వైభవంగా సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-16T06:02:30+05:30 IST

సంక్రాంతి పర్వదినాన్ని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కనుల పండువగా ప్రజలు జరుపుకున్నారు.

వైభవంగా సంక్రాంతి
విశేష అలంకరణలో సీతారామలక్ష్మణులు

గిద్దలూరు టౌన్‌, జనవరి 15 : సంక్రాంతి పర్వదినాన్ని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కనుల పండువగా ప్రజలు జరుపుకున్నారు. రంగవల్లులను ప్రతి ఇంటి ముందు అలంకరించి సంక్రాంతి వైభవాన్ని చాటుకున్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ఇతర ప్రాంతాలలో ఉద్యోగరీత్యా ఉన్నవారు, పండుగకు పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకోవడంతో సందడి నెలకొంది. మకర సంక్రాంతి సందర్భంగా పలు గ్రామాలలో సాంస్కృతిక, క్రీడా పోటీలను నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం కనుమ సందర్భంగా పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో రాముల వారి మూలవిరాఠ్‌ను పట్టణ వీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే గడికోట గ్రామం నందు సంక్రాంతి సంబరాలు వైభవంగా చేశారు. పట్టాభిరాముల వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించి పారువేట ఉత్సవాన్ని నిర్వహించారు.

కంభం : సంక్రాంతి పర్వదినం సందర్భంగా కంభం మండల కాప్‌ రాక్స్‌ వారు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సాధించిన లక్ష్మికి రూ.5116 రూపాయలు, రెండవ బహుమతి సాధించిన హిమబిందుకు రూ.2516, మూడవ బహుమతి సాధించిన ఈశ్వరికి రూ.2116 అందజేశారు. కార్యక్రమంలో కాద్వా అధ్యక్షులు భాస్కర్‌, కాపునాయకులు పాల్గొన్నారు.

వెంకన్నకు కల్యాణం

కంభం : మకర సంక్రాంతి మరియు శ్రవణ నక్షత్రం సందర్భంగా కంభం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం పారువేట నగర పురవీధుల్లో స్వామి వారిని గ్రామోత్సవం నిర్వహించారు.శుక్రవారం కనుమ వేడుకలు ఘనంగా జరిగాయి. పశువుల పండుగగా పిలుచుకునే కనుమ వేడుకల్లో భాగంగా రైతులు పాడిపశువులను అలంకరించి పూజలు చేశారు.

రాచర్ల : మండలంలోని అన్ని పల్లెల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు కులాలకు అతీతంగా జరుపుకున్నారు. అనుమలవీడు గ్రామంలో రాముల వారి గ్రామోత్సవం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్‌రెడ్డి, పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు ముస్లింలు షేక్‌ పల్నాటి మహబూబ్‌పీరా, పల్నాటి లతీఫ్‌ తదితరులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. రాచర్ల గ్రామానికి చెందిన కటికె యోగానంద్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా రాచర్లలో ముగ్గులపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

కొమరోలు : సంక్రాంతి సందర్భంగా మహిళలు గృహాల ముందు అందమైన రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి శోభ తెచ్చారు. శుక్రవారం కనుమ పండుగ రోజు సాయంత్రం పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు. బాదినేనిపల్లి, చింతలపల్లి, రాజుపాలెం, తాటిచెర్ల, తదితర గ్రామాలలో పారువేట ఘనంగా నిర్వహించారు. 

త్రిపురాంతకం : సంక్రాంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాలలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా మహిళలు ఇళ్లముందు రంగవళ్లులతో అందమైన ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. పండుగ సందర్బంగా వెంకటేశ్వరస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, నాగస్వరూప ఎల్లమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధపుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారి ఆలయంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అభిషేకాలు, కుంకుమార్చనలు పూజలు చేశారు. పండుగ సందర్భంగా పలు గ్రామాలలో చిన్నారులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు.

త్రిపురాంతకం : కనుమ పండుగను పురస్కరించుకుని దేవదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నిర్వహిస్తున్నగోపూజ కార్యక్రమాలలో భాగం గా త్రిపురాంతకంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో గోపూజ నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు పాలంక ప్రసాదు, విశ్వన్నారాయణశాస్త్రి గోపూజా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం భక్తులు గోవుచుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

 ఎర్రగొండపాలెం : మండలంలో సంక్రాంతి పండుగను గురువారం మండల ప్రజలు బంధుమిత్రులతో కలసి వేడుకగా నిర్వహించారు. కొత్త పంటలు ఇళ్లు చేరే కాలం కావడంతో కొత్త బియ్యంతో తమ ఇష్టదైవాలకు పొంగళ్ళు  సమర్పించారు. ఎర్రగొండపాలెం వీధుల్లో రంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి మహిళలు తమ ప్రతిభ కనబరిచారు. మండల కేంద్రం కంటే గ్రామాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు కుటుంబసభ్యులతో ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. శుక్రవారం కనుమ పండుగను నిర్వహించారు.

పుల్లలచెరువు : సంక్రాంతి సందర్భంగా పుల్లలచెరువు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కనుమ రోజు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామంలోని ప్రధాన వీధిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గుంటూరి త్రీవేణి, బోయిన శిరిషా, వడ్లమాను శిరిషాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వీరికి  రూ.3 వేలు, రూ.2 వేలు, వెయ్యి నగదు బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

 ఎర్రగొండపాలెం : పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో మకరసంక్రాంతి  సందర్భంగా గురువారం సాయంత్రం అయ్యప్పస్వామి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గురువారం ఉదయం 9 గంటలకు ఆలయం నుంచి అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని, విఘ్నేశ్వరుని ప్రతిమలను టాక్టరుపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం కర్పూరం వెలిగించి భక్తులకు మకరజ్యోతి దర్శనం కల్పించారు. ఆలయంలో 18 మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు. అయ్యప్పస్వామి దేవాలయం కమిటి అధ్యక్షులు కందూరి రామయ్య, కార్యదర్శి ఐవి సుబ్బారావు, సభ్యులు మొగిలి చలమయ్య, టి రామలింగయ్య, కందూరిప్రసాదు, కందూరి కాశీవిశ్వనాధ్‌,భక్తులు పాల్గొన్నారు. భక్తులకు తీర్ధప్రసాదములు పంపిణీ చేశారు.

=======================================


17 నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు

పెద్ద దోర్నాల, జనవరి 15 : స్థానిక వ్యవసాయ మార్కెట్టు యార్డు ఆవరణలో ఈ నెల 17న నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ మజీద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ  ఆధ్వర్యంలో ఆదిమూలపు విశాల్‌ రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలను ఈ నెల 17,18,19 తేదీలలో జరుపనున్నట్లు తెలిపారు. గెలుపొందిన జట్టుకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ బహుమతులు రూ.50 వేలు, రూ.30 వేలు, రూ. 20 వేలు, రూ.10వేలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలను ఆదిమూలపు విశాల్‌ ప్రారంభిస్తారన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి కమిటి వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.


Updated Date - 2021-01-16T06:02:30+05:30 IST