కమ్మేస్తున్న కాలుష్యం!

ABN , First Publish Date - 2022-05-23T06:17:14+05:30 IST

రాష్ట్రంలో ఏకైక పెద్ద నగరం విశాఖపట్నం. ఇక్కడ కాలుష్యం విపరీతంగా పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

కమ్మేస్తున్న  కాలుష్యం!

నగరంపైకి నల్లటి బొగ్గు ధూళి

వేసవిలో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు 

పోర్టు యార్డుల్లో బొగ్గు, ఇతర రసాయనాల నుంచి రేగుతున్న వైనం 

చుట్టుముడుతున్న శ్వాసకోశ వ్యాధులు

కాలుష్య నియంత్రణ సాధ్యమేనా?


విశాఖపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి):


రాష్ట్రంలో ఏకైక పెద్ద నగరం విశాఖపట్నం. ఇక్కడ కాలుష్యం విపరీతంగా పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నగర పరిసరాల్లో రెడ్‌ కేటగిరీ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య ప్రభావం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం గాలిలో పీఎం-10 ధూళి కణాలు 81 శాతంగా నమోదవుతున్నాయి. ఏడాదిలోగా వీటిని 60 శాతానికి తగ్గించాల్సి ఉంది. అప్పుడే నగరం స్వచ్ఛంగా ఉంటుంది.

  - కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన అధికారుల సమీక్షలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


నగరాన్ని కాలుష్యం కమ్మేస్తోంది. పోర్టు, పరిసర పరిశ్రమల నుంచి నల్లటి ధూళి కణాలు విపరీతంగా రేగుతున్నాయి. వేసవిలో అయితే ఈ కణాలు పరిమితికి మించి ఇళ్లల్లోకి వచ్చి పడుతున్నాయి. బొగ్గు ధూళితో ఇళ్ల పైకప్పులు, చెట్లు నల్లగా మారుతున్నాయి. నగరం సముద్రా నికి ఆనుకుని ఉండడంతో గాలుల తీవ్రత ఎక్కువ. దీని ప్రభావంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు దపదపాలుగా పోర్టు మీదుగా నగరంపైకి ధూళి సుడులు తిరుగుతూ కమ్మేస్తోంది. దీంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పోర్టు, ఇతర పరిశ్రమల కాలుష్యంతోపాటు నగరంలో భవన నిర్మాణాలు, వాహనాల సంఖ్య పెరగడంతో వెలువడుతున్న కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 


సగటు కంటే ఎక్కువగా..

గాలిలో పీఎం-10 (పర్టిక్యులేట్‌ మేటర్‌) సాలీనా సగటు 80 శాతానికి మించి నమోదవుతోంది. వేసవిలో నగరంలోని జ్ఞానాపురం, పోర్టు, కంచరపాలెం, అల్లిపురం, పోలీస్‌బ్యారెక్స్‌, కోటవీధి, వన్‌టౌన్‌ ప్రాంతాల్లో ఒక్కోసారి 150 నుంచి 200 వరకు పీఎం-10 నమోదైన సందర్భాలున్నాయి. ఇంకా పోర్టుకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పీఎం-2.5 కూడా ప్రమాదకరంగానే నమోదవుతోంది. ఏళ్లుగా గాలిలో ధూళికణాలు ప్రమాదకరస్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నగర వాసుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. గాలిలో అత్యంత సూక్ష్మమైన ధూళికణాలు పీల్చడంతో శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ప్రధానంగా పీఎం-2.5 పీల్చడంతో ఊపిరితిత్తుల్లో ఉండిపోయి ఇబ్బందులకు దారితీస్తున్నాయి. మరికొందరు చర్మ వ్యాధులు, గుండెజబ్బులు, కేన్సర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. కాలుష్యంతో కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. ఏడాదిలో ఎక్కువ రోజులు నగరంపైకి ధూళి కాలుష్యం కమ్మేస్తుండడంతో సముద్రం పక్కన ఉన్నా.. వేడి వాతావరణం నెలకొంటోంది. కాలుష్య నియంత్రణమండలితో పాటు అనేక అంతర్జాతీయ అధ్యయన సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నప్పటికీ పరిస్థితి మెరుగుపడడం లేదు. మరోపక్క మహా విశాఖ నగర పాలక సంస్థ స్వచ్ఛనగరాల ర్యాంకింగ్స్‌కు ఇటీవల పోటీపడుతోంది. నగరం ధూళితో నిండిపోతున్న తరుణం లో జీవీఎంసీ  ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు.


