‘డబుల్‌’ ఇళ్ల కోసం పేదల ఆందోళన

ABN , First Publish Date - 2022-01-25T07:25:27+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ

‘డబుల్‌’ ఇళ్ల కోసం పేదల ఆందోళన

  •  మిర్యాలగూడలో ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన 
  •  ఆదిలాబాద్‌ పట్టణంలో భారీ ర్యాలీ 


మిర్యాలగూడ, ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 24: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, ఆదిలాబాద్‌లలో ఆందోళనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే గోడౌన్ల వద్ద ఐదేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయిన 546 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను వెంటనే తమకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన 30 మంది నిరుపేదలు సోమవారం ఉదయం ఎమ్మెల్యే భాస్కర్‌రావు నివాసం ఎదుట ధర్నా చేశారు.


దీంతో స్పందించిన ఎమ్మెల్యే.... రైల్వే గోడౌన్ల వద్ద నిర్మించిన  ఇళ్లు మునిసిపాలిటీ పరిధిలోని వారి కోసమని, వెంకటాద్రిపాలెం వాసులకు ఇవ్వడం వీలుకాదని, వారికి మరొకచోట కేటాయించేలా చూస్తామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకారులంతా అక్కడినుంచి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్దకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016లో వెంకటాద్రిపాలెం నుంచి 130 మంది ఇళ్లులేని నిరుపేదలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇక్కడ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇళ్లు కేటాయించాలని కోరితే ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఐదారేళ్లు గడిచినా వాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవటంతో ఆ గృహాలు శిథిలంగా మారడంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. కరోనా సమయంలో దగ్గినా, తుమ్మినా కిరాయి ఇళ్లను ఖాళీ చేయలంటూ యజమానులు ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.


అలాగే, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో నిరుపేదలు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా.. హామీలను మాత్రం నెరవేర్చడం లేదన్నారు. వెంటనే అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-01-25T07:25:27+05:30 IST