కాలినడకన సొంతూళ్లకు

ABN , First Publish Date - 2020-03-26T09:14:21+05:30 IST

నెత్తిమీద పెద్ద మూట.. ఓ చేతిలో సందుగ, మరో చేతిలోనేమో బస్తా. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 40 మంది కూలీలు! వారిని అనుసరిస్తున్న పిల్లలు, అంతా నడుచుకుంటూ...

కాలినడకన సొంతూళ్లకు

  • లాక్‌డౌన్‌తో పట్నంలో కూలీలకు ఉపాధి కరువు
  • తుంగతుర్తికి వెళ్తున్న వారిని చూసి ఆగిన కేటీఆర్‌ 
  • 135 కిలోమీటర్లు నడిచి వెళ్తుతున్నారని తెలిసి ఆవేదన
  • అప్పటికప్పుడు ప్రత్యేక వాహనం ఏర్పాటుచేసి తరలింపు

హైదరాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట సిటీ, పూడూరు, మార్చి 25: నెత్తిమీద పెద్ద మూట.. ఓ చేతిలో సందుగ, మరో చేతిలోనేమో బస్తా. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 40 మంది కూలీలు! వారిని అనుసరిస్తున్న పిల్లలు, అంతా నడుచుకుంటూ బయలుదేరారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత లిబర్టీ జంక్షన్‌ వద్ద కనిపించారు. వారంతా వలస కార్మికులు. ఏపీలోని కర్నూలు స్వస్థలం. హైదరాబాద్‌కు వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులన్నీ నిలిచిపోవడంతో వారికి ఉపాధి కరువైంది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలేవీ తిరగకపోవడంతో కర్నూలుకు బయలుదేరారు. పిల్లాపాపలను వెంటబెట్టుకొని ఎప్పుడు చేరతారో ఏమో గానీ ఏకబిగిన 215 కిలోమీటర్లు వారు అలాగే నడవనున్నారు. అంతదూరం ఎలా నడుస్తారు? అని అడిగితే.. 21 రోజులపాటు ఏ పనీ లేక.. ఆకలితో బాధపడుతున్న పిల్లలను చూస్తూ ఎలా ఉండగలం అని ఆవేదనగా చెప్పారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన కార్మికులందరిదీ ఇప్పుడు ఇదే పరిస్థితి.  ఉన్నదాంట్లో గూడాల్లోనే సంతోషంగా పండుగ చేసుకోవాల్సిన ఉగాదిరోజునే కాలినడకన సొంతూళ్లబాట పట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో పనిచేస్తున్న నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన కార్మికులు కూడా సొంతూళ్లకు బయలుదేరారు.


వీరంతా సంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రాంతంలో కనిపించారు. 130కిలోమీటర్లు నడిచి గురువారం సాయంత్రమో.. శుక్రవారం ఉదయమో చేరుకోనున్నారు.. చర్లపల్లి, మొయినాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పని చేస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన 200మంది వలస కూలీలు సోమవారమే కాలిబాటన సొంతూళ్లకు బయలుదేరారు. బుధవారం పూడురు మండల పరిధిలోని మన్నెగూడ వద్ద కనిపించారు. తమను పనిలో పెట్టుకున్న కాంట్రాక్టరు పని చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదని వాపోయారు. చర్లపల్లి అశోక్‌నగర్‌ నుండి సోమవారం బయలుదే రామని మన్నెగూడ రావడానికి రెండ్రోజులు పట్టిందని, రోడ్డుపై ఎక్కడా తినడానికి తిండి కూడా దొరకడం లేదని వాపోయారు. వలస కూలీలు, సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా వసతి కల్పించాలన్నారు. కాగా తెలంగాణలోని ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఏపీ నుంచి వచ్చిన కార్మికులను వారి ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2 వేల మంది కార్మికులు.. సిద్దిపేట జిల్లాలో పని చేస్తున్నారు. కారులో డ్రైవర్‌ సహా నలుగురే ఉండాలనే నిబంధనతో పంపుతున్నారు. 


ప్రత్యేక వాహనంలో సొంతూళ్లకు పంపిన కేటీఆర్‌ 

హైదరాబాద్‌లో ఆకస్మిక పర్యటనలో భాగంగా బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని బుద్ధ భవన్‌ వద్ద రోడ్డుపై ఆయనకు మండుటెండలో నడుచుకుంటూ వెళుతున్న ఓ కుటుంబం కనిపించింది. వెంటనే కారు ఆపారు. వాహనం నుంచి దిగిన స్వయంగా వారి వద్దకు వెళ్లారు. ఎందుకిలా రోడ్డు మీద వెళుతున్నారు? అని వారిని ప్రశ్నించారు. తవ స్వస్థలం.. నల్లగొండ జిల్లా తుంగతుర్తి అని, హైదరాబాద్‌లో పని కోసం వచ్చామని, లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో తిరిగి వెళుతున్నామని చెప్పారు. ప్రయాణ సౌకర్యాలు నిలిచిపోవడంతో ఏకంగా 135 కిలోమీటర్లు నడిచి వెళ్లేందుకు వారు సిద్ధమయ్యారని తెలిసి కేటీఆర్‌ చలించిపోయారు. వారిని తుంగతుర్తి దాకా దిగబెట్టేందుకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయించారు. మంత్రి చొరవతో సరుకులు తరలించే ఓ ట్రాలీ ఆటోలో వారు సొంతూరికి బయలుదేరారు. 


వాహనాలు లేవు 

బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లాం. కరోనా వైర్‌స తో పనులు నిలిచిపో గా పని దొరకడం లేదు. ఇన్నాళ్లు పని చేసిన డబ్బులు కూడా కాంట్రాక్టరు ఇవ్వలేదు. ఇంటికి వెళ్లేందుకు బస్సులు కూడా లేవు. ప్రైవేటు వాహనాలు దొరక్కపోవడంతో కాలినడకన వెళ్తున్నాం. 

- వెంకటయ్య, కోస్గి


Updated Date - 2020-03-26T09:14:21+05:30 IST