కొత్తగూడెం కోర్టు తీర్పు
కొత్తగూడెం లీగల్, మార్చి 31: ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కొత్తగూడెం కోర్టు విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు జిల్లా జడ్జి, పుల్ అడిషనల్ చార్జ్ ఫోక్సో కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పును చెప్పారు. పినపాకకు చెందిన కొండూరు సుశీలకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెను తూర్పుగోదావరి జిల్లా యటపాక మండలం తుమ్మలనగర్‌కు చెందిన నర్సింహరావుతో వివాహం జరిపించారు. భార్యాభర్తలు ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవిస్తు న్నారు. 2016 ఆగస్టు 18న కొండూరు సుశీల చిన్న కూతురు(మైనర్) తప్పిపోయింది. అప్పటి ఏడూళ్ల బయ్యారం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కు 2016 సెప్టెంబర్ 15న సుశీల ఫిర్యాదు చేసింది. తన అలుడు నర్సింహారావు పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మణుగూరు డీఎస్పీ అశోక్‌కుమార్ విచారణ జరిపి తప్పిపోయింది బాలిక కావడంతో ఫోక్సో యాక్టు ప్రకారం ఈ కేసును బదిలీ చేశారు. సుశీల కూతురు అప్పుడు పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తుండటంతో ఆమెను ఇంటి వద్ద నుంచి కేంద్రం వరకు ఆమె అల్లుడు నర్సింహారావు తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు. పరీక్షలు పూర్తయిన అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. 2016 ఆగస్టు 15న సదరు బాలికను సికింద్రాబాద్‌కు బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కొద్ది రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు. కాగా సుశీల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ అనంతరం నర్సింహారావు, ఆయన బంధువులు దివ్య, వసుంధర పై కేసు నమోదు చేసి కోర్టులో చార్ట్షీట్ దాఖలు చేశారు. 18మంది సాక్షులను విచారించిన అనంతరం నర్సింహారావుపై నేరం రుజువైందని కోర్టు తీర్పు చెప్పింది. ఫోక్సో యాక్టు ప్రకారం 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.10వేల జరిమానాతోపాటుగా భారత శిక్షాస్మృతి 366 ప్రకారం మరో ఐదు సంవత్స రాలు సాధారణ జైలు శిక్ష, రూ. ఐదువేలు జరిమానా విధించారు. ఈ శిక్షలు ఏకకాలంలో అనుభవించాలన్నారు. ఈ కేసులో దివ్య, రాయల వసుంధర, అలియాస్ సుందరమ్మపై నేరం రుజువు కాకపోవడంతో వారిని విడుదల చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పోక్సో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడి. లక్ష్మి వాదించగా లైజన్ ఆఫీసర్లుగా వీరబాబు, హరిగోపాల్, కోర్టు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డిలు సహకరించారు.
పోక్సో కేసులో నిందితుడి రిమాండ్
దుమ్ముగూడెం మార్చి 31: మండల పరిది రామచంద్రుడిపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల పదో తరగతి విద్యార్దిని(16) ఆత్మహత్య సంఘటనలో నిందితుడిని గురువారం ఏఎస్పీ రోహిత్‌రాజు రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్యకు కారకుడిగా అనుమానిస్తూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలం భూపతిరావుపేటకు చెందిన తెల్లం పవన్ అనే నిందితుడిపై ఈనెల 27న పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ సంఘటనకు భాద్యులుగా గుర్తిస్తూ పాఠశాల హెచ్ఎం సామ్రాజ్యంతోపాటు, టీచరు మట్టా రామారావులు సస్సెన్షన్‌కు గురవగా, ఆశ్రమపాఠశాలలోని పదహారు మంది ఉపాధ్యాయులకు పీవో షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే కాంట్రాక్టు ఏఎన్ఎంను విధుల నుంచి పూర్తిగా తొలగించారు.