కాలుష్య కేంద్రాలుగా విశాఖ, హైదరాబాద్‌

ABN , First Publish Date - 2022-01-22T07:36:32+05:30 IST

దేశంలో అత్యంత పరిశుభ్రంగా ఉండే చాలా నగరాలు దక్షిణాదిలోనే

కాలుష్య కేంద్రాలుగా విశాఖ, హైదరాబాద్‌

  • విశాఖ, హైదరాబాద్‌ కాలుష్య కేంద్రాలు
  • చలికాలంలో వాయు కాలుష్యం పైపైకి
  • సీఎస్‌ఈ తాజా అధ్యయనంలో వెల్లడి


 

న్యూఢిల్లీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యంత పరిశుభ్రంగా ఉండే చాలా నగరాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. కానీ చలికాలంలో మాత్రం చాలా దక్షిణాది నగరాలు కాలుష్య భరితంగా మారుతున్నాయి. ఈ జాబితాలో తెలంగాణలోని హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కూడా ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎ్‌సఈ) తాజా అధ్యయనం (2019-2021) తేల్చింది. ఇందులో ప్రస్తావించిన గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) ప్రకారం.. హైదరాబాద్‌లో అత్యధికంగా 98 రోజులు, విశాఖపట్నంలో 86 రోజులు, రాజమండ్రిలో 68 రోజులు, అమరావతిలో 68 రోజుల పాటు వాయు కాలుష్యం నెలకొంది.


దక్షిణాదిలో వాయు కాలుష్యం డిసెంబరు నుంచి మార్చి వరకు కొనసాగుతుందని, చలికాలంలో ఇది బాగా పెరుగుతుందని సీఎ్‌సఈ తెలిపింది. శీతాకాలంలో వాతావరణంలోని దుమ్మూధూళి పెరుగుతున్న నగరాల్లో తిరుపతి కూడా ఉందని వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది నగరాల్లో వాయుకాలుష్యం తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రమేపీ పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామమని హెచ్చరించింది. ఏపీ లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అమరావతి, తిరుపతి, తెలంగాణలోని హైదరాబాద్‌ సహా 6  నగరాల్లో వాయు కాలుష్య స్థాయులను సీఎ్‌సఈ విశ్లేషించింది. అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోని నగరాలను కూడా అధ్యయనం చేశారు.


గాలిలో కాలుష్య ఉద్గారాల మోతాదు ఎక్కువగా ఉందనడానికి సంకేతం ‘పర్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం) 2.5’ మోతాదు. 2021 డిసెంబరు నెలలో అమరావతిలో ప్రతి క్యూబిక్‌ మీటరు గాలిలో పీఎం 2.5 రకం కాలుష్య ఉద్గారాల మోతాదు 100 మైక్రో గ్రాములకు పెరిగిన విషయాన్ని తాజా అధ్యయనంలో ప్రస్తావించారు. చలికాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సగటున ఒక వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా పీఎం 2.5 మోతాదు నమోదైన నగరాల జాబితాలో విశాఖపట్నం (క్యూబిక్‌ మీటరు గాలిలో 89 మైక్రోగ్రాములు), రాజమండ్రి (క్యూబిక్‌ మీటరు గాలిలో 86 మైక్రోగ్రాములు), హైదరాబాద్‌ (క్యూబిక్‌ మీటరు గాలిలో 81 మైక్రోగ్రాములు) ఉన్నాయి. 




Updated Date - 2022-01-22T07:36:32+05:30 IST