పీపీపీలోకి పోర్టు ఆస్పత్రి

ABN , First Publish Date - 2022-08-06T06:44:57+05:30 IST

నిరుపయోగంగా వున్న స్థిరాస్తులను లీజుకు, అద్దెకు, అభివృద్ధికి ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా విశాఖపట్నం పోర్టు అథారిటీ అడుగులు వేస్తున్నట్టు చైర్మన్‌ కె.రామమోహన్‌రావు తెలిపారు.

పీపీపీలోకి పోర్టు ఆస్పత్రి
పోర్టు ఆస్పత్రి

ప్రతిపాదనలు సిద్ధం

ఏ సంస్థ అయినా ముందుకొస్తే అప్పగిస్తాం

ఇప్పటి మాదిరిగానే పోర్టు ఉద్యోగుల కుటుంబాలకు ఉచితంగా వైద్యం

పెద్ద పెద్ద సంస్థలను ఆకర్షించేందుకు సాలగ్రామపురంలో రూ.3 కోట్లతో రహదారుల విస్తరణ

టాంప్‌ ఆమోదం మేరకు రహేజాకు 17 ఎకరాలు 

ఆదాయం పెంపు కోసమే పోర్టు స్టేడియం, కళావాణి ఆడిటోరియం, సీతారామ కల్యాణ మండపం, డీసీఐ పాత భవనం వంటివి లీజుకు ఇవ్వాలని నిర్ణయం

‘ఆంధ్రజ్యోతి’తో విశాఖ పోర్టు చైర్మన్‌ కె.రామమోహన్‌రావు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నిరుపయోగంగా వున్న స్థిరాస్తులను లీజుకు, అద్దెకు, అభివృద్ధికి ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా విశాఖపట్నం పోర్టు అథారిటీ అడుగులు వేస్తున్నట్టు చైర్మన్‌ కె.రామమోహన్‌రావు తెలిపారు. ఆయన శుక్రవారం ప్రత్యేకంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో వున్న పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రిని ముంబైలో మాదిరిగా పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. పోర్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం 1984లో 80 పడకలతో దీనిని ఏర్పాటుచేయగా, 180 పడకలకు పెంచుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అందులో 15 మంది డాక్టర్లు, సుమారు 100 మంది నర్సింగ్‌, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ముంబై పోర్టు ఇటీవల తన ఆస్పత్రిని పీపీపీలో అభివృద్ధి చేసిందని, విశాఖలో కూడా అదేవిధంగా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఏ సంస్థ అయినా ముందుకువస్తే 200 పడకలకు దానిని అభివృద్ధి చేసేందుకు ఇస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి ఆ సంస్థే జీతభత్యాలు ఇచ్చుకోవలసి ఉంటుందన్నారు. అంతేకాకుండా పోర్టు ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబాలకు ఇప్పటిలాగే ఉచితంగా వైద్యం చేయాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ పాటిస్తూ ఆ సంస్థకు వచ్చే ఆదాయంలో కొంత పోర్టుకు ఇవ్వాల్సి వుంటుందని వివరించారు. అదనంగా అవసరమైన సిబ్బందిని వారే నియమించుకోవలసి ఉంటుందని, దీనివల్ల ఉద్యోగులకు ఆధునిక వైద్యం అందడంతో పాటు పోర్టుకు కూడా అదనపు ఆదాయం వస్తుందన్నారు.


రూ.3 కోట్లతో రహదారుల విస్తరణ

సాలిగ్రామపురంలో పోర్టుకు పెద్ద సంఖ్యలో భూములు ఉన్నాయని, వాటిని లీజుకు, అద్దెకు ఇస్తున్నందున, పెద్ద పెద్ద సంస్థలు అక్కడకు రావాలంటే విశాలమైన రహదారులు అవసరం కాబట్టి ప్రస్తుతం వున్న 50 అడుగుల రహదారులను 100 అడుగులకు విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి రూ.3 కోట్ల వరకు వెచ్చిస్తున్నామని చెప్పారు. 


టాంప్‌ ఆమోదం మేరకు రహేజాకు లీజు 

సాలగ్రామపురంలో ఒకే దగ్గర 17 ఎకరాల భూమిని లీజుకు ఇస్తామని ముందు ప్రకటించినప్పుడు చ.మీ. అద్దె ధర రూ.2 వేలు నిర్ణయించగా ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఆయన వివరించారు. దాంతో ఒక కమిటీని వేసి...ఆ ప్రాంతంలో భూముల ధరలు, లీజులపై అధ్యయనం చేయించామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసి టారిఫ్‌ అథారిటీ ఆఫ్‌ మేజర్‌ పోర్ట్సు(టాంప్‌)కు పంపించగా, ఖాళీగా ఉంచడం కంటే ధర తగ్గించి లీజుకు ఇవ్వడం వల్ల ఆదాయం వస్తుందని సూచించిందన్నారు. ఆ మేరకు లీజు ధరను చదరపు మీటరుకు రూ.800కు తగ్గిస్తే...రహేజా ముందుకు వచ్చిందన్నారు. ఆ సంస్థ నుంచి 30 ఏళ్ల లీజు మొత్తం రూ.125 కోట్లు ఒకేసారి ముందుగా తీసుకున్నామన్నారు. ఏటా లీజు చెల్లిస్తే రూ.5.5 కోట్లు అవుతుందని, ఒక్కసారి రూ.125 కోట్లు తీసుకొని బ్యాంకులో వేయడం వల్ల దానిపై ఏడాదికి రూ.10 కోట్ల వడ్డీ వస్తుందన్నారు. రెట్టింపు ఆదాయం సమకూరుతుందన్నారు. సాలగ్రామపురంలో ఇంకా 30 ఎకరాల వరకు భూములు ఉన్నాయని, ఎవరికైనా ఆసక్తి వుంటే అదే ధరకు తీసుకోవచ్చునన్నారు. రహదారుల విస్తరణ వల్ల భూమి విలువ పెరుగుతుందని, అప్పుడు పెద్ద సంస్థలు ముందుకువస్తాయనే వాటిపై ఖర్చు పెడుతున్నామన్నారు. 


అన్నింటిపైన ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం

పోర్టుకు సంబంఽధించి అనేక ఆస్తులు ఉన్నాయని వాటి ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయం కంటే ఇంకా మెరుగైన ఆదాయం ఎలా వస్తుందనే దానిపై కసరత్తు చేస్తున్నామని  రామమోహన్‌రావు పేర్కొన్నారు. అందులో భాగంగానే పోర్టు స్టేడియం, కళావాణి ఆడిటోరియం, సీతారామ కల్యాణ మండపం, డీసీఐ పాత భవనం వంటివి లీజుకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అక్కడ ఇప్పుడు అందుతున్న సేవలు యథాతధంగా కొనసాగిస్తూనే వాటిని మరింత సమర్థంగా ఉపయోగించుకొని ఆదాయం పెంచుకోవడమే సంస్థ లక్ష్యమన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు సేవలు లేకుండా చేయడం అనే ఆలోచనే లేదని, వారి ప్రయోజనాలు కాపాడుతూనే పోర్టు ఆదాయం పెంచుతున్నామని వివరించారు. 

Updated Date - 2022-08-06T06:44:57+05:30 IST