ముద్ద దొరకడం లేదు...!

ABN , First Publish Date - 2020-07-09T10:30:32+05:30 IST

కరోనా వ్యాప్తి దెబ్బ పొట్టపోసుకునే కూలీలు, యాచకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ముద్ద దొరకడం లేదు...!

కూలీలకు పనుల్లేక, యాచకులకు దాతల్లేక పస్తులు 

లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో పేదలు

దాతల సాయం కోసం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి 


చీరాల, జూలై 8 : కరోనా వ్యాప్తి దెబ్బ పొట్టపోసుకునే కూలీలు, యాచకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పను లు లేక, దయతలచే వారు లేక రోజువారీ కూలీలు, యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. రోజుకో పూట తినీ, తినక కాలం వెళ్లదీస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఇస్తున్న బియ్యం సాయం నామమాత్రంగానే ఉంది. నిరుపేదలు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోసారి పేదలకు సాయమందించేందుకు అవకాశం కల్పించాలని రాజకీయపార్టీల ప్రతినిధులు, కొ న్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.


తొలి లాక్‌డౌన్‌ సమయంలో పెద్ద ఎత్తున ఆపన్నులకు దాతలు సాయమందించడం తెలిసిందే. తర్వాత సాధారణ పరిస్థితి ఏర్పడి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. మరోసారి కరోనా కేసుల విజృంభణతో మళ్లీ లాక్‌డౌన్‌, రాకపోకల నిషేధం, పనుల స్తం భన ఏర్పడింది. దీంతో పలు వర్గాల పేదలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ప్రధానంగా రోజు కూలితో కుటుంబాన్ని పోషించేవారు ఆకలి బాధలు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులు ఇచ్చి దాతలు మా కుటుంబాలను పస్తుల నుంచి గట్టెక్కించాలని పేదలు చేతులు చాస్తున్నారు. 

     

దాతలకు అనుమతి ఇవ్వాలి:దేవరపల్లి రంగారావు, కాంగ్రెస్‌ పార్టీ              నియోజకవర్గ ఇన్‌చార్జి

కరోనాతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు పోలీసులు దాతలకు అనుమతి ఇవ్వాలి. రాపిడ్‌టెస్ట్‌కు కాంగ్రెస్‌ పార్టీ తరపున మావంతు సాయం అందిస్తాం. ఇలాంటి సమయంలో దాతల సాయమే పేదలకు మనోధైర్యం కల్గిస్తోంది.

Updated Date - 2020-07-09T10:30:32+05:30 IST