Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఘనంగా సక్రాంతి, కనుమ

twitter-iconwatsapp-iconfb-icon
ఘనంగా సక్రాంతి, కనుమముత్తుకూరు : శివాలయంలో గోపూజ చేస్తున్న అర్చకులు

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు, పశువులకు అలంకరణ

కోవూరు, జనవరి16 :సంక్రాంతి, కనుమ పర్వదినాల్ని శని, ఆది వారాల్లో మండల ప్రజలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. పట్టణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీవీరాంజనే యస్వామి ఆలయా ల్లో మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో పూలంగి, పల్లకీసేవల్లో పూజలు చేశారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో కలశాన్ని స్థాపించి పూజలు చేశారు. కలశాన్ని పీఆర్‌ఆర్‌ కాలనీలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం నుంచి ప్రదర్శనగా తీసుకువచ్చారు. వెయ్యి టెంకాయలు కొట్టి మెక్కు తీర్చుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో షటిల్‌బాడ్మింటన్‌ పోటీల్ని సీఐ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.  మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి పాల్గొన్నారు. వేగూరు గ్రామంలో రంగవల్లుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎంపీపీ పార్వతి బహుమతిప్రదానం చేశారు. 

ముత్తుకూరు : మండలంలో సంక్రాంతి, కనుమ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. సంక్రాంతి పర్వదినాన మహిళలు వేకువనే లేచి ఇంటిముందు రంగవల్లులు వేయడంతో మొదలైన వేడుకలు కనుమ పండుగ రోజున గోపూజలతో ముగిసాయి. పాడిరైతులు తమ పశువులను రంగులతో అందంగా అలంకరించి, గోపూజ నిర్వహించి తమ ఇంట్లో పాడి సంవృద్ధిగా ఉండాలని మొక్కుకున్నారు. కృష్ణపట్నంలోని కామాక్షి సమేత సిద్ధేశ్వరాలయంలో నూతన ఆలయ ట్రస్టు కమిటీ, ఆయల ఈవో జనార్దన్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ప్రధాన అర్చకులు గూడలి నగేష్‌కుమార్‌ గోపూజను నిర్వహి ంచారు. అనంతరం గ్రామంలో సిద్ధేశ్వరస్వామి గ్రామోత్సవాన్ని ఘన ంగా చేశారు. మండలంలో పలుచోట్ల మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ముత్తుకూరు థర్మల్‌ ఆర్‌ఆర్‌ కాలనీలో నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీలు స్థానికులను ఆకట్టు కున్నాయి.

బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని బుచ్చి, జొన్నవాడల్లో సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా కోదండరామస్వామి, కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ మల్లికార్జుస్వామి, కామాక్షితాయి వార్లు గ్రామోత్సవంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కనుమ రోజున ఆలయ సత్రాల్లో కాపురముంటున్న పొదలకూరుకు చెందిన రమణారెడ్డి (73) ఉదయం మృతిచెందడంతో ఆలయం మూసేశారు. అంత్యక్రియల అనంతరం సంప్రోక్షణ చేసి భక్తులకు పునర్ద్శనం కల్పించారు. మండలంలోని రేబాలలో కనుమ ఉదయం స్థానికులంతా పుట్టాలమ్మకు ఆలయం ముందు పొంగళ్లు పొంగించి నివేదించారు. ఆలయం నుంచి పుట్టాలమ్మను గ్రామంలోని పశువుల ఆసుపత్రి వద్ద మండపంలో కొలువు దీర్చి అక్కడి నుంచి రాత్రంతా గ్రామోత్సవం నిర్వహించారు.  మండలంలోని అన్ని గ్రామాల్లో పాడి రైతుంలందరూ పశువుల కొమ్ములకు రంగులు వేసి పసుపు, కుంకుమలతో పూజించారు.  జొన్నవాడ ఆలయ గోశాలలో గోవులకు ఆలయ ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి, భక్తులతో అర్చకులు గోపూజ చేయించారు. అనంతరం గోవులకు అరటిపండ్లు పెట్టి కొత్త వస్ర్తాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీతోపాటు మండలంలోని వాడవాడలా సంక్రాంతి ఆటల, ముగ్గుల పోటీలు జరిగాయి. పలు గ్రామాల్లో సీపీఎం, డీవైఎఫ్‌ఐ, టీడీపీ, వైసీపీ, బీజేపీ అధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని కాశీపాళెంలో భధ్రావతి సమేత భావనా రుషీశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో ముగ్గులపోటీలు నిర్వహించారు. మండలంలోని దామరమడుగు, జొన్నవాడ, పెనుబల్లి, మినగల్లు, రేబాల, రెడ్డిపాళెం, కాగులపాడు,  పంచేడుతోపాటు పలు గ్రామాల్లో భోగి రోజుకు ముందు నుంచే కబడ్డీ, క్రికెట్టు, వాలీబాల్‌ తదితర ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. రెడ్డిపాళెంలో వాలీబాల్‌ విజేతలకు జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు యశ్వంత్‌ సింగ్‌ పిలుపు మేరకు బుచ్చి బీజేపీ కార్యాలయంలో మండల యువమోర్చా ఆధ్వర్యంలో బహుతులు పంపిణీ చేశారు.

