‘చెర’వులు

ABN , First Publish Date - 2022-08-13T05:50:50+05:30 IST

పల్లెల్లో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఎవరు ప్రశ్నిస్తారనే ధైర్యమే ఏమో.. కొందరు యథేచ్ఛగా ఆక్రమణ పర్వం కొనసాగిస్తున్నారు.

‘చెర’వులు

  కబ్జా కోరల్లో చెరువులు

  రూపురేఖల్ని కోల్పోతున్న వైనం

  సాగు,తాగునీటికి ఇబ్బందులు

   ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

  ఇబ్బందుల్లో ఆయకట్టుదారులు 

(సాలూరు)

పల్లెల్లో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఎవరు ప్రశ్నిస్తారనే ధైర్యమే ఏమో..  కొందరు  యథేచ్ఛగా ఆక్రమణ పర్వం కొనసాగిస్తున్నారు. వాటి రూపురేఖలను మార్చి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా సాలూరు మండలంలోని ఖరాసువలస పంచాయతీ, దత్తివలస రెవెన్యూ పరిధిలో కొన్ని చెరువులు ఆక్రమణలతో రోజురోజుకూ కుచించుకుపోతున్నాయ్‌. మరికొన్ని  పూర్తిగా కనిపించడం లేదు. దీంతో ఆయకట్టుదారులకు అవస్థలు తప్పడం లేదు. దీనిపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు కూడా స్పందించకపోవడంతో ఆక్రమణదారులు మరింతగా రెచ్చిపోతున్నారు.  అమృత్‌ సరోవర్‌ కింద ఓ వైపు జిల్లావ్యాప్తంగా చెరువులను సుందరీకరిస్తుంటే.. మరోవైపు ఇలా కబ్జాపర్వం కొనసాగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. 

ఇదీ పరిస్థితి.. 

మండలంలో ఖరాసువలస పంచాయతీ, దత్తివలస రెవెన్యూ పరిధిలో  ప్రభుత్వ చెరువును దర్జాగా కొందరు కబ్జా చేస్తున్నా..  పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా  ఏర్పాటు చేయడం లేదు. సాగు,తాగునీటికి ప్రధాన వనరుగా ఉండే చెరువులు ఆక్రమణలతో మాయమవుతున్నా.. అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.  వాస్తవంగా దత్తివలస రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 97-1లో ఉన్న దేవరబంద, పోతలమ్మ చెరువును ఓ రైతు ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నాడు. సర్వే నెంబర్‌ 99-1 గెడ్డబంద, సర్వే నెంబర్‌ 102-2లో ఉన్న చిన్నబంద, 113-6లో ఉన్న కనపలబంద, 114-3లో ఉన్న పనుకులబంద, సర్వేనెంబర్‌ 160-5లో ఉన్న వంతల బంద, సర్వే నెంబర్‌ 173-3లో ఉన్న పోలీస్‌బంద, 191-1లో ఉన్న ఎర్రబందతో పాటు కొన్ని చెరువులు వాటి రూపురేఖల్ని కోల్పోయాయి. మరికొన్ని మాయమయ్యాయి. సర్వేనెంబర్‌ 193లో సుమారు 8.58 ఎకరాలు ఉండాల్సిన జామ చెరువు కూడా సగానికి సగం ఆక్రమణకు గురైనట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు.  చిన్న, సన్నకారు రైతులు ఏటా వరుణడిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దత్తివలస రెవెన్యూ పరిధిలో చెరువుల కబ్జాపై  ఖరాసువలస  సర్పంచ్‌తో పాటు గిరిజనులు అనేకసార్లు కలెక్టరేట్‌ స్పందనలో ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకూ చర్యలు శూన్యం. రెవెన్యూ అధికారులు విచారణ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతవాసులు చెరుతున్నారు. 

   చర్యలు తీసుకుంటాం  

 ఖరాసువలస పంచాయతీ పరిధిలో ఉన్న దత్తివలస రెవెన్యూలో చెరువులు కబ్జాకు గురవుతున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయికి రెవెన్యూ అధికారులను పంపించి విచారణ చేయిస్తాం. కబ్జాదారులపై  చర్యలు తీసుకుంటాం.

రామస్వామి,తహసీల్దార్‌, సాలూరు


Updated Date - 2022-08-13T05:50:50+05:30 IST