‘చెర’వులు

ABN , First Publish Date - 2022-07-16T05:08:47+05:30 IST

‘సాగునీటి వనరులు, భూగర్భ జలాలను పరిరక్షించుకోవాలి. దీనికోసం చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలి. చెరువు స్థలాల్లో నిర్మాణాలు జరగకూడదు’.. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇవి. కానీ క్షేత్రస్థాయిలో ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. కొన్నిచోట్ల నోటీసులతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో సాగునీటి చెరువులు అత్యధికంగా ఆక్రమణ చెరలో ఉన్నాయి.

‘చెర’వులు
హరిపురం : అప్పయ్య చెరువు మట్టితో కప్పేసి.. నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు

రికార్డుల్లో భద్రం.. క్షేత్రస్థాయిలో కనిపించని వైనం
ఉమ్మడి జిల్లాలో 8,213 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు
ఎక్కడికక్కడ పంటల సాగు.. అక్రమ నిర్మాణాల జోరు
కనీస చర్యలు తీసుకోని జిల్లా అధికారులు
ఇలాగైతే భూగర్భజలాలకు ముప్పేనంటున్న నిపుణులు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

‘సాగునీటి వనరులు, భూగర్భ జలాలను పరిరక్షించుకోవాలి. దీనికోసం చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలి. చెరువు స్థలాల్లో నిర్మాణాలు జరగకూడదు’.. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇవి. కానీ క్షేత్రస్థాయిలో ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. కొన్నిచోట్ల నోటీసులతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో సాగునీటి చెరువులు అత్యధికంగా ఆక్రమణ చెరలో ఉన్నాయి. కొంతమంది చెరువు భూములను తమ పొలాల్లో కలిపేసుకున్నారు. మరికొందరు దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని చెరువుల వివరాలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాటి స్వరూపమే కనిపించదు. ఆక్రమణల వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీరందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే గ్రామాల్లో భూగర్భజలాలు క్రమేపీ తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

8,213 సాగునీటి చెరువులు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8,213 సాగునీటి చెరువులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆమదాలవలసలో 120, భామినిలో 189, బూర్జలో 298, ఎచ్చెర్లలో 199, జి.సిగడాంలో 321, గారలో 91, హిరమండలంలో 156, ఇచ్ఛాపురంలో 163, జలుమూరులో 329, కంచిలిలో 242, కవిటిలో 111, కోటబొమ్మాళిలో 321, కొత్తూరులో 385, లావేరులో 340, ఎల్‌ఎన్‌.పేటలో 170, మందసలో 176, మెళియాపుట్టిలో 287, నందిగాంలో 401, నరసన్నపేటలో 93, పాలకొండలో 42, పలాసలో 190, పాతపట్టణంలో 307, పోలాకిలో 154, పొందూరులో 131, రాజాంలో 298, రణస్థలంలో 348, రేగిడిలో 484, సంతబొమ్మాళిలో 189, సంతకవిటిలో 282, సారవకోటలో 347, సరబుజ్జిలిలో 92, సీతంపేటలో 186, సోంపేటలో 70, శ్రీకాకుళంలో 136, టెక్కలిలో 216, వజ్రపుకొత్తూరులో 157, వంగరలో 208, వీరఘట్టంలో 103 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో అత్యధిక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. గట్టును కబ్జా చేయడం.. కొంతమంది తమ పొలంలోకి చెరువు స్థలాన్ని కలిపేస్తున్నారు. దీంతో చెరువులు కుచించుకుపోయాయి. సాగునీటి వనరులను, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు చెరువులు ఆక్రమణకు గురికాకూడదని, నిర్మాణాలు కూడా చెరువుల్లో జరగకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆక్రమణల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 13,521.55 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌(ఎంసీఎఫ్‌టీ) నీరు చేరితే జిల్లాలో చెరువులు పూర్తిగా నిండినట్లే. ప్రస్తుతం.. చెరువుల్లో గురువారం సాయంత్రానికి 10,137.27 ఎంసీఎఫ్‌టీ మేర నీరు చేరింది. 5,793 చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. 25శాతం నీరుచేరిన చెరువులు 404 ఉన్నాయి. వర్షాలు కురుస్తున్నా.. చుక్కనీరు కూడా లేని చెరువులు జిల్లావ్యాప్తంగా 963 ఉన్నాయి.  

