పార్లమెంట్‌ యూనిట్‌గా పదవులు

ABN , First Publish Date - 2020-06-07T06:28:30+05:30 IST

టీడీపీ జిల్లా కార్యవర్గ స్వరూపం మారనున్నది. పార్లమెంట్‌ నియోజక వర్గాన్ని యూనిట్‌గా తీసుకొని జిల్లా పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు కానున్నాయి.

పార్లమెంట్‌ యూనిట్‌గా పదవులు

  • మారనున్న టీడీపీ జిల్లా కార్యవర్గ స్వరూపం
  • నెల్లూరు,తిరుపతిలకు వేర్వేరుగా ఎంపిక
  • జిల్లా సమన్వయానికి ప్రత్యేక ప్రతినిధులు
  • భారీగా పెరగనున్న పార్టీ పోస్టులు


నెల్లూరు, జూన్‌6 :  టీడీపీ జిల్లా కార్యవర్గ స్వరూపం మారనున్నది. పార్లమెంట్‌ నియోజక వర్గాన్ని యూనిట్‌గా తీసుకొని జిల్లా పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో రెండు వేర్వేరు కార్యవర్గాలు ఏర్పాటు అవుతాయి. దీనివల్ల పార్టీ కార్యవర్గం, అనుబంధ సంస్థల్లో పదవుల సంఖ్య  గణనీయంగా పెరగ నుంది. భవిష్యత్తులో పార్లమెంట్‌ సెగ్మెంట్‌ యూనిట్‌గా జిల్లాల విభజన జరిగినా పార్టీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చూడటం కోసం రాష్ట్ర పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సూళ్లూరుపేట, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల మండల కమిటీల ఏర్పాటు తరువాత జిల్లా కార్యవర్గ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. 


రెండు కార్యవర్గాల ఎంపిక

జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలో రెండు కార్యవర్గాలు ఏర్పాటు కానున్నాయి. నెల్లూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేస్తారు. ఈ కార్యవర్గం నెల్లూరు  కేంద్రంగా పనిచేస్తుంది. ఇక తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలు తిరుపతి జిల్లా కార్యవర్గం పరిధిలోకి వస్తాయి. జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గాలకు కలిపి మరో కార్యవర్గం ఏర్పాటు చేస్తారు. ఈ ఏడు నియోజకవర్గాలకు వేరుగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఇతర కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తిరుపతి కేంద్రంగా పనిచేస్తుంది. 


సీనియర్లతో సమన్వయ  కమిటీ

పార్లమెంట్‌ సెగ్మెంట్ల వారీగా జిల్లా పరిధిలోని పది నియోజకవర్గాలు రెండు ముక్కలైనా ఈ రెండింటిని పర్యవేక్షించడానికి జిల్లా పరిధిలో సీనియర్లతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తారు. ముగ్గురు, లేదా ఐదుగురు సీనియర్‌ నాయకులతో జిల్లా సమన్వయ కమిటీ ఏర్పడుతుంది. జిల్లా సమష్టిగా నిర్వహించాల్సిన రాజకీయ కార్యకలాపాలు, ఆందోళనలకు ఈ సమన్వయ కమిటీ సారధ్యం వహిస్తుంది. పార్టీ పరంగా అంతర్గత కార్యకలాపాలు, ఇతర రాజకీయ కార్యకలాపాలు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో నడుస్తాయి. 


భారీగా పెరగనున్న పార్టీ పోస్టులు

పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు కానున్న పార్టీ కార్యవర్గాల ద్వారా జిల్లాలో పార్టీ పదవుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పదవులతో పాటు అనుబంధ సంఘాల పదవులు పెరుగుతాయి. తిరుపతి పార్లమెంట్‌ యూనిట్‌గా ఏర్పడబోయే పార్టీ కార్యవర్గంలో  జిల్లాకు చెందిన నాయకునికి అధ్యక్ష పదవి లేదా, ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు అద్యక్ష పదవులు, లేదా ఒక అధ్యక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శుల పదవులు దక్కుతాయి. జిల్లా కార్యవర్గంలో కూడా ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 50 శాతం పదవులు పెరగనున్నాయి. అలాగే పార్లమెంట్‌ సెగ్మెంట్ల వారీగా జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు కానుండటంతో అనుబంధ సంఘాల్లోనూ పదవుల సంఖ్య 50 శాతం పెరుగుతాయి. రెండుగా ఏర్పాటు కానున్న పార్టీ కార్యవర్గాలు, అనుబంధ సంఘాల్లో జిల్లాకు చెందిన సుమారు 60 మందికి అదనంగా పార్టీ పదవులు దక్కనున్నాయి. 


మిశ్రమ ఫలితాలు 

పార్లమెంట్‌ సెగ్మెంట్ల వారీగా పార్టీ కార్యవర్గాల ఏర్పాటు వల్ల మిశ్రమ ఫలితాలు కనిపించబోతున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరిధి తగ్గుతుంది. దీంతో కార్యవర్గం గ్రామస్థాయి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేసే అవకాశం కలుగుతుంది. పార్టీ కార్యవర్గంలో ఎక్కువ మందికి అవకాశం లభించడం వల్ల కొత్త నాయకత్వం రంగంలోకి వస్తుంది. ఎంతో కాలంగా పార్టీకి సేవ చేసిన వారిలో ఎక్కువ మందికి పదవులు దక్కుతాయి. నియోజకవర్గ స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం వరకు ఈ ప్రయోగం వల్ల కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఇక  జిల్లా పరిధిలోని నాలుగు నియోజకర్గాలకు పార్టీ పరంగా తిరుపతి కేంద్రం కావడం ప్రతికూలాంశం. నెల్లూరు నగరం సరిహద్దుల్లో ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం, కూతవేటు దూరంలో ఉన్న గూడూరు నియోజకవర్గాలకు పార్టీ కార్యకలాపాలకు తిరుపతికి, ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోకవర్గ పార్టీ శ్రేణులు నెల్లూరు నగరానికి రావాల్సి ఉండటం ప్రతికూలాంశం. ఈ నియోజకవర్గాల పార్టీ కార్యాలయాలు పక్క జిల్లాలో ఉండటం, అవే నియోజకవర్గ పార్టీ కార్యకలాపాలకు వేదికలు కావడం ఇబ్బందికరంగా  ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Updated Date - 2020-06-07T06:28:30+05:30 IST