ఆవ భూములకోసం.. సరికొత్త ఎత్తుగడ!

ABN , First Publish Date - 2020-05-27T11:18:55+05:30 IST

ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం..

ఆవ భూములకోసం.. సరికొత్త ఎత్తుగడ!

ఆవలో ‘చెరువు’

అవినీతి ఊబి నుంచి బయటపడే ఎత్తుగడ

ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలివ్వడానికే మొగ్గు

చెరువు తవ్వి ముంపు నీరు పంపే వ్యూహం

జేఎన్టీయూకే అధ్యయనం పేరుకేనా..

రూ.100 కోట్ల పైనే లాగేశారంటూ ప్రచారం 

రూ. 50 కోట్లతో  మెరక చేయడానికి ఒప్పందం

ప్రస్తుతం కోర్టు గొడవతో ఆగిన మెరక పనులు 


రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ముంపు ఉంటుందనే భూముల్లో ఓ పెద్ద చెరువు తవ్వి, అక్కడ నిర్మించే కాలనీ నీరు, మిగతా గ్రామాల నుంచి వచ్చే నీటిని అందులోకి మళ్లిస్తే, పరిసర ప్రాంత ప్రజలెవరూ నోరెత్తరనే యోచనతో కొందరు ఓ ఎత్తుగడ వేసినట్టు సమాచారం. ప్రస్తుతం జేఎన్టీయూకి చెందిన ఐదుగురు సభ్యులతో ఇక్కడ అధ్యయనం చేయిస్తున్నారు. ఇదంతా ఉత్తుత్తి అధ్యయనంగానే తేలిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇళ్ల స్థలాలకు అనుకూలంకాని ఆవ భూములను సేకరించడంతోపాటు, ఎకరానికి రూ.45 లక్షలు ఇవ్వడంలో భారీఎత్తున కుంభకోణం జరిగినట్టు విమర్శలు రావడం, విషయం కోర్టుకు వెళ్లడం తెలిసిందే.


ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల జోక్యంతో ఎంపిక చేసిన ఈ భూముల వ్యవహారంలో అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఇక్కడ మొత్తం 540 ఎకరాలు సేకరించారు. అందులో ఇప్పటికే 380 మంది రైతులకు ఎకరానికి రూ.45 లక్షల వంతున చెల్లించారు. వాస్తవానికి రైతులకు అక్కడ భూమిని బట్టి ఎకరాకు రూ.20 నుంచి 25 లక్షల మాత్రమే అందినట్టు సమాచారం. మిగతా సొమ్ము ఎవరికి చేతుల్లోకి వెళ్లిందనేది అంతుపట్టకుండా ఉంది. ఈ వ్యవహారంలో నలుగురు బ్రోకర్లు, అందులో కొందరు వైసీపీలో చురుగ్గా తిరిగే కార్యకర్తలు కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ముందుగానే రైతుల వద్ద తక్కువ ధరకు  భూములు కొనుగోలు చేసినట్టు పత్రాలు కూడా రాయించుకుని,  తర్వాత రైతుల బ్యాంక్‌ అక్కౌంట్లలో డబ్బు వేయడానికి, తిరిగి వీరికి మిగిలిన డబ్బు ఇవ్వడానికి ఇక్కడ ఒప్పందం కుదిరిందనే ప్రచారం కూడా జరుగుతోంది.


కానీ పంపకాలు కుదరకే వ్యవహారం బయటకు వచ్చినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వంద కోట్ల రూపాయలపైనే చేతులు మారినట్టు పెద్దఎత్తున ప్రచారంలో ఉంది. మరోవైపు వైసీపీ నేత ఒకరు ఈ పల్లపు భూములను మెరక చేయడానికి రూ.50 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భూముల విషయంలో ఒకరు కోర్టుకు వెళ్లడం, కోర్టు పూర్తి వివరాలు ఇవ్వమని ఆదేశించడంతో మెరక చేసే పని ప్రస్తుతం ఆగిపోయింది. ఆవ భూముల విషయంలో చిక్కుల్లో పడిన ప్రభుత్వం, ఇటు అధికారులు దీని నుంచి బయటపడే మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. బూరుగుపూడి ప్రాంతంలో ప్రస్తుతం సేకరించిన భూముల్లోనే రోడ్డుకు సమీపంలో ఉన్న భూముల్లో పట్టాలు ఇచ్చి, ముంపు ప్రాంతమైన సుమారు వంద ఎకరాల్లో పెద్ద చెరువు తవ్వి, చుట్టూ వాకింగ్‌ట్రాక్‌, పార్కు అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


ముంపు నీరు ఈ చెరువులోకి వెళుతుందనే అభిప్రాయం కలిగించడం ద్వారా మార్గం సుగమం చేసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ భూముల వ్యవహారంతో వైసీపీలో వర్గపోరు పెరిగిపోయింది. ఇద్దరు నాయకుల మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. ఈ ఇద్దరు పార్టీ అధిష్ఠానం ముందు వారి వాదనలు వినిపించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముఖ్యంగా రాజమహేంద్రవరం, రూరల్‌, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో  వర్గపోరు మరింత తీవ్రమైంది. 

Updated Date - 2020-05-27T11:18:55+05:30 IST