పేదల బియ్యం పెద్దల భోజ్యం

ABN , First Publish Date - 2022-05-08T05:54:43+05:30 IST

ఏప్రిల్‌ 27వ తేదీన పాముల పాడు మండలం ఇస్కాల గ్రామంలోని ఓ కల్లంలో దాచి ఉంచిన 75 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని వాహనంలో లోడ్‌ చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

పేదల బియ్యం పెద్దల భోజ్యం

పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం

జిల్లాలో యథేచ్ఛగా ‘రేషన్‌’ వ్యాపారం

కార్డుదారుల నుంచి కొనుగోలు

డోన్‌ నుంచి బెంగళూరు తరలింపు

సన్నబియంగా మార్చి విక్రయాలు

చోద్యం చూస్తున్న అధికారులు


పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం అక్రమార్కుల బొజ్జలు నింపుతున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలకు కాస్త ఆసరాగా ఉంటాయనుకుంటే పెద్దలకు కాసులు కురిపిస్తున్నాయి. అగ్గువకు అమ్ముడుపోయి పాలిష్‌ పేరుతో సన్నగా మారి తిరిగి ప్రజల చెంతకే చేరుతున్నాయి. ఇలా నిత్యం ఎక్కడో చోట రేషన్‌ బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టుబడుతుండడంతోపాటు అక్రమార్కులపై కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినా ఈ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఈ దందాను పూర్తిగా అరికట్టినా నంద్యాల జిల్లా అయిన తరువాత పరిస్థితి యథాస్థితికి వచ్చింది. కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని తెలంగాణ, బెంగళూరు ప్రాంతాల్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి నెలా రూ.కోట్లలో టర్నోవర్‌ జరుగుతున్నా అధికారుల చర్యలు నామమాత్రంగా ఉన్నాయన్న  విమర్శలు వినిపిస్తున్నాయి.


-నంద్యాల, (ఆంధ్రజ్యోతి)


ఏప్రిల్‌ 27వ తేదీన పాముల పాడు మండలం ఇస్కాల గ్రామంలోని ఓ కల్లంలో దాచి ఉంచిన 75 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని వాహనంలో లోడ్‌ చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇదే రోజు ఆళ్లగడ్డ మండలంలోని పి.చింతకుంట గ్రామ శివారులో ఓ ఆటోలో ఏడు రేషన్‌ బ్యాగులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు సంఘటనల్లో వాహనాలను సీజ్‌ చేశారు.


ఏప్రిల్‌ 26న డోన్‌ మండలంలోని ఓబులాపురం హైవే మిట్ట వద్ద ఉన్న ఓ ప్రైవేటు గోడౌనుపై పోలీసులు దాడులు చేసి దాదాపు 268 రేషన్‌ బస్తాలను పట్టుకున్నారు. వీటి విలువ లక్ష రూపాయల పైనే ఉంటుందని అంచనా. ఇక ఇదే రోజు బేతంచర్ల హనుమాన్‌ నగర్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న 110 ప్యాకెట్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.50 వేలు ఉంటుంది. ఈ రెండు కేసుల్లో వాహన డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవే కాదు ప్రతిరోజూ ఏదో ఓ మూలన రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం బయట పడుతూనే ఉంది. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు ఇలా పక్కదారి పట్టిస్తున్నారు. ఇంటింటికీ చేరాల్సిన బియ్యం ఇంత పెద్ద మొత్తంలో పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం మత్తు నిద్ర వదలడం లేదనన విమర్శలు వినిపిస్తున్నాయి. మామూళ్లు తీసుకుంటూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. 


ఏప్రిల్‌ 23వ తేదీన అవుకు మండలంలో పోలీసులు వాహ నాలను తనిఖీలు చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న 12.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. ఈ ఘటనలో బనగానపల్లె రైస్‌ మిల్‌ యజమానిపై కేసు నమోదు 

చేశారు. 


రాష్ట్రాలను దాటిస్తూ..


డీలర్లు, లబ్ధిదారుల వద్ద నుంచి సేకరించిన బియ్యాన్ని ముందుగా ఆయా ప్రాంతాల్లోని అను వైన గోడౌన్లలో దాచి ఉంచి మిల్లులకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ పట్టించి నాణ్యమైన బియ్యంగా బహిరంగ మార్కెట్లోకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా రు. మరికొంత మంది వ్యాపారులు సేకరించిన బియ్యాన్ని ఏకమొత్తంగా కర్ణాటక, తెలంగాణకు సరఫరా చేస్తున్నారు. చాలా చవకగా లభించే రేషన్‌ బియ్యాన్ని, పాలిష్‌ పట్టించి బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.


అంతా తెలిసే..


ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా టన్నుల్లో బియ్యాన్ని సేకరిస్తూ సరిహ ద్దులు దాటిస్తున్నారు. అక్రమ వ్యాపారులు డీలర్లు, సంబంధిత శాఖ అధికారులతో కుమ్మ క్కై దందా నడుపుతున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 12 లక్షలకు పైగా రేషన్‌ కార్డులుండగా, నెలకు 20 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. అయితే వీటిలో సింహ భాగం అక్రమ వ్యాపారులకే చేరుతున్నాయి. వీరంతా రేషన్‌ డీలర్లు, ఎండీయూ వాహనదారులే నేరుగా లబ్ధిదారుల నుంచి కొంటు న్నట్టు సమాచారం. ఎండీయూ వాహనం ఏ రోజున ఏ వీధికి వెళుతుందో ముందుగానే వ్యాపారులకు వలంటీర్లు, అధికారుల ద్వారా సమాచారం అందు తుంది. దీని ప్రకారం వ్యాపారులు నేరుగా ఆ వీధికి వెళ్లి రేషన్‌ బియ్యం లబ్ధిదారులు తీసుకోగానే కిలో రూ.10 చెల్లించి బియ్యాన్ని తీసుకువెళుతున్నారు. 


నాయకుల అండదండలు..


రేషన్‌ బియ్యం దందా కొనసాగిస్తున్న వారికి నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నా యన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏదైనా ఓ విషయానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తే మళ్లీ అలాంటి పనులు చేయడానికి నిందితులు కాస్త జంకుతారు. కానీ రేషన్‌ దందా విషయంలో అక్రమార్కులు ఏ మాత్రం భయపడటం లేదు. ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఓ చోట రేషన్‌ బియ్యం పట్టుబడుతుండగా కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినా నిం దితుల్లో ఏ మాత్రం జంకూబొంకూ కనిపించడం లేదు. ఇందుకు నాయకులు తమ వెనుక ఉన్నా రని ధైర్యం వారిలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి కఠినంగా వ్యవ హరించడంతో కొన్నాళ్లు ఈ వ్యా పారం కాస్త సద్దుమణిగింది. కొత్త జిల్లా ఏర్పాటైన తర్వా త ఈ దందా మళ్లీ జోరందుకుంది. 


బనగానపల్లె టూ జమ్మలమడుగు


బనగానపల్లె, మే 7: బనగానపల్లె, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ప్రాంతాల నుంచి కడప జిల్లా జమ్మలమడుగుకు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు ఆటోలు, మినీ వ్యాన్ల ద్వారా వచ్చిన రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.12 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి తాడిపత్రి, అనంతపురం, బెంగళూరు తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఏప్రిల్‌ 16న బనగానపల్లె-కోవెలకుంట్ల రహదారిలోని పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద బనగానపల్లెకు చెందిన పెనుగొండ శ్రీరాములు అనే వ్యక్తి తన టాటా మ్యాజిక్‌ ట్రాలీ ఆటోలో రేషన్‌ బియ్యం తరలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. అలాగే తమ్మడపల్లెలోని ధనలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఇల్లూరు కొత్తపేటకు చెందిన పెనుగొండ భార్గన్‌ అనే వ్యక్తి ప్యాసింజరు ఆటోలో రేషన్‌ బియ్యాన్ని జమ్మలమడుగుకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అవుకు పట్టణంలో ఇటీవలే 12.5 క్వింటాళ్ల బియ్యం బనగానపల్లెకు తరలిస్తుండగా అవుకులో సీజ్‌ చేశారు. బనగానపల్లెకు చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ఈద్గానగర్‌లో బియ్యం సేకరిస్తుండగా పోలీసులు పట్టుకొని ఆటో సీజ్‌ చేశారు. 

 

పెండింగ్‌ కేసులుబియ్యం దందా ఉమ్మడి జిల్లాలో వేళ్లూనుకొని పోయింది. ఇలాంటి వారిపైన 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 950 6-ఏ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పోలీసులకు, అధికారులకు చిక్కే వారంతా సాధారణంగా చిన్న చిన్న వ్యాపారులేన్నది ఆయా కేసులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అసలు బియ్యాన్ని పక్కదారి పట్టించే వారు, భారీ ఎత్తున నిల్వ చేసే మిల్లర్లు దొరికిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతి నెలా లెక్కకు మించి వ్యాపారం సాగించే వీరి వద్ద నుంచి అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. అధికారులే ఇలా మామూళ్ల మత్తులో జోగుతుంటే అక్రమా ర్కులకు కళ్లెం వేసేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.


డొన్‌ పట్టణం లో ఐదారుగురు వ్యాపారులు దర్జాగా పేదల బియ్యాన్ని హాంఫట్‌ అనిపిస్తున్నారు. నియోజకవర్గం లోని కొందరు వ్యాపారులు కూలీలను ఏర్పాటు చేసుకొని చౌక బియ్యం సేకరిస్తున్నారు. కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. డోన్‌తో పాటు ప్యాపిలి, బేతంచెర్ల పట్టణాల్లో సేకరించిన పేదల బియ్యాన్ని రాత్రివేళల్లో ఆటోల ద్వారా రహస్య స్థావరాలకు చేరుస్తున్నట్టు సమాచారం. కొందరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న తమ గోడౌన్లకు చౌక బియ్యం తరలించి ప్యాకింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.


