Abn logo
Sep 25 2021 @ 01:44AM

పాపులర్‌ మొబైల్‌ పేమెంట్‌ యాప్స్‌

 నోట్ల రద్దుతో భారతదేశంలో పేమెంట్‌ యాప్స్‌ వాడకం ఎక్కువైంది.  కరోనా సంక్షోభంతో ఇది వటవృక్షం మాదిరి వేళ్ళూనుకుంది. ‘పేటీఎం’, ‘గూగుల్‌ పే’, ‘ఫోన్‌పే’, ‘భీమ్‌’ వంటి యాప్స్‌ను ఉపయోగించే మొబైల్‌ వినియోగదారుల సంఖ్య కోట్లకు చేరుకుంది. వీధిలో కూరగాయల కొట్టు, పాన్‌ డబ్బా, అరటిపండ్ల బండి వరకు అన్నిచోట్లా మొబైల్‌ యాప్‌లతో లావాదేవీలు కొనసాగిస్తున్న వైనం తెలిసిందే. భౌతిక దూరం పాటించేందుకూ ఇది ఉపయోగపడుతుండటం విశేషం. 


ఉదాహరణకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 2016 డిసెంబర్‌లో ‘భీమ్‌’ యాప్‌ను ఆరంభించింది. 2017 సెప్టెంబరులో గూగుల్‌ - గూగుల్‌ యాప్‌ను ప్రారంభించింది. అదే తరహాలో యూపీఐ ఆధారిత మైక్రో పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న టాప్‌ యాప్‌లను చూద్దాం.  


‘పేటీఎం’

‘ఈ వాలెట్‌’గా ఇది ఇండియాలో ఆరంభమైంది. భారత ప్రభుత్వం యూపీఐని పరిచయం చేసిన తరవాత, పేటీఎం వాలెట్‌తో  మైక్రో పేమెంట్స్‌కు తోడు ఇంటి అద్దె నుంచి సర్కారు బిల్లుల వరకు  సులువుగా చెల్లించగలుగుతున్నారు. 


‘గూగుల్‌ పే’

2017 సెప్టెంబరులో టెజ్‌ పేరిట గూగుల్‌ పే మొదట ఆరంభమైంది. యూపీఐని వాడుకోవడం ఆరంభించిన తరవాత 2018 ఆగస్టులో గూగుల్‌ పేగా మారింది. ప్రస్తుతం పలు దేశాల్లో ఈ యాప్‌ పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ అలాగే ఐఓఎస్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు అన్నింటిలో ఇది పనిచేస్తుంది. 


‘భీమ్‌’  

ఇది కూడా యూపీఐ ఆధారిత యాప్‌. ఎన్‌పీసీఐ దీన్ని అభివృద్ధి పర్చింది. 2016 డిసెంబరులో ఆరంభమైంది. ఆండ్రాయిడ్‌ 5 ఆపై వాటితో రన్‌ అయ్యే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లు, ఐఓఎస్‌ 9, ఆపై వాటితో  పనిచేసే ఐఫోన్లలో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఇంగ్లీష్‌, తెలుగు సహా పదహారు భారతీయ భాషలను ఈ ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తుంది. 


‘యాపిల్‌ పే’

యాపిల్‌కు చెందిన ఐఫోన్లు, ఐపాడ్లు, మేక్‌బుక్‌, యాపిల్‌ వాచీ సిరీస్‌లో ఈ యాప్‌తో పేమెంట్స్‌ జరపవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ లేదంటే ప్రీపెయిడ్‌ కార్డు సహకారంతో లావాదేవీలు జరపొచ్చు. వ్యాపారుల దగ్గర కూడా దీన్ని హాయిగా ఉపయోగించుకోవచ్చు. 


‘శామ్‌సంగ్‌ పే’

గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, గెలాక్సీ టాబ్లెట్స్‌, గెలాక్సీ స్మార్ట్‌ వాచెస్‌లో ఇది పనిచేస్తుంది. గూగుల్‌ పే వర్క్‌ చేసే వ్యవస్థల్లోనూ ఇది పనిచేస్తుంది. 27 దేశాల్లో దీని ఉనికి ఉంది. వీసా, మాస్టర్‌ కార్డ్‌, డిస్కవర్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌     సపోర్ట్‌తో పనిచేస్తుంది. 


‘అమెజాన్‌ పే’

జనాదరణ పొందిన ఆన్‌లైన్‌ పేమెంట్‌ వేదిక ఇది. ఇండియాలో అమెజాన్‌ కోసమే కాకుండా దీన్ని ‘స్విగ్గీ’, ‘ఉబర్‌’ తదితరాలకూ ఉపయోగించుకోవచ్చు. 


‘పేజాప్‌’

2015 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దీన్ని ప్రారంభించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అకౌంట్‌తో లింక్‌ అయిన ఈ వాలెట్‌ ఇది. మూవీ టికెట్లు, బిల్లుల చెల్లింపు, గ్రాసరీ కొనుగోలుకూ దీన్ని ఉపయోగించవచ్చు.