కోలీవుడ్ అగ్రహీరో విజయ్ సరసన నటించేందుకు హీరోయిన్లు పోటీ పడుతుంటారు. ఎప్పుడు అవకాశం వస్తుందా.. అని వేయికళ్ళతో ఎదురు చూస్తుంటారు. కొంతమంది హీరోయిన్లు అయితే, అందుకోసం ముమ్మరంగానే ప్రయత్నిస్తుంటారు. ఈ కోవలోకి పూజా హెగ్డే వస్తుంది. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్న పూజ కోలీవుడ్లోకి 2012లో మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘ముగమూడి’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఈమెకు నిరాశే మిగిల్చింది. ఆ తర్వాత ఈమెకు తమిళంలో సరైన అవకాశాలు లేకపోవడంలో టాలీవుడ్లోకి అడుగుపెట్టి, అక్కడ అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది. ఈ క్రమంలో విజయ్ నటించే తన 65వ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించనున్నారు.
వాస్తవానికి ఇందులో హీరోయిన్గా తొలుత రష్మిక మందన్నా పేరును అనుకున్నారు. కానీ, దర్శకుడు అడిగిన తేదీలను రష్మిక సర్దుబాటు చేయలేకపోయినట్టు సమాచారం. దీంతో పూజా హెగ్డే పేరు పరిశీలించారు. ఇలాంటి అవకాశం కోసమే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పూజా ఈ సువర్ణావకాశం వదులుకోరాదని భావించి, ఓకే చెప్పినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందుకోసం పూజ ఓ తెలుగు చిత్రం ఆఫర్‌ను కూడా త్యజించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ చిత్రంలో హీరోయిన్గా పూజ ఎంపికకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.