కాలుష్యం తగ్గింది.....

ABN , First Publish Date - 2020-03-30T10:24:42+05:30 IST

వాయు, ధ్వని కాలుష్యంతో..

కాలుష్యం తగ్గింది.....

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌

బస్సులు, ప్రైవేటు వాహనాలు పూర్తిగా బంద్‌

సరకు రవాణా చేసే వాటికి మాత్రమే అనుమతి

కనిష్ఠస్థాయిలో వాహనాల రద్దీ

నిలిచిన భవన నిర్మాణాలు

అంతంతమాత్రంగానే చమురు వినియోగం


ఈ నెలలో పీఎం10, పీఎం 2.5 ధూళి కణాల నమోదు వివరాలు....


తేదీ పీఎం10 పీఎం2.5 


2/3/2020 112 56 


5/3/20 47 19 


8/3/20 74 19 


11/3/20 59 20


14/3/20 88 32


18/3/20 100 33  


20/3/20 71 25


21/3/20 61.9 20


22/3/20 48.3 16.5


23/3/20 45 20 


25/3/20 66 24 


26/3/2020 49 20


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): వాయు, ధ్వని కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే విశాఖ నగరంలో ప్రస్తుతం స్వచ్ఛమైన వాతావరణం నెలకొంటున్నది. లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతపడడం, వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కాలుష్యం తగ్గుతున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని మోదీ ఈ నెల 23 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో చాలావరకూ పరిశ్రమలు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అత్యవసర సర్వీసులకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) కార్యాలయం వద్ద కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటుచేసిన యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ స్టేషన్‌లో నమోదైన గణాంకాల ప్రకారం కాలుష్యం బాగా తగ్గింది.


మూడువైపులా కొండలు, ఒకవైపు సముద్రం వున్న విశాఖలో సహజంగా చలికాలంలో కాలుష్య సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ దశాబ్దకాలం నుంచి అన్ని సీజన్లలోనూ కాలుష్య సమస్య అధికంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. దీంతో నగర వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంధన కాలుష్యం కనిష్ఠ స్థాయికి చేరింది.


గణనీయంగా పడిపోయిన పెట్రో ఉత్పత్తుల వినియోగం

జిల్లాలో సుమారు 13 లక్షల వాహనాలు ఉన్నాయి. నగరంలో 70, రూరల్‌ ప్రాంతంలో 200... వెరసి 270 పెట్రోల్‌/ డిజిల్‌ బంకులున్నాయి. నగరంలో పెట్రోల్‌ వినియోగం సాధారణ రోజుల్లో రోజుకు మూడు లక్షల లీటర్లు వుండగా లాక్‌డౌన్‌తో 80 వేల లీటర్లు, డీజిల్‌ నాలుగు లక్షల లీటర్లకుగాను 50 వేల లీటర్లకు తగ్గిపోయింది. జిల్లాలోని బంకుల్లో సగటున పెట్రోల్‌, డీజిల్‌ కలిపి రోజుకు ఎనిమిది లక్షల లీటర్ల అమ్మకాలు జరిగేవి. గడచిన వారం నుంచి పది శాతం మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయు. 


ధూళి కణాలు.... ప్రమాద తీవ్రత

పీఎం 2.5 ..

గాలిలో ధూళి కణాలను రెండు రకాలగా నమోదు చేస్తారు. ఒకటి... పీఎం 2.5. వాతావరణంలో కంటికి కనిపించని అతి సూక్ష్మమైన ధూళి కణం. ఇది ప్రమాదకరమైనది. గాలిలో అతి సూక్ష్మమైన ధూళి కణాలు కావడంతో మనకు తెలియకుండా శ్వాస పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, అక్కడే ఉండిపోతాయి. తిరిగి బయటకు వచ్చే అవకాశం ఉండదు. శ్వాసకోశ వ్యాధులతోపాటు చర్మవ్యాధులబారిన పడతారు. కేన్సర్‌ రావడానికి ఈ పీఎం 2.5 ఒక కారణమని వైద్యనిపుణులు చెబుతారు. 


పీఎం 10.....

గాలిలో ఉండే మరో రకమైన ధూళి కణం పీఎం 10. గాలి పీల్చినప్పుడు పీఎం 10 ధూళి కణాలను ముక్కు నిలువరిస్తుంది. అయితే ఇది కూడా పరిమితికి మించితే ప్రమాదమే. వాతావరణంలో ధూళి కాలుష్య శాతం పెరిగి ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నది. గాలిలో ధూళి కణాల శాతం పరిమితికిమించి ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి. 


కాలుష్యం తగ్గింది: రాజేంద్రరెడ్డి, జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌

గత కొన్నేళ్లుగా విశాఖ నగరంలో వాహనాల కారణంగా కాలుష్యం పెరిగింది. చలికాలంలో ఇది మరింత తీవ్రంగా ఉంటున్నది. నగరంలో జీవీఎంసీ ఆఫీసు వద్ద అమర్చిన యంత్రం నిరంతరం పొల్యూషన్‌ను లెక్కిస్తుంది. ఒక క్యూబిక్‌ మీటరు గాలిలో వుండాల్సిన మైక్రోగ్రామ్‌ల ధూళి కణాల్ని లెక్కిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో రోజు 100 మైక్రోగ్రామ్‌లకు చేరినా తిరిగి ఐదు రోజుల తర్వాత 60 ఎంజీలకు చేరుకోవాలి. అయితే ప్రస్తుత లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాధారణం కంటే(40 మైక్రోగ్రాములు) తక్కువగా 19.....20...24...30 ఎంజీలుగా నమోదవుతున్నది. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కాలుష్యం బాగా తగ్గింది. పార్టిక్యూలేట్‌ మీటర్‌ ప్రకారం దుమ్ము ధూళికణాలు 10 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ ఉండేవి.


కనిష్ఠ స్థాయికి చమురు వినియోగం: టి.నారాయణరెడ్డి, అధ్యక్షుడు జిల్లా పెట్రో డీలర్ల అసోసియేషన్‌

లాక్‌డౌన్‌ ప్రభావంతో వాహనాల రాకపోకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జాతీయ రహదారిపై నిత్యావసర సరుకు రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు తిరగడానికి పోలీసులు అనుమతించడంలేదు. దీంతో జిల్లాలో పెట్రోల్‌, డీజల్‌ వినియోగం భారీగా తగ్గింది. బంకులు అత్యవసర సర్వీసుల కింద పరిగణించినందున అమ్మకాలు లేకపోయినా తెరిచి వుంచుతున్నాం.

Updated Date - 2020-03-30T10:24:42+05:30 IST