Abn logo
Jun 25 2021 @ 02:27AM

పంజరంలో పాప్‌సింగర్‌!

  • తండ్రి చెరలో బందీగా బ్రిట్నీ స్పియర్స్‌ 
  • 13 ఏళ్లుగా కట్టు బానిసగా నరకం
  • బట్టలు మార్చుకునేందుకూ ప్రైవసీ లేదు
  • మిత్రులను కలిసేందుకు, డేటింగ్‌కు కట్టడి
  • బలవంతంగా మత్తు ఇంజక్షన్లు
  • పిల్లలను కనేందుకు అనుమతి లేదు
  • న్యాయమూర్తి ఎదుట తార కన్నీళ్లు

లాస్‌ఏంజెలెస్‌, జూన్‌ 24: చిట్టిపొట్టి దుస్తుల్లో చూపు తిప్పుకోనివ్వని నృత్యంతో, ఉర్రూతలూగించే గాత్రంతో వెలుగుజిలుగులతో కూడిన వేదిక మీద బ్రిట్నీ స్పియర్స్‌ హోయలు చూస్తే అహో అనిపిస్తుంటుంది కదూ! ఆమె కోట్లకొద్దీ డబ్బులో మునిగి తేలుతుందని, కోరుకున్నట్లుగా స్వేచ్ఛగా జీవిస్తుందని ఎవరు మాత్రం అనుకోరు? అయితే ఆమె ముఖంలో ఈ నవ్వులన్నీ తెర ముందేనని, ఆమె జీవితం   కారు చీకట్లమయమని, ఈ 39ఏళ్ల పాప్‌సింగర్‌ ఓ పంజరంలో బందీగా ఉన్న చిలుక అనంటే నమ్ముతారా? 


తన జీవితం.. తన డబ్బు అయినా అడుగడునా అంక్షలు, నియంత్రణ! స్నేహితులను కలిసే వీలుండదు.. ఇష్టపడినవారితో సరదాగా కబుర్లు చెప్పుకునే అవకాశం ఉండదు.. మనసుకు నచ్చినవాడితో డేటింగ్‌ చేసే చాన్స్‌ లేదు! మొత్తంగా ఆమె జీవితం ఓ బందీఖానా! ఆ కంచెకు కపలా సాక్షాత్తు ఆమె తండ్రే! తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణను తండ్రి జేమీ స్పియర్స్‌ చేతుల్లో పెట్టి 13ఏళ్లుగా నరకం అనుభవిస్తున్న స్పియర్స్‌ మౌనం వీడి భగ్గుమన్నారు.


‘ఇన్నేళ్లు జరిగింది చాలు.. నా జీవితాన్ని నాకిచ్చేయండి’ అంటూ బుధవారం న్యాయూమూర్తి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తన ఆవేదననంతా    20 నిమిషాల పాటు వీడియోలింక్‌ ద్వారా న్యాయమూర్తికి ఆమె వివరించారు. 2006లో బ్రిటీ తన భర్త కెవిన్‌తో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విడిపోయిన రెండేళ్లకు తన వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను పూర్తిగా తండ్రి జేమీకి ఆమె ధారాదత్తం చేశారు. కాగా, తనను తండ్రి, ఆయన సహాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వారు చెప్పిందే తాను చేయాల్సి వస్తోందని.. లేదంటే తనను హింసిస్తున్నారని, తండ్రి చెరలో తాను బానిసగా మారానని కన్నీళ్లు పెట్టుకున్నారు.


మత్తులో ఉండేందుకు తనకు బలవంతంగా ఇంజక్షన్లు ఇచ్చేవారని.. తనకు బట్టలను మార్చుకునే ప్రైవసీ గానీ, తన కారును తాను నడుపుకొనే స్వేచ్ఛగానీ లేకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆక్రోశించారు! మళ్లీ పిల్లలు కలిగేందుకు ఇప్లాంట్‌ను తొలగించుకునేందుకూ అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాకు పిచ్చెక్కుతోంది.. నేను ఏడ్వని రోజంటూ లేదు. పర్యవేక్షణ బాధ్యతను నా తండ్రి పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఆయన నియంత్రణ మితిమీరి పోయింది. ఈ ఇబ్బందులు నాకొద్దు. నేను మార్పు కోరుకుంటున్నాను’ అని ఆమె చెప్పుకున్నారు.


తాజా వార్తలుమరిన్ని...