ఊపిరితీస్తోంది...

ABN , First Publish Date - 2021-08-05T04:51:41+05:30 IST

గుంటూరు నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుందా.. ప్రమాదకరంగా కాలుష్య శాతాలు నమోదవుతున్నాయా.. పరిస్థితి ఇలానే ఉంటే మరో ఢిల్లీగా గుంటూరు మారనున్నదా.. అంటే ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నా యి.

ఊపిరితీస్తోంది...

కాలుష్య కోరల్లో గుంటూరు

అత్యధికంగా వాహనాల వల్లే కాలుష్యం 

ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

ధ్రువీకరించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి

2024 నాటికి సాధారణ స్థితికి తేచ్చేలా కార్యాచరణ


వాయు కాలుష్యం.. గుంటూరులో ప్రమాదకర స్థాయిలో ఉంది. వాయు కాలుష్య కోరల్లో నగరవాసులు చిక్కుకుంటున్నారు. జిల్లా కేంద్రం గా.. వ్యాపార, వాణిజ్య, విద్యా కేంద్రంగా ఉన్న గుంటూరులో  అత్యంత ఎక్కువుగా గాలి కాలుష్య మవుతోంది.  సాఽధారణం కంటే రెండు రెట్లు అధికంగా గుంటూరులో కాలుష్య స్థాయిలు ఉన్నా యి. వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఎక్కువగా ఊపిరి తిత్తుల సమస్యతో అల్లాడుతున్నారని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు  నగ ర సమీపంలో భారీ పరిశ్రమలు ఏమీ లేవు. అయినా వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో గుంటూరు కూడా ఉందంటే  పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 



64-70  ఎమ్‌జీక్యూక్యూ కాలుష్యం

సాధారణంగా గాలిలో 100 మైక్రోగ్రామ్స్‌ క్యూబిక్‌ క్యూడ్‌ (ఎమ్‌జీక్యూక్యూ) ఒక లెక్కగా తీసుకుని అందులో కాలుష్య శాతాన్ని లెక్కిస్తారు. కాలుష్య శాతం 60 ఎమ్‌జీక్యూక్యూల కంటే తక్కువుగా నమోదైతే కాలుష్యం సాధారణ స్థాయిలో ఉన్నట్టు లెక్క. కానీ గుంటూరు నగరంలో మాత్రం ఏడాదికి సరాసరి 64-70  ఎమ్‌జీక్యూక్యూలుగా నమోదవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంతణ్ర మండలి హెచ్చరిస్తుంది. 


గుంటూరు(తూర్పు), ఆగస్టు 4: గుంటూరు నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుందా.. ప్రమాదకరంగా కాలుష్య శాతాలు నమోదవుతున్నాయా.. పరిస్థితి ఇలానే ఉంటే మరో ఢిల్లీగా గుంటూరు మారనున్నదా.. అంటే ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నా యి. ఈ భయాలను బలపరుస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన నివేదికలో  దేశ వ్యాప్తంగా కాలుష్యం అధికంగా ఉన్న 132 నగరాల్లో గుంటూరు ఒకటని ప్రకటించింది. గుంటూరు నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలో ఉందని తేల్చింది. ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టక పో తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని కేంద్రం తన నివేదికలో హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో గాలిలో  కాలుష్యశాతం 89 ఎమ్‌జీక్యూక్యూగా నమోదైంది.  పరిస్థి తి ఇలానే ఉంటే గుంటూరు కూడా ఆ స్థాయికి ఒకటి రెండేళ్లలో చేరుకునే ప్రమాదం ఉందని కూడా కేంద్రం తన నివేదికలో పేర్కొంది. అలాగే సాధారణ స్థాయి కంటే గుంటూరులో రెండు రెట్లు అధికంగా కాలు ష్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తన వెబ్‌ సైట్‌లో పేర్కొ న్నది. ఈ పరిణామాలు చూస్తుంటే  గుంటూరులో పరిస్థి తి మరింత  ప్రమాదకరంగా మీరే అవకాశాలున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.


కాలం చెల్లిన వాహనాలతోనే..

కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి రావడం వల్లే నగ రంలో ప్రమాదకర స్థాయిలో కాలుష్య శాతం నమో దవుతుందని అధికారులు చెబుతున్నారు. నింబంధనల ప్రకారం  15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకూ డదు. నగరంలో ఉన్న దాదాపు 10 లక్షల వాహనాల్లో కాలం చెల్లిన వాహనాల సంఖ్య 15 శాతంపైగా ఉంటా యని లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో కూడా కాలం చెల్లిన వాటి సంఖ్య ఎక్కువగా ఉంది. కాలం చెల్లిన వాహనాలపై నియంత్రణ లేకపోవడం కూడా కాలుష్యం పెరగడానికి ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. కాలం చెల్లిన ఒక బస్సు నుంచి వచ్చే పొగ 100 ఆటోల నుంచే వచ్చే పొగతో సమానం. అంటే అటువంటి బస్సుల వల్ల ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి. ఇక గుంటూరు నగరంలో సంచరించే వాహనాల్లో అత్యధికం డీజిల్‌ వాహనాలే. ఈ డీజిల్‌ కల్తీ కారణంగా కూడా వాహనాల నుంచి పొగ విపరీతంగా వెలువడి వాయు కాలుష్యం అవుతుంది. కాలం చెల్లిన వాహనాలు, డీజిల్‌ వినియోగం, పెట్రో కల్తీ తదితర కారణాలతో గుంటూరులో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. రవాణా, ట్రాఫిక్‌ అధికారుల ఉదాశీనతతో కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో కాలుష్యం ప్రమాదకర స్థాయి కు చేరుకుంటుంది.


అమలు కాని ఆదేశాలు

నగరంలో కాలుష్య శాతం 2019 నుంచే ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో అప్పట్లో నగరంలో కాలుష్యం తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రవాణా, ట్రాఫిక్‌, కాలుష్య నియంత్రణ, డీఎస్‌వో ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. 2020 చివరి నాటికి కాలుష్యం నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు అమలు కాలేదు. దీంతో చేసేదేమి లేక అదే శాఖలతో ఈ మధ్య జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా మరో కమిటీని ఏర్పాటు చేసి కాలుష్య శాతాన్ని నియంత్రిం చాలని ప్రణాళికలు జారీ చేశారు. కాకపోతే ఈ సారి కార్తికేయ అనే నోడల్‌ అధికారిని ప్రత్యేకంగా నియమిం చి, 2024 నాటికి కాలుష్యరహిత నగరంగా గుంటూరు ను చేయాలని లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి రెండు వారాల క్రితం నోడల్‌ అధికారి కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. 


రికార్టు స్థాయిలో నమోదు

గుంటూరు నగరంలో కాలుష్య శాతం రికార్డు స్థాయి లో నమోదవుతుంది. గుంటూరులో ప్రధానంగా జీజీ హెచ్‌, ట్రావెలర్స్‌ బంగ్లా, ఆటోనగర్‌, నవభారత్‌ నగర్‌ వంటి నాలుగు ప్రాంతాల్లో కాలు ష్య శాతాన్ని కొలిచేందుకు అధికా రులు యంత్రాలను ఏర్పాటు చేశా రు. వాహనాల నుంచి వచ్చే కాలు ష్యం, గృహల నుంచి వచ్చే కాలు ష్యాల శాతాలను లెక్కించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కాలుష్యం ప్రమాదకరంగా మారడానికి వాహనాల నుంచి వచ్చే పొగే కారణమేని లెక్కలు ధ్రువీకరిస్తు న్నాయి. వాహనాల కాలుష్యాన్ని లెక్కించేందుకు ట్రావెలర్స్‌ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన పొలుష్యన్‌ యంత్రాల్లో కాలుష్య శాతం అధికంగా నమోదైంది. 


ప్రత్యేక చర్యలు చేపడతాం

గుంటూరులో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతాం. పొల్యూషన్‌ నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఇప్పటికే స్పెషల్‌ డ్రైవ్‌లు చేపడు తున్నాం. పొలుష్యన్‌ నిబంధనలు పాటించని వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దుతో పాటు, వాహనదారుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తాం. అలాగే కాలం చెల్లిన వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. 

- డీటీసీ మీరాప్రసాద్‌ 

Updated Date - 2021-08-05T04:51:41+05:30 IST