మోదీని ప్రశంసించడం ఒక రాజకీయపార్టీగా కాంగ్రెస్‌కు నచ్చదు కనుక, దాని విమర్శలను అటుంచినా, కొందరు మాజీ న్యాయమూర్తులు సైతం ఇటువంటి వ్యాఖ్యలు కూడదన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ పెద్దను ప్రశంసలతో ముంచెత్తితే న్యాయవ్యవస్థ స్వతంత్రతమీదా, ఈ రెండిటి మధ్యా రాజ్యాంగపరంగా పాటించాల్సిన దూరంమీదా ప్రజల్లో అనవసరపు అనుమానాలు రేగుతాయన్నది వారి భావన. భారత ప్రభుత్వం అతిపెద్ద కక్షిదారుగా ఉంటూ, చట్టం ముందు మిగతా పౌరులతో సమానమైనప్పుడు ఇటువంటి ప్రశంసలు కేసుల సందర్భంగా న్యాయమూర్తులు సమదృష్టితో వ్యవహరిస్తారా అన్న అనుమానానికి ఆస్కారం కల్పిస్తాయన్నది వాదన. ‘మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ’ అన్న అంశంపై 20దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన ఈ సదస్సు భారత న్యాయవ్యవస్థ కూడా మారిపోతున్నదన్న అభిప్రాయం కలిగించకుండా ఉంటే బాగుండేది.

Updated Date - 2020-02-25T06:51:58+05:30 IST