దామరమడుగులో ఆటల పోటీలకు బ్రేక్‌

మండలంలోని దామరమడుగులో కనుమ రోజు జరగాల్సిన ఆటలపోటీలకు రెండు వర్గాల మధ్య ఏర్పడిన సమస్యతో ఆదివారం బ్రేక్‌ పడింది. తమకు అన్యాయం జరిగిందంటూ మఠం కాలనీ  యువకులు నిరసనకు దిగారు. దామరమడుగు, ఆ పంచాయతీలోని మఠంకాలనీ (ఆర్‌ఆర్‌ నగర్‌)కి చెందిన యువత ఆటల పోట్లీల్లో పాల్గొంది.  ఆటల పోటీల్లో స్థానిక యువతకే ప్రాధాన్యం. గతేడాది దామరమడుగు యువకులు తమ టీంలో కొత్త వ్యక్తితో పోటీల్లో దిగారు. ఈ ఏడాది మఠంకాలనీ టీంనుంచి బయట వ్యక్తిని పోటీల్లో దించడాన్ని దామరమడుగు డీవైఎఫ్‌ఐ నాయకుడు తప్పుపట్టాడు. దీంతో ఇరువురి మధ్య జరిగిన వివాదంతో ఆటల పోటీలు ఆగాయి. తమను దుర్భాలాడి పోటీలనుంచి బహిష్కరించారంటూ మఠం కాలనీ యువకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనకు దిగారు. డీవైఎఫ్‌ఐ, సీపీఎం పెద్దలు చర్చలు జరిపినా ఇంకా ఓ కొలిక్కి రాలేదు.  సమస్య పరిష్కారం  అయితేనే ఆటల పోటీలు కొనసాగుతాయి.

పొదలకూరు : మండలంలో  పల్లె, పట్టణాలల్లోని ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులు హరివిల్లుల్లా వెల్లివిరిశాయి. కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో ఊరూవాడా కళకళలాడింది. ముగ్గుల పోటీల్లో మహిళలు పోటీపడ్డారు. మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, వేకువజామునే జంగమదేవరుల జేగంటలు మోగాయి. అలాగే పితృదేవతలను పూజిస్తూ, దాన ధర్మాలు నిర్వహించారు. పిల్లలు గాలి పతంగులను ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు. అలాగే ఆదివారం కనుక పండుగను పురస్కరించుకుని పశువులను అలరించారు. పొలాల్లో పొలి చల్లారు. ఇళ్ల గుమ్మాలకు ధాన్యపు కంకులు వ్రేలాడదీశారు. 

విడవలూరు : సంక్రాంతి, కనుమ వేడుకలను మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. విడవలూరు, చౌకిచర్ల, ఊటుకూరు, రామతీర్థం, దండిగుంట, వరిణి దంపూరు గ్రామాల్లో కనుమ పండుగ సందర్భంగా పాడి పశువులకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. వాటికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కనుమని పురస్కరించుకుని రామతీర్థం, పార్లపల్లి, విడవలూరులోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఊటుకూరు గ్రామంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని రెండురోజులుగా వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆర్‌కె బెజవాడ యూత్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఊటుకూరు జట్టు విజేతగా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో కొడవలూరు, అన్నారెడ్డిపాళెం జట్లు నిలబడ్డాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం జరిగిన క్రికెట్‌ పోటీల్లో విజేతలకు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వంశీకృష్ణారెడ్డి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విడవలూరు, కొడవలూరు ఎస్‌లు ఆనంద్‌ భాస్కర్‌, సుబ్బారావు, వైసీపీ నాయకులు రామిరెడ్డి విజయభానురెడ్డి, విజయకుమార్‌, హరిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

వెంకటాచలం : మండలంలో శనివారం సంక్రాంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సొంత గ్రామాలకు చేరుకోవడంతో పల్లెల్లో సందడి నెలకొంది. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని ఆలయాలతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రలైన కసుమూరులోని మస్తాన్‌ వలీ దర్గా, గొలగమూడిలోని భగవాన్‌ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమాలు భక్తులతో కిక్కిరించాయి. రైతులు పశువుల కొమ్ములకు రంగులు వేశారు. మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఆ గ్రామంలో  దొడ్డక మురళీమోహన్‌ ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా వాలీబాల్‌, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా క్రికెట్‌, ముగ్గుల పోటీలు నిర్వహించారు. క్రికెట్‌ ఫైనల్‌ విజేతకు రూ.5 వేలు, రన్నరప్‌కు రూ.3 వేలు, వాలీబాల్‌ విజేతకు రూ.2,500, రన్నరప్‌కు రూ.1,500  బహుమతులను ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌రావు అందజేశారు.  

