అసమ్మతి సెగలు

ABN , First Publish Date - 2022-05-26T05:51:27+05:30 IST

పొన్నూరు వైసీపీలో అసమ్మతి రాజుకుంది. పట్టణంలోని కిరాణ మర్చంట్స్‌ అసోషియేషన్‌ భవనంలో బుధవారం ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి అసమ్మతి నాయకులు సమావేశం అయ్యారు.

అసమ్మతి సెగలు
సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ అసమ్మతి వర్గం నేతలు

పార్టీని గెలిపించిన మాకే ఛీత్కారాలు 

నియోజకవర్గాన్ని అక్రమ మైనింగ్‌ అడ్డాగా మార్చారు

ఎమ్మెల్యే రోశయ్యపై తీవ్ర ఆరోపణలు

పొన్నూరు వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి 

 

 పొన్నూరుటౌన్‌, మే 25: పొన్నూరు వైసీపీలో అసమ్మతి రాజుకుంది. పట్టణంలోని కిరాణ మర్చంట్స్‌ అసోషియేషన్‌ భవనంలో బుధవారం ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి అసమ్మతి నాయకులు సమావేశం అయ్యారు. వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులు అర్పించి గత మూడేళ్లుగా పడుతున్న తమ భాధలను ఏకరువు పెట్టారు. కష్టాలు, నష్టాలను ఓర్చి రావి వెంకటరమణ నేతృత్వంలో 2019లో పార్టీని అధికారం తెచ్చే దిశగా కృషి చేశామన్నారు. కానీ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం తెలియన కిలారి వెంకటరోశయ్య టికెట్‌ పొంది 20 రోజుల ముందు పొన్నూరు వస్తే అధినేత ఆదేశాలే శిరోధార్యమని పార్టీ విజయానికి శ్రమటోడ్చామని తెలిపారు. కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెదకాకాని మైనార్టీ  మండల నాయకులు అల్లావుద్దీన్‌ మాట్లాడుతూ రోశయ్యను గెలిపించిన పాపానికి తాను కేసులు ఎదుర్కొంటున్నానని ఆ క్రోశం వెలిబుచ్చారు. బ్రాహ్మణకోడూరుకు చెందిన సౌపాటి ప్రేమకుమార్‌ మాట్లాడుతూ సర్పంచ్‌గా పోటీచేసిన తనను ఎమ్మెల్యే రోశయ్య ప్రతిపక్షంతో కలసి ఓడించారన్నారు. చేబ్రోలు మండలానికి చెందిన నియోజకవర్గ అధ్యక్షురాలు వేముల శివపార్వతి మాట్లాడుతూ టీడీపీ వారితో కలిసి మైనింగ్‌ పాల్పడుతున్నారని ఆరోపించారు. మైనార్టీ నాయకుడు అబ్దుల్లా మాట్లాడుతూ తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఎన్నిసార్లు వేడుకున్నా విచారణ కోసం రోశయ్య కనికరించడం లేదన్నారు. తన కుమారుడి మృతి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతి చిట్టా తమ వద్ద ఉందని ఆయన అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీ జెండాను వదలబోమని ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో మూడు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు గొట్టిముక్కల పూర్ణచంద్రరావు, వడ్రాణం ప్రసాద్‌, అంకినీడు చౌదరి, విఠల్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:51:27+05:30 IST