తిరిగి వైసీపీ గూటికి పొంగులేటి?

ABN , First Publish Date - 2022-01-21T02:53:35+05:30 IST

సీఎం జగన్‌ను టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాద

తిరిగి వైసీపీ గూటికి పొంగులేటి?

అమరావతి: సీఎం జగన్‌ను టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తరువాత జగన్‌ను పొంగులేటి కలిశారు. అయితే వీరిద్దరిపై కలయికపై రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరపున పొంగులేటి పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికలలో తెలంగాణలో వైసీపీ గెలుచుకున్న ఏకైక ఎంపీ సీటు ఖమ్మం కావడం విశేషం. తెలంగాణలో వైసీపీకి బలం లేకున్నా తన ఛరిష్మాతో ఎంపీగా గెలిచి జగన్ మనసును చూరగొన్నారు. ఎవరూ ఊహించని రీతిలో గెలుపొందడంతో ఒక్కసారిగా ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగింది. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలలో నలుగురు ఎమ్మెల్యే సీట్లను వైసీపీ గెలుచుకోవడంలో ఆయన కీలకపాత్ర వహించారు. 


అయితే తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు పొంగులేటి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. తనతో గెలిచిన ఇతర వైసీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్‌ఎస్‌లో చేర్పించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ బలపడడానికి ఆయన విశేషమైన క‌ృషి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక సీటును అనగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే సీటును మాత్రమే టీఆర్‌ఎస్ గెలుచుకుంది. 


2019 పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్‌ఎస్  అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో టీడీపీ నుంచి నామా నాగేశ్వర్ రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఖమ్మం ఎంపీ టిక్కెట్టును నామాకు సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో అలక వహించిన పొంగులేటి వేరే పార్టీల తరపున పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. కానీ కేసీఆర్, కేటీఆర్ కల్పించుకుని పొంగులేటికి సర్ది చెప్పారు. దీంతో నామా గెలుపుకోసం పొంగులేటి హామీ ఇచ్చి ఎంపీగా నామాను దగ్గరుండి గెలిపించారు. రాబోయే కాలంలో పొంగులేటికి తగిన అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పొంగులేటికి అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సీటును సీనీయర్ నాయకుడు తాతా మధుకు కేసీఆర్ ఇచ్చారు. దీంతో మరోసారి పొంగులేటి నిరాశ చెందారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు తాతా మధును ఎమ్మెల్సీగా గెలిపించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. 


అయితే ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళతాడని రాష్ట్రంలో ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. ఇదే అదునుగా పొంగులేటిని బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. తన సమీప బంధువు పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో ఉండడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకమైన ఛరిష్మా ఉంది. పదవిలో లేనప్పటికీ తన కేడర్‌ను ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రజలలో శ్రీనివాసరెడ్డికి ఉన్న అభిమానాన్ని వాడుకొని ఖమ్మం జిల్లాలో పాగా వేయాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ను శ్రీనివాసరెడ్డి కలవడం రాజకీయ వర్గాలలో ప్రాధాన్యం సంతరించుకుంది. 


Updated Date - 2022-01-21T02:53:35+05:30 IST