Oct 19 2021 @ 23:32PM

Bunny: పూజాహెగ్డే నాకే కాదు.. అందరికీ ప్రత్యేకమే!

‘‘పూజా హెగ్డే నాకొక్కడికే ప్రత్యేకం అనుకున్నా. కానీ తను అందరి హీరోలకీ స్పెషలే’ అని ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది. దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌తో ముందుకెళ్తుంది. మంగళవారం నిర్వహించిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో బన్నీ మాట్లాడుతూ ‘‘అఖిల్‌ నాకు తమ్ముడులాంటివాడు. తను పరిశ్రమలో అడుగుపెట్టకముందు.. అఖిల్‌ని ఇలా లాంచ్‌ చేస్తే బాగుంటుందా? అలా పరిచయం చేస్తే బాగుంటుందా? అని నాగార్జునగారితో మాట్లాడాను.  తనంటే అంత ఇష్టం నాకు. ఈ సినిమాతో తను సూపర్‌హిట్‌ అందుకోవడంతో పర్సనల్‌గా చాలా ఆనందంగా ఉన్నా. తను డాన్స్‌, ఫైట్లు బాగా చేస్తాడు. అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాలో నటనకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్‌ హిట్‌ అందుకుంటాడని ముందే తెలుసు. అక్కినేని కుటుంబంతో మా అనుబంధం ఇప్పటిది కాదు. ‘లవ్‌స్టోరి’తో హిట్‌ కొట్టిన చైతూకి శుభాకాంక్షలు  తెలుపుతున్నా. ప్రేక్షకులు సినిమా హాళ్లకు అనే సందేహంలో ఉన్నప్పుడు సినిమాని రిలీజ్‌ చేసి విజయం అందుకొని చిత్ర పరిశ్రమకి ధైర్యానిచ్చిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఈ ఇద్దరి సక్సెస్‌తో నాగార్జున గారు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలుసు. ‘ముకుంద’ ఆడియో వేడుక నుంచి పూజా హెగ్డేని చూస్తున్నా. సినిమా సినిమాకీ వైవిధ్యంగా నటిస్తుంది.  ఈ చిత్రంతో మరో మెట్టెక్కింది. నా ఒక్కడికే తను స్పెషల్‌ అనుకున్నా.. కానీ కాదు. అందరికీ స్పెషలే. తను ఏ హీరోతో నటిస్తే  వారు హిట్‌ అందుకున్నట్టే’’ అని అన్నారు.