‘డబుల్‌’ ఇళ్ల కోసం పేదల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-23T05:01:06+05:30 IST

భవనాలు ఉన్నోళ్లకు ఇళ్లు ఇచ్చి తమకు అన్యాయం చేశారని పేదలు ఆందోళన చేపట్టారు.

‘డబుల్‌’ ఇళ్ల కోసం పేదల ఆందోళన
మనోహరాబాద్‌లో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న దృశ్యం

ఇళ్లు ఉన్నోళ్లకే డబుల్‌ బెడ్‌రూంలు

 కేటాయించారని మనోహరాబాద్‌లో నిరసన 

రోడ్డుపై బైఠాయించిన పేదలు, మహిళలు

ఎస్‌ఐ హామీతో ఆందోళన విరమణ


తూప్రాన్‌(మనోహరాబాద్‌), మే22: భవనాలు ఉన్నోళ్లకు ఇళ్లు ఇచ్చి తమకు అన్యాయం చేశారని పేదలు ఆందోళన చేపట్టారు. గుడిసెల్లో ఉంటున్న పేదలైన తమను పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలిపారు. రోడెక్కిన పేదలు, మహిళలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ఈ సంఘటన గజ్వేల్‌ నియోజకవర్గంలోని మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. మనోహరాబాద్‌ మండల కేంద్రంలో 72 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. ఆ ఇళ్లను త్వరలోనే మంత్రి  హరీశ్‌రావు ద్వారా పంపిణీ చేసేందుకు కసరత్తు చేపట్టారు. పేదలను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించి సర్వే చేపట్టారు. మనోహరాబాద్‌లో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు హామీ ఇవ్వడంతో ముందుగా 24 ఇళ్లను ఇచ్చేందుకు నిర్ణయించగా, చివరకు 40 ఇళ్లను కేటాయించారు. మిగిలిన 32ఇళ్లను పేదలకు పంచేందుకు నిర్ణయించారు. సర్వేలో 77 మంది పేదలున్నట్లు గుర్తించారు. పలు పర్యాయాలు గ్రామసభలు నిర్వహించినప్పటికీ, ఎంపిక కొలిక్కి రాకపోవడంతో శనివారం రాత్రి డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించడంలో చాలా వరకు పేదలకు ఇళ్లు దక్కలేదు. గుడిసెల్లో నివాసముంటున్న పేదలకు ఇళ్ల కేటాయింపులో అవకాశం లభించలేదు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వాళ్లలోనూ పెద్దపెద్ద భవనాలున్నోళ్లకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించారు. ఆదివారం ఉదయం పేదలు పోచమ్మగుడి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రోడ్డు విస్తరణ బాధితులకు ఇల్లు కేటాయించారని, భవనాలున్నోళ్లు డబుల్‌బెడ్‌ ఇళ్లలో ఎక్కడుంటారని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా గుడిసెలు, అద్దె ఇళ్లలో ఉంటున్న తమకు ఇళ్లను కేటాయించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో పేదలకు ఇళ్లను కేటాయించకుండా, ధనవంతులకు ఇళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. 

 పోచమ్మగుడి వద్ద గుమిగూడిన పేదలందరూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. అక్కడి నుంచి హైవే 44 రోడ్డు వరకు విచ్చేసి, మనోహరాబాద్‌ ఊర్లోకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. డ్రా పద్దతిన ఎంపిక చేసే కార్యక్రమంలో రాత్రి వరకు కూర్చోబెట్టి ఇళ్లను కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేటాయించకుండా ధనవంతులకే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కేటాయించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకొని పేదలకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన వద్దకు వచ్చిన మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ పేదలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

Updated Date - 2022-05-23T05:01:06+05:30 IST