పల్లెల్లో సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-16T05:11:05+05:30 IST

-తెలుగు వారి ప్రతీక సంక్రాంతిని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు పండుగకు స్వస్థలాలకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు,

పల్లెల్లో సంక్రాంతి
నిర్మానుష్యంగా ఉన్న కోట జంక్షన్‌


కుటుంబాలతో సందడి..సందడిగా..
 ఘనంగా జరుపుకున్న జిల్లా వాసులు
(విజయనగరం రూరల్‌)

-తెలుగు వారి ప్రతీక సంక్రాంతిని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు పండుగకు స్వస్థలాలకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల కలయికతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. కనుమ పర్వదినాన్ని శుక్రవారం వేడుకగా చేసుకున్నారు. మాంసం, చేపల విక్రయాలు జోరుగా సాగాయి. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో గురువారం మధ్యాహ్నంతో షాపులు మూతపడ్డాయి. పట్టణ ప్రజలు స్వస్థలాలకు వెళ్లడం, షాపులు మూతపడడంతో శుక్రవారం విజయనగరంలోని ప్రధాన మార్కెట్లు నిర్మానుష్యంగా మారాయి. కనుమ సందర్భంగా జిల్లాలో వివిధ చోట్ల జాతరలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల ప్రజలు హాజరయ్యారు.
-పల్లెల్లో పండుగ సందడి నెలకొంది. బుధవారం భోగితో ప్రారంభమైన వేడుకలు శుక్రవారం కనుమతో ముగిశాయి. జిల్లా నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వేలాది మంది వలస వెళ్లారు.  అటువంటి వారంతా సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై నుంచి పెద్దఎత్తున పండుగకు ముందే చేరుకున్నారు. పండుగ ముగియడంతో తిరిగి ఉపాధి బాట పట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా వలస జీవుల రాకతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. మహిళలు ఇంటి ముంగిట రంగవల్లులతో తీర్చిదిద్దారు. హరిదాసులు, కొమ్ముదాసుల ఆలాపనలు, గంగిరెద్దులు, బుడబుక్కల వారి ప్రదర్శనతో పండుగ కళ తొణికిసలాడింది. సంక్రాంతి నాడు సంప్రదాయబద్ధంగా పెద్దలకు వస్త్రాలు సమర్పించారు. శుక్రవారం కనుమను విందులతో గడిపారు. రైతులు గోపూజను నిర్వహించారు.

నగరం నిర్మానుష్యం
కోట జంక్షన్‌లో శుక్రవారం మధ్యాహ్నం నాటి దృశ్యమిది. ఎప్పుడూ జన రద్దీతో ఉండే ఈ ప్రధాన ప్రాంతం ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. పట్టణ వాసులు పండుగకు స్వస్థలాలకు వెళ్లడం, షాపులు మూతపడడంతో దాదాపు నగరంలోని ప్రధాన మార్కెట్లు, జంక్షన్లు, వీధులు బోసిపోయి కనిపించాయి.  పండుగకు పది రోజుల ముందు నుంచి వేలాది మందితో కిటకిటలాడిన బాలాజీ టెక్స్‌టైల్‌ మార్కెట్‌, ఉల్లివీధి, పెద్ద, చిన్న మార్కెట్లు బోసిపోయాయి.  వారం రోజులుగా జన రద్దీతో కనిపించిన కోట జంక్షన్‌, మూడు లాంతర్లు జంక్షన్‌, అంబటిసత్తర్వు జంక్షన్‌, గంట స్తంభం జంక్షన్‌, కన్యకాపరమేశ్వరి ఆలయం, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, మున్సిపల్‌ కార్యాలయ రోడ్డు ఖాళీగా కనిపించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అతి తక్కువ సిబ్బంది మాత్రమే శుక్రవారం విధులకు హాజరయ్యారు. పండుగ నేపథ్యంలో వివిధ పనుల మీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.  సోమవారం నుంచి యఽథావిధిగా షాపులు, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు తెరచుకోనున్నాయి.




Updated Date - 2021-01-16T05:11:05+05:30 IST