జనం మెచ్చిన జానపదం!

ABN , First Publish Date - 2021-03-14T05:51:13+05:30 IST

ఒక సన్నివేశానికి అనుగుణంగా కవి స్పందించినప్పుడు పుట్టేది సినిమా పాట. దీనికి కొన్ని కొలతలు.. లెక్కలు ఉంటాయి. జన పదాల భావాలలోనుంచి పుట్టేది జానపద గీతం. ఇవి మనుషుల మనసు లోతుల్లోనుంచి వచ్చే స్వచ్ఛమైన భావాలకు ప్రతిరూపం

జనం మెచ్చిన జానపదం!

ఒక సన్నివేశానికి అనుగుణంగా కవి స్పందించినప్పుడు పుట్టేది సినిమా పాట. దీనికి కొన్ని కొలతలు.. లెక్కలు ఉంటాయి. జన పదాల భావాలలోనుంచి పుట్టేది జానపద గీతం. ఇవి మనుషుల మనసు లోతుల్లోనుంచి వచ్చే స్వచ్ఛమైన భావాలకు ప్రతిరూపం. వీటికి కొలతలు.. లెక్కలు ఉండవు. ప్రజా బాహుళ్యంలో ప్రచారం పొందుతాయి. ప్రతి వ్యక్తి పెదవులపైనా ఆడతాయి. బహుశా అందుకే చాలా కాలంగా సినీ రచయితలు జానపదాల పల్లవులను తీసుకొని వాటిని తమ సన్నివేశాలకు అనుగుణంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేసే ప్రతి ప్రయత్నంలోను విజయ వంతమవుతున్నారు.


ఈ మధ్య కాలంలో జానపద బాణీల ఆధారంగా విడుదలయిన ఏ గీతాన్నైనా తీసుకోండి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ ఉంటాయి. వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటం ఈ పాటల ప్రధాన లక్షణం. అంతే కాకుండా అప్పటికే ఒక ట్యూన్‌ ప్రచారం ఉంటుంది కాబట్టి దానికి మెరుగులు దిద్ది అందచేయటం కూడా సంగీత దర్శకుడికి సులభమవుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో జానపద గీతాలను చాలా పొదుపుగా మాత్రమే ఉపయోగించేవారు. పెద్ద పెద్ద హీరోల చిత్రాలలో జానపద బాణీల సంఖ్య తక్కువగానే ఉండేది. దాశరధి రంగాచార్య రాసిన చిల్లరదేవుళ్ల నవల ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమాలో జానపద గీతాలైనా.. ‘రంగుల కల’  సినిమాలో గద్దర్‌ పాడిన బండెనక బండి కట్టి.. పాట అయినా విపరీతంగా పాపులర్‌ అయ్యాయి.


కానీ ఆ సమయంలో ఇంటర్నెట్‌ లేకపోవటం.. జానపద గీతాలు కేవలం క్యాసెట్ల రూపంలో మాత్రమే ప్రచారంలో ఉండటంతో సినీ సంగీత దర్శకుల దృష్టి వీటిపై పడలేదనే చెప్పాలి. భక్తకన్నప్ప చిత్రంలోని ‘ఎన్నియలో.. ఎన్నియలో చందమామ’ పాట జానపద బాణే అయినా చరణాలన్నీ కొత్తగా రాసినవే! ఇక కొత్త తరం సంగీత దర్శకులలో మళ్లీ ఈ జానపద ఒరవడిని ప్రవేశపెట్టిన వారిలో ఆర్‌.పి. పట్నాయక్‌ను, విప్లవ సినిమాల ఆర్‌. నారాయణమూర్తిని ప్రముఖంగా చెప్పాలి. ఆర్‌.పి. సంగీత దర్శకత్వంలో వచ్చిన ఉత్తరాంధ్ర జానపద గీతం- ‘‘గాజువాక పిల్ల మేము గాజులోళ్లం కాద’’- సంచలనాన్ని రేకెత్తించింది. 


ఇక ఆర్‌.నారాయణమూర్తి తీసిన ప్రతి సినిమాలోను రెండు మూడు జానపదగీతాలు తప్పనిసరిగా మనకు వినిపిస్తాయి. ఆ తర్వాత అడపదడపా కొన్ని పాటలు వచ్చినా- అత్తారింటికి దారేది సినిమాలోని ‘బేట్రాయి సామి దేవుడ’ పాట వల్ల జానపద పాటలకు కొత్త క్రేజ్‌ వచ్చింది. ఈ మధ్యకాలంలో వచ్చిన- నాయుడోళ్లింటి కాడ (బ్రహోత్సవం),  ‘సిత్తరాల సిరపడు’, రాములో రాములా (అల వైకుంఠపురములో), ‘వాని ఎద మీద ఉండేటి గమగమ’ (ఇస్మార్ట్‌ శంకర్‌), ‘ఎన్నియాలో ఎన్నియాలో’(రాజా ది గ్రేట్‌), ‘ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ’(రంగస్థలం) మొదలైన పాటలన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. దీనితో ప్రతి సినిమాలోను ఒక జానపద గీతాన్ని తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటున్నారు. యూట్యూబ్‌ ప్రతి పల్లెకు విస్తరించిన తర్వాత వందల సంఖ్యలో గాయనీగాయకులు జానపద గీతాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. వీటిలో బాగా పేరు పొందిన పాటలు కొన్ని సినిమాల్లో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. 