ఇవిగో ఆక్రమణలు
- మందస మండలం బాలిగాం గ్రామ పరిధిలోని పాతజాతీయ రహదారి ప్రక్కనే ఉన్న అప్పయ్య చెరువు పూర్తిగా అనవాళ్లు కోల్పోయింది. సర్వే నెం102లో 2.13 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువుకు 45 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు మధ్య నుంచి గతంలో పాత జాతీయరహదారి వేయటంతో సుమారు 0.50 ఎకరాలు రోడ్డులో కలిసిపోయింది. ఉన్న చెరువు విస్తీర్ణంలో నేడు అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అధికారపార్టీ నేతల అండ ఉండడంతో అక్రమార్కులపై చర్యలకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు.  
- గార మండలం అంపోలు చెరువులో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. ఇది చెరువుగర్భ ప్రాంతమని, ఇందులో నిర్మాణాలు చేపట్టకూడదని కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు నడుస్తోంది. రెవెన్యూ అధికారులు కూడా అది చెరువుగర్భమే అని చెబుతున్నారు.
- జలుమూరు మండలంలో 329 చెరువులున్నాయి. ఇక్కడ మునికోటి చెరువు విస్తీర్ణం 40 ఎకరాలు. ఇందులో 8 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. తామరచెరువులో 4 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.
- ఆమదాలవలస మండలం కొర్లకోటలో మంగళవాని చెరువులో 3 ఎకరాలు ఆక్రమణకు గురైందని అధికారులే వెల్లడిస్తున్నారు. మెయిన్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న కిల్లివానిచెరువు ఆక్రమణ చెరలోకి వెళ్లిపోయింది. బొడ్డేపల్లిపేట వద్ద రాళ్లచెరువు పూజారిపేట వరకు విస్తరించి ఉంది. దీనికి సమీపంలో పట్టాలు ఇవ్వడంతో దాన్ని ఆనుకుని మరో ఐదెకరాలు ఆక్రమణకు గురైంది.
- కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురంలో 55ఎకరాల విస్తీర్ణం గల పెద్దచెరువు.. ప్రస్తుతం 36 ఎకరాలు మాత్రమే ఉంది. మిగిలిన ప్రాంతం ఆక్రమణకు గురైంది. ఇక తాటికరచెరువు, మహంకాళి బంద, కారిచెరువు పూర్తిగా కనుమరుగయ్యాయి.
- సోంపేటలో గొల్లవానిచెరువు 22 ఎకరాలు ఉండాలి. ప్రస్తుతం పది ఎకరాలు కూడా లేదు. ఇక్కడే రాంసాగర్‌ అనే చెరువు ఉంది. ఇందులో నిర్మాణాలు జరుగుతున్నాయి.
- వీకేపేట, దాసన్నపేట సమీపంలో ఎర్రచెరువు ఉంది. ఈ చెరువుకు వెళ్లేందుకు మార్గం కూడా లేకుండా ఆక్రమణలకు గురైంది. ఇక్కడ శరవేగంగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి.
- పోలాకి మండలంలో ఊడిపాడు కారేడు చెరువు 10 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. 5 ఎకరాలు మాత్రమే మిగిలింది.
- రణస్థలం మండలం కోటపాలెంలో విజయరామసాగరం చెరువు విస్తీర్ణం 147 ఎకరాలు. ఇందులో 50 ఎకరాలపైనే ఆక్రమణకు గురైంది.
- మెళియాపుట్టి మండలంలో 150 చెరువులు ఆక్రమణకు గురైనట్లు అధికారులే ధ్రువీకరిస్తున్నారు. జంతారుకారి చెరువును ఆక్రమించుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఎల్‌ఎన్‌ పేట మండలంలో 10 ఎకరాల విస్తీర్ణం ఉన్న డోలవానిచెరువు ఇప్పుడు ఎకరా కూడా లేదు. చెరువు గర్భంలో నిర్మాణాలు చేపడుతున్నారు.
- పొందూరు మండలంలో సుమారు 106 సాగునీటి చెరువులు ఉండగా.. దాదాపు అన్నిచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. పొందూరులో 40 ఎకరాలు విస్తరించి ఉండే సీతమ్మ చెరువు.. ఆక్రమణలతో ప్రస్తుతం 25 ఎకరాలకు కుచించుకుపోయింది. పొందూరులోని పెదచెరువు, గోరింట, బాపిరాజుపేట తదితర గ్రామాల్లో చెరువుల ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదులందాయి.
- వజ్రపుకొత్తూరు మండలంలో 43 చెరువులు ఉన్నాయి. సీతారాంపురం రైతులకు ఎంతో ఆధారమైన ఎర్రచెరువు 40 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. ఆరు ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. అలాగే నగరంపల్లి పంచాయతీ పరిధి గేదెలాం చెరువు ఆక్రమణకు గురైంది.
- సరుబుజ్జిలి మండలంలో సిమ్మకోనేరు చెరువు గట్టు, కటకమ్మయ్యపేటలో జక్కరబంద చెరువు ఆక్రమణలకు గురయ్యాయి. జక్కరబంద చెరువులో ఆక్రమిత భూముల్లో పంటలు కూడా సాగు చేస్తున్నారు. సిమ్మకోనేరు గట్టుపై నిర్మాణాలు జరుగుతున్నాయి.  

చర్యలు తీసుకుంటాం
జిల్లాలోని సాగునీటి చెరువుల్లో ఎట్టిపరిస్థితుల్లో   ఇతర నిర్మాణాలు చేపట్టరాదు. ఆక్రమణలు తొలగించేందుకు మండలాల వారీగా ఆదేశాలు జారీచేస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. సాగునీటి వనరులను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంది.
- జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత
 

Updated Date - 2022-07-16T05:08:47+05:30 IST