పుదుచ్చేరిలో చిచ్చుకు జగన్‌ ఇంధనం!

ABN , First Publish Date - 2021-03-03T07:10:53+05:30 IST

‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అంటే భారత్‌లో కాంగ్రెస్‌ ఎక్కడా ఉండొద్దు. చివరికి కేంద్ర పాలిత ప్రాంతం, అతిచిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో కూడా! ఈ లక్ష్యంలో భాగంగానే కాంగ్రె్‌స-డీఎంకే సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారా!? బీజేపీ తన

పుదుచ్చేరిలో చిచ్చుకు జగన్‌ ఇంధనం!

కాంగ్రెస్‌ సర్కారు పతనం వెనుక ఏపీ సీఎం.. ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాల బలమైన అనుమానం

బీజేపీ పెద్దల అభీష్టం మేరకు పావులు.. యానాం నేత మల్లాడి ద్వారా వ్యూహాలు?

జగన్‌ను కలిసిన వెంటనే ఎమ్మెల్యే పదవికి.. మల్లాడి కృష్ణారావు రాజీనామా

ఆపై వరుసగా మరికొందరి రాజీనామాలు.. 22న కుప్పకూలిన నారాయణస్వామి సర్కారు

జగన్‌తో మల్లాడికి సన్నిహిత సంబంధాలు


న్యూఢిల్లీ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అంటే భారత్‌లో కాంగ్రెస్‌ ఎక్కడా ఉండొద్దు. చివరికి కేంద్ర పాలిత ప్రాంతం, అతిచిన్న రాష్ట్రమైన  పుదుచ్చేరిలో కూడా! ఈ లక్ష్యంలో భాగంగానే కాంగ్రె్‌స-డీఎంకే సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారా!? బీజేపీ తన లక్ష్యం సాధించేందుకు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కూడా సహకరించారా!? ఇది ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చ! కేంద్రంలో బీజేపీ సర్కారుకు అన్నిరకాలు గా సహకరిస్తున్న జగన్‌.. మరో రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చేందుకూ సహకరించారని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తన వీరాభిమాని, పుదుచ్చేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు(యానాం)తో రాజీనామా చేయించడంతోపాటు మరికొందరి రాజీనామాలకు ‘వ్యూహాత్మక అస్త్రాలను’ జగన్‌ సమకూర్చినట్లు కాంగ్రెస్‌ నేతలు అనుమాని స్తున్నారు. బీజేపీ పెద్దల నిర్దేశానుసారం జగన్‌ పావులు కదిపారని, పుదుచ్చేరి సర్కార్‌ను మల్లాడి కృష్ణారావు ద్వారా కూల్చేశారని చెబుతున్నారు. 


మల్లాడి కృష్ణారావు జనవరి 13న మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ.. సాంకేతిక కారణాల వల్ల అది ఆమోదం పొందలేదు. ఇక ఫిబ్రవరి 15న ఆయన ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఆ భేటీ ముగిసిన 10 నిమిషాల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాతే పుదుచ్చేరిలో నారాయణస్వామి సర్కారు పతనానికి పునాదులు పడ్డాయి. ఒకరి తర్వాత ఒకరుగా మరికొందరు ఎమ్మెల్యేలూ రాజీనామా చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు (మరో ముగ్గురు నామినేటెడ్‌) ఉన్న పుదుచ్చేరిలో నెల రోజుల్లోనే సంకీర్ణ సర్కారుకు చెందిన 9మంది రాజీనామా చేశారు. వీరిలో ఒకరు డీఎంకే సభ్యుడు. మిగిలిన వారంతా కాంగ్రె్‌స వాళ్లే! ఈ పరిణామాలతో పుదుచ్చేరిలో నారాయణస్వామి సర్కారు మైనారిటీలో పడింది. బల నిరూపణ చేసుకోలేక గత నెల 22వ తేదీన కుప్పకూలింది. అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 4 రోజులకే ఎన్నికల షెడ్యూలు వెలువడింది.


జగన్‌కు సన్నిహితుడు.. 

యానాం... పుదుచ్చేరిలో భాగం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉంటుంది. యానాం నుంచి మల్లాడి కృష్ణారావు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పుదుచ్చేరి శాసన సభ్యుడైనప్పటికీ జగన్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తర్వాత పలుమార్లు ఏపీకి వచ్చి జగన్‌ను కలుసుకున్నారు. తాను జగన్‌కు వీరాభిమానినని, ఆయన  అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రశంసిస్తుంటారు. జగన్‌ తమిళనాడులో పార్టీ పెడితే కాంగ్రె్‌సకు రాజీనామా చేసి, అందులో చేరతానని కూడా ప్రకటించారు. జగన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు. 


మరోవైపు తమిళనాడులో ఎంత ప్రయత్నించినా అదృష్టం కలిసి రాకపోవడంతో పుదుచ్చేరిలోనైనా ‘పవర్‌’ చూపించాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే ఎమ్మెల్యేలను ఆకర్షించే వ్యూహం రచించింది. ఇందుకు జగన్‌ సహకారం తీసుకున్నట్లు కాంగ్రెస్‌ అనుమానిస్తోంది. జగన్‌ ప్రోద్బలంతోనే మల్లాడి పుదుచ్చేరిలో పావులు కదిపారని భావిస్తోంది. తొలుత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జగన్‌ను కలిసొచ్చాక ఎమ్మెల్యే పదవికీ మల్లాడి రాజీనామా చేశారు. అదే బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.

Updated Date - 2021-03-03T07:10:53+05:30 IST