వివాదాలు కూడా..

జానపద గీతాల్లో కొంత భాగాన్నీ, లేకపోతే పల్లవిని మాత్రం తీసుకుని రాసిన సినిమా పాటలు తెలుగులో ఎన్నో ఉన్నాయి.  కొన్ని జానపద గీతాలను కవులు తమ ఖాతాలోకి వేసుకుంటే, మరి కొంతమంది మాత్రం నిజాయితీగా తమ పాటకు ఏ జానపద గీతం మూలమో పేర్కొంటూ క్రెడిట్‌ ఇస్తుంటారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, వేటూరి వంటి ప్రముఖ గేయరచయితలు జానపద గీతాల నుంచి స్ఫూర్తి పొంది, అద్భుతమైన పాటలు ఎన్నో రాశారు. అయితే ఈ మధ్యకాలంలో జానపద గీతాలలో చరణాలను మార్చటం కూడా వివాదాస్పదమవుతోంది.  గతంలో రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ చిత్రంలోని ఓ పాటలో  ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అనే పల్లవిని వాడినందుకు గీత రచయిత వండపండు అభ్యంతరం చెప్పారు. ఇది ఒక చిన్నపాటి వివాదంగా మారి సమసిపోయింది. ఇక తాజాగా ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట పల్లవి కూడా వివాదానికి దారి తీసింది. ఈ వివాదం కూడా ముదరకముందే సమసిపోయింది.  జనపదం ఉన్నంత కాలం జానపదం ఉంటుందనేది ఒక నానుడి. అయితే ఒకప్పుడు ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ టెక్నాలజీ పుణ్యమాఅని జానపదం కూడా విశ్వవ్యాప్తమవుతోంది. 


జానపదానికి పెద్ద పీట..

దాశరథి రంగాచార్య రాసిన  ‘చిల్లర దేవుళ్లు’ ఆధారంగా అదే పేరుతో రూపుదిద్దుకొన్న చిత్రంలో జానపద గీతాలకు పెద్ద పీట వేశారు. 1936-42 మధ్య కాలంలో తెలంగాణలోని ఓ చిన్న పల్లెటూరులో ఈ నవలానేపథ్యముంటుంది. అందువల్ల తెలంగాణ మాండలీకానికి చెందిన నాలుగు జానపద గీతాల్ని ఈ సినిమాలో ఉపయోగించారు. ‘గుడిసెనక గుడిసెదాన’, ‘లచ్చిబొమ్మా జరా చూసుకొని తిరుగమ్మా’, ‘శ్రీలక్ష్మి నీ మహిమలు’, ‘ఏటికేతంబట్టి ఎయిపుట్లు పండించి’.. అంటూ సాగే ఈ పాటలు సంగీత ప్రియుల్ని అలరించాయి. జానపద గీతాల్ని ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకొన్న చిత్రం ఇదేనని చెప్పాలి. ఆ తర్వాత రాజన్న సినిమాలో కూడా మనకు అనేక జానపద బాణీలు కనిపిస్తాయి. 


హిందీ వరస

జమీందారుగారి అమ్మాయి’ (1974)చిత్రంలో ఓ కామెడీ గీతం ఉంది. ‘మంగమ్మా నువు ఉతుకుతుంటే అందం’ అని. ఇది కూడా జానపద గీతమే. అయితే ఆ సమయంలో పాపులర్‌ హిందీ గీతం ‘హమ్‌తుమ్‌ ఏక్‌ కమరేమే ’(బాబీ) బాణీ తీసుకుని ఈ పాటకు రూపకల్పన చేశారు. రాజబాబుపై చిత్రీకరించిన ఈ పాట ఇప్పటికీ హిట్టే.


అనేక రూపాలు.. 

గ్రామీణ జీవిత స్వచ్ఛతకు అద్దం పట్టే గీతాలు అనేక రూపాల్లో ఉన్నాయి. వలపు పాటలు, మహిళల పాటలు, పిల్లల పాటలు, పని పాటలు, నవ్వుల పాటలు, సరసాల పాటలు, తత్వాలు, మేలుకొలుపులు... ఇవన్నీ కూడా జానపదాలే!

Updated Date - 2021-03-14T05:51:13+05:30 IST