Immigration: విదేశీయులకు పోర్చుగల్ బంపర్ ఆఫర్!

ABN , First Publish Date - 2022-08-12T00:30:55+05:30 IST

కార్మికుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోర్చుగల్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Immigration: విదేశీయులకు పోర్చుగల్ బంపర్ ఆఫర్!

ఎన్నారై డెస్క్: కార్మికుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోర్చుగల్(Portugal) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయలను దేశంలోకి సులభంగా అనుమతించేలా వలసల చట్టానికి(Immigration law) ముఖ్యమైన మార్పులు చేసింది. దేశాధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సోసా తాజాగా దీనికి ఆమోదం తెలిపారు. ఇమిగ్రేషన్ చట్టానికి మార్పులు చేసే బిల్లు జులైలో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకే సభ్యులు మెజారిటీ ఓటుతో వీటికి ఆమోదం తెలిపారు. సోషలిస్ట్, లెఫ్ట్ పార్టీలు కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేశాయి. త్వరలో ఇది అమల్లోకి రానుంది. 


ఇక కొత్త చట్టం ప్రకారం.. పోర్చుగల్‌లో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు తాత్కాలిక ప్రాతిపదికన 120 రోజుల కాలపరిమితిగల వీసా జారీ చేస్తారు. అంతేకాకుండా.. వీసాను మరో 60 రోజులకు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇక వర్క్ ఫ్రం హోం కల్చర్‌కు అనుగూణంగా కూడా పోర్చుగల్ కొన్ని కీలక సంస్కరణలకు తీసుకొచ్చింది. తద్వారా.. ‘డిజిటల్ నోమాడ్’లకు(Digital nomad) మరిన్ని ప్రయోజనాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం వర్క్ ఫ్రం(work from home) ఎంచుకున్న అనేక మంది వివిధ దేశాల్లో పర్యటిస్తూ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి వారిని ‘డిజిటల్ నోమాడ్’ అని పిలుస్తారు. కాగా, కార్మికులు, ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్న దేశానికి ఈ సంస్కరణల వల్ల ప్రయోజం ఉంటుందని పోర్చుగల్ ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నివేదిక ప్రకారం.. కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైన రంగాల్లో పోర్చుగల్‌ పర్యాటక రంగం ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది. పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన టూరిజం, నిర్మాణ రంగాల్లో కార్మికుల కొరత అధికంగా ఉంది. 

Updated Date - 2022-08-12T00:30:55+05:30 IST