Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అమృతోత్సవ వేళ పాలిస్టర్ జెండాలు

twitter-iconwatsapp-iconfb-icon
అమృతోత్సవ వేళ  పాలిస్టర్ జెండాలు

వైవిధ్య సంస్కృతి కల్గిన భారతవనికి త్రివర్ణ పతాకం ఒక ప్రేరణ. భారతీయ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. యావత్తు దేశాన్ని ఒకటిగా కలిపిన పతాకం అది. భారతీయ జీవన విధానంలో ఖద్దరు అంటే ఒక వస్త్ర ఉత్పత్తి మాత్రమే కాదు, అది ఒక స్వాధికారిక ప్రకటన, వలస పాలనకు వ్యతిరేకంగా అసంఖ్యాక భారతగణం గొంతెత్తిన గళం. త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ రాజ్యాంగ సభ తీర్మానం చేసిన సందర్భంగా మహాత్మాగాంధీ దీన్ని కేవలం ఖద్దరులోనే తయారుచేయాలని అభిలషించారు. పుణే జైలులో చరఖాతో ఉన్న జాతిపిత ఫోటో ఇప్పటికి సుప్రసిద్ధం. అమెరికన్ ఫోటో జర్నలిస్టు మార్గరేట్ బుర్క్ వైట్ తీసిన ఫోటో ఇది. త్రివర్ణ పతాకానికీ, ఖద్దరుకు అవినాభావ సంబంధం, చారిత్రక నేపథ్యం ఉంది.


స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశంలో ఖాదీ ఉద్యమం ఊపందుకోకముందే తెలుగునేల చేనేతకు నెలువు. శ్రీకాకుళం జిల్లా పొందూరు నుండి ప్రకాశం జిల్లా చీరాల వరకు ఖద్దరు కళకళలాడింది. 1920–30 మధ్య మహాత్మగాంధీ తెలుగునాట విస్తృతంగా పర్యటించినప్పుడు చేనేత రంగంలో తెలుగువారి కళాత్మకతను చూసి ముచ్చటపడ్డారు. చీరాల–పేరాల ఉద్యమం మొదలు విజయవాడ కాంగ్రెస్ సమావేశం వరకు ప్రతి చోటా ఖద్దరు ప్రధాన ఆకర్షణ. పింగళి వెంకయ్య రూపొందించిన స్వరాజ్య పతాకం 1921లో విజయవాడలో మహాత్ముడి నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించుకొని, భారతీయ సంపూర్ణ స్వరాజ్య పోరాటంలో ప్రధాన ఆకర్షణగా నిలిచి, స్వాతంత్ర్యానంతరం స్వల్ప మార్పులతో తొలి రాజ్యంగ సభ ద్వారా జాతీయ పతాకంగా అవతరించింది.


స్వాతంత్ర్య సమరంలో జాతీయ భావోద్వేగంతో ప్రతి దేశ భక్తుడి చేతిలో ఎగిరిన త్రివర్ణం దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం అనంతరం రాష్ట్రపతి భవన్‌గా మారిన వైస్రాయి హౌజ్‌లోని దర్బార్ హాల్‌లో అధికారహోదాకు చిహ్నంగా మారిపోయింది. కేవలం ప్రభుత్వ కార్యాలయాలలో అధికారిక లాంఛనాలు, మర్యాదలు, మన్ననలకు పరిమితం కాకుండ నిండు భారతంలో అందరు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకోవాలన్న దిశగా పార్లమెంటు సభ్యుడు నవీన్ జిందాల్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ ద్వారా చేసిన ప్రయత్నం అభినందనీయం. దీనికి కొనసాగింపుగా, ఒక్క ప్రభుత్వ లాంఛనాలకే పరిమితం కాకుండ సామాన్యులు కూడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే విధంగా నిబంధనలను సడలిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు తీసుకోన్న నిర్ణయం ప్రశంసనీయం. కానీ, ఈ సందర్భంగా జాతీయ జెండాకూ ఖద్దరుకూ ఉన్న బంధానికి స్వస్తి పలుకుతూ వాటి తయారీకి పాలిస్టర్‌ను అనుమతించడం బాధకరం. ఖరీదయిన ఖద్దరుకు బదులుగా పాలిస్టర్‌ను అనుమతించడం ద్వారా ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం (హర్ ఘర్ తిరంగా) రెపరెపలాడె లక్ష్యం నెరవేరుతుందన్న వాదన సరికాదు. గాంధీ కాలం నుండి నేటి వరకు కూడా ఖద్దరు ఖరీదైనదే. సామాన్య పౌరులకు కూడ అది అందుబాటులోకి వచ్చేవిధంగా దీని ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఖద్దరు తయారీ రంగాన్ని ఆదుకొన్నవారవుతారు. విదేశాలలోని భారతీయ ఎంబసీల నుండి మొదలు గ్రామపంచాయితీ కార్యాలయాల వరకు ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు జాతీయ జెండాలను సరఫరా చేసే కర్ణాటకలోని బింగరి గ్రామం చేతివృత్తి పరిశ్రమ తరహాలో జాతీయ పతాక ఉత్పత్తిని దేశ వ్యాప్తంగా విస్తరించవచ్చు. అలా అంతరిస్తున్న చేనేతను ప్రోత్సహించడానికి బదులుగా పాలిస్టర్ జెండాల వాడకాన్ని అనుమతించడం ఆమోదయోగ్యంగా లేదు. పాలిస్టర్ తయారీకి అవసరమయ్యే ముడిసరుకు అత్యధికంగా దిగుమతయ్యేది చైనా నుండే. అందువల్ల, పాలిస్టర్ వినియోగం అంటే పరోక్షంగా చైనాను ప్రోత్సహించడమే. ధర, నాణ్యత కారణాన ఇప్పటికే మన మువ్వెన్నెల జెండాల అమ్మకాలపై మనకంటే చైనా ఉత్పత్తిదారుల అధిపత్యమే ఉంది. బిజెపి అధికారంలోకి రావడానికి దోహదపడిన అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సందర్భంగా ఢిల్లీ నగర వీధులలో ప్రదర్శనకారుల చేతుల్లో ఉన్న జెండాలన్నీ చైనా తయారీయే. దేశవిదేశాలలో క్రికెట్ పోటీల సందర్భంగా అభిమానులు ప్రదర్శించే త్రివర్ణ పతాకాలన్నీ చైనా నుండి దిగుమతి చేసుకొన్నవే. చివరకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యోగా దినోత్సవం సందర్భంగా నేలపై పరిచె చాపలు కూడా చైనావే.


అణువణువునా భారతీయతకు కంకణం కట్టుకొన్నట్లుగా చెప్పుకొనే నరేంద్ర మోదీ సర్కారు స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేళ ఖద్దరు ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఘనమైన గతాన్ని తలుచుకోవడంతో పాటు గ్రామీణ చేనేత రంగంలో ఒక సామూహిక ఉపాధి కల్పనకు బాటలు పడి, ఆ రంగం జవజీవాలు పుంజుకోవడానికి ఆవకాశం ఏర్పడేది. మేక్ ఇన్ ఇండియా ఇప్పటికీ సగటు భారతీయుడి అనుభవంలోకి రాలేదు. ఆత్మ నిర్భర్ అర్థం తెలియని వారు అసంఖ్యాకులు. ఖద్దరును ప్రోత్సహించడం, చేనేతకు చేయూత ఇవ్వడం ద్వారా మోదీ సర్కారు వాటికి సార్ధకత చేకూర్చాలి, ఆ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నిలబెట్టాలి. 

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.