కొడవలూరు : మండల ప్రజలు సంక్రాంతి, కనుమ  పండుగలను ఘనంగా జరుపుకున్నారు. పల్లెల్లో పోటీలు పడి మరీ ముగ్గులు వేశారు. గాంధీ జన సంఘంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు గ్రామ సర్పంచ్‌ కోటంరెడ్డి దివ్యరెడ్డి బహుమతులు అందజేశారు. పంచాయతీలోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 

తోటపల్లిగూడూరు : మండల ప్రజలు సంక్రాంతి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా జరుపుకున్నారు. అలాగే పితృదేవతలకు తర్పణాలు వదిలారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేసి స్నేహితులు, కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. గ్రామాల్లో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యంగా ఇస్కపాలెం గ్రామంలో సర్పంచ్‌ ఇంగిలేల వెంకట చైతన్యకుమార్‌ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలను మాజీ సర్పంచ్‌ ఇంగిలేల శివయ్య, ఉపాధ్యాయులు ఇంగిలేల బాలకృష్ణ పర్యవేక్షించారు. 

జిల్లాస్థాయి చెడుగుడు పోటీ విజేత ముదివర్తి

మండలంలోని సంక్రాంతిని పురస్కరించుకుని పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, ఆల్తూరి సురేంద్రరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆల్తూరి గిరీష్‌రెడ్డి, ఆల్తూరి మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెడుగుడు పోటీలు 14, 15 తేదీలలో నిర్వహించగా ముదివర్తి జట్టు మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో అల్లూరు, మూడోస్థానంలో పాపిరెడ్డిపాలెం, రావూరు జట్లు గెలుపొందాయి. అమ్మాయిల్లో మొదటి స్థానం పాపిరెడ్డిపాలెం, రెండోస్థానం డీకేడబ్ల్యూ కాలేజీ జట్టు, మూడో స్థానంలో అల్లూరు జట్లు గెలుపొందాయి.  ఆల్తూరి గిరీష్‌రెడ్డి కుమారులు గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. పోటీలకు ఆర్గనైజర్‌ తిరువళ్లూరు ఈశ్వరయ్య బాధ్యత వహించి పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ కన్‌స్ట్రక్షన్‌ యూత్‌ దేవకుమార్‌, మురళి, వెంకటేశ్వర్లు, రాము, మోహన్‌ పాల్గొన్నారు. 

ప్రత్యేకారాధనలు

మండలంలోని క్రైస్తవ ఆరాధన మందిరాల్లో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. కామాక్షినగర్‌, తోటపల్లి, కొలిదిబ్బ, తోటపలి ్లగూడూరు, రావూరువారికండ్రిగ, డక్కిలి వారిపాలెం, మాచర్లవారి పాలెం, ఈదూరు, ఇస్కపాలెం, తదితరులు గ్రామాల్లోని చర్చి (ప్రకాశించు దీపం)లో ఫెలోషిప్‌ చర్చ్‌ ఆఫ్‌ గాడ్‌ సంస్థ చైర్మన్‌, పాస్టర్‌ కుందవరం బాబి ఇమ్మానుయేల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి.

ఇందుకూరుపేట : కనుమ పండుగ సందర్భంగా కొత్తూరు గ్రామంలో ఆదివారం పారువేట ఘనంగా జరిగింది. ఇందుకూరుపేట నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీమల్లేశ్వరస్వామి, శ్రీవీరభద్రస్వామి బయలుదేరి కొత్తూరు చేరుకున్నారు.  జడ్పీ హైస్కూల్‌లో  కొత్తూరు శ్రీవీరాంజనేయస్వామి, గంగమ్మ శివాలయం మల్లేశ్వరుడు, రాములవారు, శివుడు  అంతా కలిసి కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో భక్తులు దర్శన చేసుకున్నారు.

ఘనంగా సక్రాంతి, కనుమ

కోవూరు : శ్రీ ప్రసన్న చెన్నకేశవ ఆలయం ఎదుట  టెంకాయలు కొడ్తున్న భక్తులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.