Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 31 Dec 2021 00:39:35 IST

పూర్‌పాలికలు

twitter-iconwatsapp-iconfb-icon
పూర్‌పాలికలుమోత్కూరు మునిసిపల్‌ కేంద్రంలో చెత్తా చెదారంతో నిండిన మురుగు కాల్వ

మునిసిపాలిటీల్లో పనులేవీ?

ఏళ్లుగా నిలిచిన అభివృద్ధి

వెక్కిరిస్తున్న శిలాఫలకాలు

రోడ్లపైనే మురుగునీరు

నిధుల కొరత, నిర్లక్ష్యపు నీడలు

అధికార పార్టీలో ఆధిపత్యపోరు

ఇదీ ఉమ్మడి జిల్లాలో మునిసిపాలిటీల దుస్థితి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

మునిసిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీలో ఆధిప త్యపోరు, గ్రూపు రాజకీయాలు, డబ్బు పంపకాల్లో వివాదాల కారణంగా, ఆ పార్టీ పరువు బజారున పడుతోంది. ఎమ్మెల్యేలు, మునిసిపల్‌ చైర్మన్ల మధ్య సఖ్యత లేక ప్రగతి పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. వార్డులకు నిధుల కేటాయింపులో వివక్ష అంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ రోడ్డెక్కింది. మునిసిపల్‌ సిబ్బంది అవినీతి కారణంగా సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఈ నెల 31న నల్లగొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పురపాలికలపై ప్రత్యేక కథనం..

రెండేళ్లయినా చిట్యాలలో పూర్తికాని పనులు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి రెండేళ్లయినా నిధుల కొరత కారణంగా పనులు పూర్తి కాలేదు. మునిసిపల్‌ పార్కు నిర్మాణం, కూరగాయల మార్కెట్‌, దుకాణ సముదాయం, సీసీ ప్లాట్‌ఫాం నిర్మాణం, వైకుంఠధామం, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచాయి.

చండూరులో సమస్యల తిష్ఠ

కొత్త మునిసిపాలిటీ చండూరులో డ్రైనేజీలు పూర్తికాక మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. చినుకు పడితే రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. డబుల్‌ రోడ్డు, డివైడర్‌, హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. వైకుంఠధామం పనులే ప్రారంభం కాలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎక్కువ మంది కౌన్సిలర్లుగా గెలుపొందడంతోనే అభివృద్ధి సాగడం లేదన్న విమర్శ ఉంది. 

కోదాడలో ప్రజాప్రతినిధులు మధ్య సఖ్యత కరువు

కోదాడ మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, చైర్మన్‌ మధ్య సఖ్యత లేదు. నిధుల లేమితో వైకుంఠధామం పనులు సాగడంలేదు. నిధుల కొరతతో పబ్లిక్‌ పార్కు నిర్మాణం నిలిచిపోయింది. సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సిబ్బంది చేతివాటం, ఉద్యోగాల పేరుతో కౌన్సిలర్ల వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి.

గోతులమయంగా దేవరకొండ

మిషన్‌ భగీరథ గోతులు పూడ్చకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్లు లేవు. శివారు కాలనీల్లోనే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపడుతుండగా, మరో రూ.50కోట్లు వస్తేనే పనులు పూర్తవుతాయి. పారిశుధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. సమీకృత మార్కెట్‌కు రూ.4కోట్లు కేటాయించినా భూ వివాదం ఉంది. ఖిల్లా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది.

నకిరేకల్‌లో ప్రారంభంకాని యూజీడీ పనులు

నకిరేకల్‌ మునిసిపాలిటీలో యూజీడీ(అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ) పనులు ప్రారంభమేకాలేదు. వార్షిక అంచనా బడ్జెట్‌ రూ.12.27కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.3.95కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ ద్వారా రూ.6కోట్లు మంజూరు కాగా, వాటితోనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు.

ఆలేరులో సమన్వయ లోపం

ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయలోపంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆర్‌యూబీ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 

నేరేడుచర్లలో సిబ్బంది కొరత

నేరేడుచర్లలో మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసిన ఏ పనీ నేటికి ప్రారంభం కాలేదు. డ్రైనేజీలు లేక ఇళ్ల మధ్యలోనే మురుగు నిలుస్తోంది. అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు ఉన్నాయి. మంత్రి జగదీ్‌షరెడ్డి మంజూరు చేసిన రూ.10కోట్ల నిధుల పనుల జాడ లేదు.

మిర్యాలగూడలో..

మినీ రవీంద్రభారతి డ్రైనేజీ 10ఏళ్లయినా పూర్తికాలేదు. మినీ ట్యాంక్‌బండ్‌ పనులు అరకొరగా సాగుతున్నాయి.