పేదల బియ్యం బొక్కుతున్నారు


డోన్‌, మే 7: పేదల బియ్యం యథేచ్ఛగా నల్లబజారుకు తరలి పోతున్నాయి. కొందరు అక్రమార్కుల బొజ్జలు నింపుతున్నాయి. రూ.కోట్లలో టర్నోవర్‌ నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డోన్‌ అర్బన్‌, రూరల్‌లో కలిపి 34,512 రేషన్‌ కార్డులు ఉండగా.. ప్రతి నెలా 5,400 క్వింటాళ్లు రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ప్యాపిలి మండలంలో మొత్తం రేషన్‌ కార్డులు 22,500 ఉండగా.. ప్రతి నెలా 3,300 క్వింటాళ్ల రేషన్‌, అదే విదంగా బేతంచెర్ల మండలంలో 27వేల రేషన్‌ కార్డులు ఉండగా.. 3,317 క్వింటాళ్ల రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యంపైనే అక్రమార్కుల కన్ను పడింది. 


బెంగళూరుకు రవాణ


డోన్‌ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పేదల బియ్యం బెంగళూరుకు తరలిపోతున్నాయి. కొందరు  బెంగళూరు చెందిన కొందరు వ్యాపారులతో చేతులు కలిపినట్లు విమర్శలున్నాయి. పేదల బియ్యం సేకరిం చిన డోన్‌ నియోజకవర్గ వ్యాపారుల నుంచి కిలో బియ్యం రూ.14 నుంచి 15 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో డోన్‌ నుంచి రాత్రి వేళల్లో లారీల్లో చౌయ్యాన్ని బెంగళూరుకు తరలిస్తున్న ట్లు విమర్శలు ఉన్నాయి. అక్కడకు చేరిన చౌక బియ్యానికి పాలిష్‌ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


ప్రతి నెలా 50 నుంచి 60 లారీల్లో తరలింపు


పేదల బియ్యం అక్రమ వ్యాపారం రూ.కోట్లలో నడుస్తు న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోని డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల నుంచి ప్రతి నెలా 50 నుంచి 60 లారీల లోడ్లతో చౌక బియ్యం బెంగళూరుకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లారీ లోడు బియ్యం ధర రూ.6 లక్షలు పైనే ఉంటుందని అంచనా. వీటి ప్రకారం ప్రతి నెలా రూ.3కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు గుప్పు మంటున్నాయి.


దందా కొత్త పుంతలు


కొత్త మార్గాలను అన్వేషిస్తున్న అక్రమార్కులు

కార్డుదారుల నుంచి బియ్యం కొనడం బంద్‌

గోదాముల నుంచి నేరుగా పక్క రాష్ట్రాలకు..

స్టేజ్‌-2 వాహనాల ద్వారా అక్రమ రవాణ


కర్నూలు (కలెక్టరేట్‌), మే 7: రేషన్‌ బియ్యం దందాను ఎవ్వరూ అరికట్టలేని పరిస్థితి నెలకొంది. ‘రుచిమరిగిన కోడి వరిమళ్ల దావ పట్టిందన్న’ చందంగా అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టలేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని నిబంధనలు, చర్యలు చేపట్టినా కొత్త కొత్త ఆలోచన లతో తమ పని పూర్తి చేసుకుంటున్నారు. గతంలో రేషన్‌ డీలర్ల వద్దనే దళారులు కొనుగోలు చేసి లారీలలో ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. ఈపోస్‌ మిషన్‌ వచ్చాక ఊరూరా తిరిగి చిరువ్యాపారులు కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని దళారులకు అమ్మే దందా కొనసాగేది. కొత్తగా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వచ్చాక ఊరూరా బియ్యం కొనుగోలు వ్యాపారం నిలిచిపోయింది. ఇప్పుడు గోదాముల నుంచే స్టేజ్‌ -2 వాహనాల ద్వారా బియ్యం నేరుగా జిల్లా హద్దులు దాటిపోతున్నా యి. ఈ బియ్యం అంతా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చేరుతున్నాయి. మరికొన్ని చోట్ల రేషన్‌ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 15న నాగలాపురం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 560 బస్తాలు ఉన్న లారీని పోలీసులు సీజ్‌ చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి వివరాలు సేకరిస్తే స్టేజ్‌-2 వాహనాల ద్వారా ఇక్కడికి బియ్యం తీసుకొని వచ్చి లోడ్‌ చేశామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ రెండు వాహనాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే విషయాన్ని పౌరసరఫరాల సంస్థ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

Read more