Abn logo
Jul 30 2021 @ 00:49AM

నిరుపేదలకు లబ్ధి అందేలా కృషి చేయండి

జూపూడిలో సిబ్బందికి సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ నివాస్‌

 జూపూడి గ్రామ సచివాలయం తనిఖీలో  సిబ్బందికి కలెక్టర్‌ నివాస్‌ ఆదేశం

ఇబ్రహీంపట్నం, జూలై 29 : ప్రభుత్వ పథకాలు పొందని నిరుపేదలను గుర్తించి వారికి సంక్షేమ పథకాల లబ్ధిని అందించేలా కృషి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండంలో జూపూడి గ్రామ సచివాలయాన్ని గురువారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై పేదలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. పింఛన్లు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు భరరోసా, విద్యా దీవెన, విద్యాకానుక, చేయూత, ఆసరా వంటి పథకాలను పేదలను  సద్వినియోగం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందితోపాటు వలంటీర్లుగా మీదికూడా అన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేసి దానికి కింది లబ్ధి పొందిన వారి జాబితాను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న గ్రామసచివాలయ భవనం, వెల్‌సెస్‌ సెంటర్‌, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉద్యోగుల విధులకు సంబంధించిన రికార్డుల సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. తహసీల్దార్‌ సూర్యారావు, ఎంపీడీవో దివాకర్‌, పీఆర్‌ ఏఈ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాగేశ్వరరావు, ఏవో శైలజ తదితరులు పాల్గొన్నారు. 


అసంపూర్తి భవన నిర్మాణాలపై ప్రత్యేకాధికారి ఆగ్రహం

ముసునూరు : మండలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో అధికారుల పనితీరుపై మండల  ప్రత్యేక అధికారి వెంకటరమణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గోపవరం, చెక్కపల్లి, వలసపల్లి తదతర గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం, హెల్త్‌ సెంటర్‌, రైతుభరోసా కేంద్రాల నిర్మా ణాలను గురువారం పరిశీలించారు. పనులు 50శాతం కూడా పూర్తి కాలేదని, పీఆర్‌ ఏఈలు, ఇంజనీరింగ్‌ ఆసిస్టెంట్‌లు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. లోపూడిలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, ముసునూరులో సచివాలయం నిర్మాణాలు మాత్రమే పూర్తి అయ్యాయని, మిగిలిన గ్రామాల్లో భవనాల నిర్మాణ  పనులు ముందుకు సాగటం లేదన్నారు. హెల్త్‌ సెంటర్ల నిర్మాణాలు పూర్తిగా మరుగున పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో భవన నిర్మాణ పనులు తక్షణమే వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  ప్రభుత్వ లక్ష్యాలను నేరవేర్చేలా అధికారులు పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్‌ కంచర్ల వాణి, ఏఈలు నరసింహారావు, దుర్గరావు పాల్గొన్నారు. అలాగే వేల్పుచర్ల, గోపవరం గ్రామాల్లో జడ్పీ పాఠశాలను పరిశీలించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ  16 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నాడు - నేడు పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.


గోపవరంలో ఆర్‌బీకే నిర్మాణాన్ని పరిశీలిస్తున్న అధికారులు