హుజూర్‌నగర్‌లో సీఎం హామీలకే దిక్కులేదు

సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు చేసినా ఒక్క పని ముందుపడటంలేదు. పట్టణంలోని మెయిన్‌ రోడ్డు, లింగగిరిరోడ్డు అస్తవ్యస్తంగా మారింది. అధికార, విపక్ష కౌన్సిలర్ల మధ్య విభేదాలు కోర్టుకు ఎక్కడంతో పనులు నిలిచాయి.

రెండేళ్లయినా పేటలో పూర్తికాని ప్రధాన రోడ్డు

భవనాలు కూల్చి రెండేళ్లయినా సూర్యాపేట పోస్టాఫీసు నుంచి పొట్టిశ్రీరాములు సెంటర్‌ వరకు రోడ్డు నిర్మాణం పూర్తికాలేదు. టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

కాగితాలపైనే తిరుమలగిరి అభివృద్ధి

మునిసిపాలిటీలో డంపింగ్‌ యార్డు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇళ్ల నిర్మాణానికి నిబంధనల పేరుతో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

హాలియాలో అస్తవ్యస్తంగా డ్రైనేజీలు

హాలియా మునిసిపాలిటీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో రోడ్లపైనే మురుగు నీరు పారుతోంది. డిగ్రీ కళాశాలకు పక్కా భవన నిర్మాణం ఊసేలేదు. మినీ స్టేడియానికి స్థలం సేకరణ చేశారే తప్ప నేటికీ శంకుస్థాపన చేయలేదు. నిధుల లేమితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

చౌటుప్పల్‌లో 

చౌటుప్పల్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంపై ప్రచారమే తప్ప పనులు ప్రారంభం కాలేదు. పందులు, దోమల బెడదతో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. చైర్మన్‌ పనితీరుపై అధికారపార్టీ కౌన్సిలర్లలోనే అసంతృప్తి ఉంది. చెరువు జాలునీటితో హరితహారం మొక్కలు చనిపోతున్నాయి. భువనగిరి మునిసిపల్‌ రెవెన్యూ విభాగంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వరద కాల్వల నిర్మాణం ప్రధాన సమస్య. దీంతో మురుగు నీరు రోడ్లపైనే పారుతోంది.

యాదగిరిగుట్టలో పూర్తికాని సీసీ రోడ్లు

యాదగిరిగుట్ట మునిసిపాలిటీ ఏర్పడి రెండేళ్లయినా సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వైటీడీఏ అభివృద్ధిలో భాగంగా పనులు చేస్తున్న సమయంలో 12, 10, 9 వార్డుల్లో నీటి సరఫరా పైపులైన్లు ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వార్డులకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు.

పోచంపల్లి సమస్యలతో సతమతం

కొత్త మునిసిపాలిటీ అయిన పోచంపల్లిలో నిధులు లేక అభివృద్ధి పనులు లేవు.  అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ప్రధాన రహదారి 100ఫీట్ల విస్తరణకు పనులు ప్రారంభించినా నిధుల కొరతతో నిలిచింది.

నల్లగొండలో పూర్తికాని డ్రైనేజీ

నల్లగొండ మునిసిపాలిటీలో 2007లో రూ.45కోట్లతో ప్రారంభమైన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. ఎస్‌టీపీ పనులు పూర్తి కాకపోవడంతో ఈ డ్రైనేజీకి కనెక్షన్‌ ఇవ్వలేకపోతున్నారు. టౌన్‌హాల్‌ శిథిలావస్థకు చేరింది. సీసీ రోడ్ల నిర్మాణంలో అవినీతి కారణంగా అప్పుడే పగుళ్లు వచ్చాయి. కోర్టు వివాదాలతో ప్రకాశంబజార్‌ మడిగల అద్దె రావడం లేదు. ఫలితంగా ఏటా రూ.10కోట్ల మేర ఆదాయాన్ని మునిసిపాలిటీ కోల్పోతోంది. అదే విధంగా నందికొండ(నాగార్జునసాగర్‌) మునిసిపాలిటీలోని అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. మునిసిపాలిటీ ఏర్పడి నాలుగేళ్లయినా అభివృద్ధి సున్నా.డ్రైనేజీ, వీధి దీపాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చిరు జల్లులకే కాలనీల్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

కేటీఆర్‌ పర్యటనతోనైనా రూపురేఖలు మారాలి : సింగారం శివప్రసాద్‌, నల్లగొండ

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నల్లగొండ పర్యటనతోనైనా అభివృద్ధి పనులు ముందుకు సాగాలి. కొన్నేళ్లుగా పట్టణంలో ప్రధాన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రహదారులు గుంతలమయమై వాహనాలు దెబ్బతింటున్నాయి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో వర్షాకాలంలో రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది.

మున్ముందు మరింత అభివృద్ధి : వెంకన్న, మునిసిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌, నల్లగొండ 

గతంతో పోల్చితే నల్లగొండ మునిసిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందింది. పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.150కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నిధులతో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. పాలకవర్గ సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం.

పూర్‌పాలికలుజిల్లా కేంద్రం భువనగిరిలో డ్రైనేజీ దుస్థితి


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.