నిలిచిన మొక్కజొన్నల కొనుగోలు

ABN , First Publish Date - 2020-11-18T04:45:41+05:30 IST

మొక్కజొన్నల కొనుగోలు నిలిపి వేయాలంటూ రెండు రోజుల క్రితం వెలుగు అధికారులకు సమాచారం అందింది.

నిలిచిన మొక్కజొన్నల కొనుగోలు
ఎల్లావత్తులలో సంచుల్లో నింపిన మొక్కజొన్నలు

  1. మూణ్నాళ్ల ముచ్చటగా కొనుగోళ్లు 
  2. అయోమయంలో రైతులు

రుద్రవరం, నవంబరు 17: మొక్కజొన్నల కొనుగోలు నిలిపి వేయాలంటూ రెండు రోజుల క్రితం వెలుగు అధికారులకు సమాచారం అందింది. ప్రభుత్వం, అధికారుల నిర్ణయాలు మొక్కజొన్నల రైతులకు అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రకృతి దాడిలో తీవ్రంగా నష్టపోయిన తమకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నల కొనుగోలు మూడు రోజుల ముచ్చటగా సాగింది.

జిల్లా అంతటా నిలిచిన కొనుగోళ్లు 

జిల్లా అంతటా మొక్కజొన్నల కొనుగోలు నిలిచి పోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు నిల్వ ఉంచుకోవడానికి ఇళ్లల్లో స్థలాలు లేక పంట పొలాల్లోనే నిల్వ చేశారు. వర్షాలు కురిసినప్పుడల్లా నష్టపోతున్నారు. మరి కొందరు రైతులు దళారులకే విక్రయించి నష్టపోతున్నారు. ఇలా రైతులు అడుగడుగున నష్టాలే చవి చూస్తున్నారు. ఎంతో ఆశతో ఎదురు చూసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిలిచి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో 2,500 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఎకరాకు 10 క్వింటాళ్లు దిగుబడి రూపంలో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం క్వింటానికి రూ.1,850 మద్దతు ధర ప్రకటించింది. మండలంలో 6 రైతు భరోసా కేంద్రాల పరిధిలో మొక్కజొన్నలు కొనుగోలు చేయడానికి నిర్ణయించారు. ఈ మొక్కజొన్నలు పొదుపు మహిళ సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభించాలి. రెండు శాఖల మధ్య సమన్వయం లోపించడంతో కొనుగోలు ప్రారంభించలేదు.

గోనె సంచులు మూలకు పడేశారు 

 మొక్కజొన్నల కొనుగోలు నిలిపి వేయాలని అధికారుల నుంచి ఉత్తర్వులు అందడంతో వెలుగు కార్యాలయంలో గోనె సంచులు మూలకు పడేశారు. 

                           అమ్మాలనుకుంటున్నాం

మొక్కజొన్నలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎదురు చూస్తున్నా. దిగుబడి రూపంలో నష్టపోయా. ఉన్న మొక్కజొన్నలైనా విక్రయించాలని ఎదురు చూస్తున్నా. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.                     -లాల్‌బహదూర్‌శాస్ర్తి, రైతు, ఎల్లావత్తుల


                           దిగుబడి తగ్గింది

మొక్కజొన్న పంట దిగుబడి తగ్గి నష్టపోయా. దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. విక్రయించలేక, నిల్వ ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నా. ప్రభుత్వం కొనాలి. 

                  -అల్లా అక్బర్‌, రైతు, ఎల్లావత్తుల


               కొనుగోళ్లు ఆపేయమన్నారు

మొక్కజొన్నల కొనుగోలు నిలిపి వేయాలని ఉన్నతధికారుల ఆదేశాలు అందాయి. అందుకే కొనుగోలు నిలిపి వేశాం. 

              - నాగమ్మ, ఏపీఎం, రుద్రవరం

Updated Date - 2020-11-18T04:45:41+05:30 IST