పూతవట్టిన అడివి

ABN , First Publish Date - 2020-08-17T06:00:57+05:30 IST

సంకలో మేకపిల్ల చేతిలో చిప్పగొడ్డలితో నవ్వుకుంట నాయిన నడుస్తుంటే పూతవట్టిన అడివి కండ్లముందట కదిలేది...

పూతవట్టిన అడివి

సంకలో మేకపిల్ల

చేతిలో చిప్పగొడ్డలితో

నవ్వుకుంట నాయిన నడుస్తుంటే

పూతవట్టిన అడివి కండ్లముందట కదిలేది.


మనిషిలోతు గుంతలను

ఒక్కచేతిమీదుగ గడ్డపారేసేది

అడ్డమొచ్చిన బండరాళ్ళకు

చెమటలు పట్టించి మెరుపు పుట్టించేది

గంటకోసారి మాత్రం

అగ్గిపెట్టె, బీడికట్ట ఎక్కడబెట్టిననో అని

పిట్టపిల్ల లెక్క అంగిజేబులో దేవులాడుకునేది.


పేదరికపువిషనాగు పట్నానికి తరిమితే

చాపలకంపెనిలో వొట్టిచాపై తేలిండు

ఏ అర్ధరాత్రి వరకో మూటలుమోసి

చెమటసంద్రంలా ఇంటికి చేరితే

చేపపిల్లలమై ఎద మీద ఆడుకున్నాం


కూలి దొరకని నాడు కూడా

మా కోసం నాయిన జేబులో

మిక్చర్‌ పొట్లమో, మైసూరుపాకో -


అడివిగురించి, సముద్రం గురించి

ఎంతని చెపుతం?

మా నాయిన గురించి కూడా అంతే. 

ఊపిరున్నదాక రెక్కల్ని నరుక్కున్న

ఎద్దసొంటిమనిషి నాయిన

మెడనరాలు గుంజంగ

పచ్చికట్టెలు మోసుకొచ్చిన నెత్తుటివాగు

మున్నూరు గొర్లమందకు

ముందునడిచిన జానకర్ర


ఇప్పుడు నాయిన ఎక్కడికి పోయుంటడు?

గొర్లను చెర్లకు మలిపి

ఏ గట్టుమీద కూర్చొనివుండో.

పొద్దున్నే మేకలకు మండతేవడానికి

ఏ కొమ్మమీద తేనెతెట్టె అయ్యుండో.

గుడిలేని ఏ దేవుడు పిలిస్తే

తాటికమ్మల సపారం అల్లడానికి పోయిండో.


తగుళ్ళ గోపాల్‌

95050 56316


Updated Date - 2020-08-17T06:00:57+05:30 IST