కొత్తపల్లిలో మట్టి దోపిడీ

ABN , First Publish Date - 2022-05-31T03:19:10+05:30 IST

అధికార వైసీపీ నేతలు చెరువులు, వాగులు, వంకల్లో మట్టిని కూడా వదలడం లేదు. రేయింబవళ్లు యథేచ్ఛగా చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

కొత్తపల్లిలో మట్టి దోపిడీ
చెరువు కలుజు సమీపంలో తవ్విన మట్టి

అధికారపార్టీ నేతల దందా

కావలి రూరల్‌, మే 30: అధికార వైసీపీ నేతలు చెరువులు, వాగులు, వంకల్లో మట్టిని కూడా వదలడం లేదు. రేయింబవళ్లు యథేచ్ఛగా చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కావలి మండలంలోని కొత్తపల్లి చెరువులో, కలుజు సమీపంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు మినహా మరెవరైనా తమ అవసరాల నిమిత్తం మట్టిని తరలిస్తే వారే అధికారులకు  ఫిర్యాదు చేసి మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. 3 నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరుడు ఇంటి నిర్మాణ అవసరాల నిమిత్తం గ్రామానికి సమీపంలోని వరవలో నుంచి 2 ట్రిప్పులు తోలుకోగా అధికారపార్టీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేసి రూ.10,000 అపరాధ రుసుం వసూలు చేయించారు. ఇప్పుడు అదే నేతలే అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అలుగు సమీపంలో మట్టిని రెండు రోజులుగా ఎక్స్‌కవేటర్‌తో తవ్వి సుమారు 300 ట్రక్కుల మేరకు మట్టిని తరలించారన్న ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అనుమతులు లేవు

చెరువుల్లో మట్టి తరలింపునకు ఎవ్వరికి అనుమతులు ఇవ్వలేదు. కొత్తపల్లి చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న విషయం సోమవారం మా దృష్టికి వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించాం. మట్టి తరలింపుపై విచారిస్తున్నాం.. 

 - జంపాని కిరణ్‌,  ఇరిగేషన్‌ ఏఈ

Updated Date - 2022-05-31T03:19:10+05:30 IST