ఇన్నాళ్లకు ‘ఆదరణ’

ABN , First Publish Date - 2021-07-30T05:05:40+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మూలుగుతున్న ఆదరణ పరికరాలకు మోక్షం కలగనుంది. వీటి పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి జాబితాలో ఉన్న లబ్ధిదారులు పది శాతం సొమ్ము చెల్లించేలా చూడాలని భావిస్తున్నారు.

ఇన్నాళ్లకు ‘ఆదరణ’
ఎస్‌.కోట మండల పరిషత్‌ కార్యాలయంలో భద్రపరిచిన ఆదరణ పరికరాలు

అప్పట్లో మిగిలిన పరికరాల పంపిణీకి సన్నాహాలు

ఎమ్మెల్యేల సిఫారసులకు ప్రాధాన్యం

వైసీపీ కార్యకర్తలకు అందేలా ప్రయత్నాలు

శృంగవరపుకోట, జూలై 29:

 జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మూలుగుతున్న ఆదరణ పరికరాలకు మోక్షం కలగనుంది. వీటి పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి జాబితాలో ఉన్న లబ్ధిదారులు పది శాతం సొమ్ము చెల్లించేలా చూడాలని భావిస్తున్నారు. అదే జరిగితే గత ప్రభుత్వంలో పది శాతం వాటా చెల్లించే లబ్ధిదారులకు అన్యాయం జరగనుంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.  ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్‌ మెషీన్లు, సెలూన్‌ కుర్చీలు, కుట్టు మిషన్లు, కల్లుగీత కార్మికులకు సైకిళ్లు, వడ్రంగి పరికరాలు ఇలా వివిధ చేతి వృత్తుల వారికి ఆదరణ పథకం కింద 90శాతం రాయితీతో పరికరాలు అందించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు అర్హులైన చేతి వృత్తిదారులందరికీ వీటిని పంపిణీ చేశారు. లబ్ధిదారుల వాటాగా పది శాతాన్ని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసూలు చేసింది. పంపిణీ జరుగుతున్న క్రమంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో అధికారులు పంపిణీని నిలిపేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారం చేపట్టింది. అప్పటి నుంచి మిగిలిన లబ్ధిదారులకు ఈ పరికరాలను ఇవ్వకుండా ఉంచేశారు. అప్పటి నుంచీ నియోజకవర్గ కేంద్రాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు మండల పరిషత్‌ అధికారులకు సమాచారం అందించారు. గత ప్రభుత్వంలో మంజూరైన లబ్ధిదారులకు ఇవ్వాలా? కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందించాలా అన్న విషయంలో స్పష్టత లేదు. శాసన సభ్యుల దృష్టిలో పెట్టి ఇవ్వాలని మాత్రమే మండల పరిషత్‌ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఉన్న పరికరాల వివరాలను జిల్లా ఉన్నతాధికారులు రాబట్టారు. జిల్లా వ్యాప్తంగా 537 యూనిట్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు అందిస్తే వైసీపీ కార్యకర్తలకు, వారి అనుయాయులకే దక్కే అవకాశాలు ఎక్కువ. గత ప్రభుత్వంలో పది శాతం వాటా సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదరణ పరికరాల వివరాలను జిల్లా ఉన్నతాధికారులు అడిగారని శృంగవరపుకోట ఇన్‌చార్జి ఎంపీడీవో ఎంవీఏ శ్రీనివాసరావు తెలిపారు. వాటి పంపిణీకి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు.

 


Updated Date - 2021-07-30T05:05:40+05:30 IST