పోర్టు యార్డుల నుంచి రేగుతున్న ధూళి

నగరానికి నైరుతి దిక్కున పోర్టు, ఇతర పరిశ్రమలున్నాయి. ఏడాదిలో పది నెలల పాటు ఈ దిశ నుంచి గాలులు వీస్తుంటాయి. ఈ నేపథ్యంలో పోర్టు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి జారీచేస్తున్న హెచ్చరికలు కొంతవరకే అమలవుతున్నాయి. పోర్టులోని మొత్తం బెర్తులలో కొన్నింటిని ఆధునికీకరించాల్సి ఉంది. దీంతో కొన్ని బెర్తుల్లో ఎగుమతి, దిగుమతుల సందర్భంగా ఽధూళికణాలు రేగుతున్నాయి. ఇంకా పోర్టు నుంచి దిగుమతి అయిన బొగ్గు, కోక్‌, రసాయనాలు, ఎగుమతికానున్న ముడిఇనుము, ఇతర ఖనిజాలు యార్డుల్లో పొగులుగా పడి ఉంటున్నాయి. వీటిపై పూర్తిగా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. అయితే కొన్ని చోట్ల ఈ చర్యలు తీసుకుంటున్నా, మరికొన్నింటికి పాక్షికంగా, అక్కడక్కడా లేకుండా వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల చిరిగిన టార్పాలిన్లు కప్పుతున్నారు. గాలుల తీవ్రత పెరిగినపుడు ఈ గుట్టల నుంచి ధూళి రేగి నగరంపైకి వచ్చేస్తోంది. యార్డుల్లో స్టాకును జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత స్టీవ్‌డోర్‌ కంపెనీదే. అయితే ఎక్కువ శాతం కంపెనీలు నిత్యం వ్యాపారధోరణే తప్ప నగర ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.


మంత్రి ఆదేశాలు అమలయ్యేనా..

నగరం నుంచి దేశంలో అనేక ప్రాంతాలకు కనెక్టవిటీ ఉండడం, భారీస్థాయి పరిశ్రమలు, నేవీ, అనేక విద్యాసంస్థలు నెలకొల్పడంతో పెద్దఎత్తున పర్యాటకులు, సందర్శకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ధూళి, కాలుష్య తీవ్రతను తగ్గించాలని అటవీ, పర్యావరణ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అయితే మంత్రి ఆదేశాలు అమలు సాఽధ్యమేనా అని పర్యావరణ వేత్తలు అనుమానం  వ్యక్తం చేస్తున్నారు. పోర్టులో ఎగుమతి, దిగుమతులు చేపట్టే స్టీవ్‌డోర్‌ కంపెనీలకు ఎన్జీటీ ఆదేశాలిస్తే తప్ప సాధ్యంకాదని చెబుతున్నారు. వాహన కాలుష్యం, భవన నిర్మాణాలతో వచ్చే ధూళి, వీధుల్లో రోజువారీ చెత్త నుంచి వచ్చే కాలుష్యాన్ని కూడా నియంత్రించగలిగితేనే స్వచ్ఛ నగరంగా మారుతుందంటున్నారు.


వచ్చే ఏడాదిలోగా పోర్టు ఆఽధునికీకరణ

విశాఖ పోర్టులో కాలుష్యంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇప్పటికే విచారణ చేపట్టింది. వచ్చే ఏడాదిలోగా పోర్టులో అన్ని బెర్తులను ఆధునికీకరిస్తామని పోర్టు యాజమాన్యం ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. పోర్టులో కాలుష్యం, పర్యావరణానికి అనుకూలంగా చేపట్టాల్సిన చర్యలపై పీసీబీ పర్యవేక్షించాలని ఎన్జీటీ తాజాగా ఆదేశించింది. దీనిపై బోర్డుకు నివేదించాం. ప్రస్తుతం పోర్టులో ధూళితో కూడిన కార్గోకు అనుమతులు ఇవ్వడం లేదు. రూ.2 కోట్ల వరకు పీసీబీకు పోర్టు డిపాజిట్‌ చెల్లించింది. 

- ప్రమోద్‌కుమార్‌రెడ్డి, పర్యావరణ ఇంజనీరు, కాలుష్య నియంత్రణ మండలి 



Updated Date - 2022-05-23T06:17:14+05:30 IST