కాలుష్య కాసారం

ABN , First Publish Date - 2022-05-25T04:59:12+05:30 IST

కృష్ణానది పక్కనే ఉన్న ఆ భూములు పచ్చని పంటలతో కళకళలాడాల్సి ఉండగా, కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. సమీపంలోని ఓ కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థ జలాలతో పంటలు పండని పరిస్థితికి వస్తున్నాయి.

కాలుష్య కాసారం
కంపెనీ నుంచి సమీపంలో లీజుకు తీసుకున్న పొలాల్లోకి వదులుతున్న కలుషిత నీరు

ఓ ఫ్యాక్టరీ డీలింటింగ్‌ వాటర్‌తో భూగర్భ జలాలు కలుషితం

రీసైక్లింగ్‌ చేయకుండా లీజుకు తీసుకున్న భూముల్లోకి వదులుతున్న యాజమాన్యం

దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాలు విలవిల

కృష్ణానదిలోకీ వ్యర్థ జలాలు వదులుతున్నట్లు గ్రామస్థుల ఆరోపణ

గతంలో మూగజీవాలు మృత్యువాత

పంటలు పండుతలేవని రైతుల ఆవేదన

పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు


 కృష్ణానది పక్కనే ఉన్న ఆ భూములు పచ్చని పంటలతో కళకళలాడాల్సి ఉండగా, కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. సమీపంలోని ఓ కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థ జలాలతో పంటలు పండని పరిస్థితికి వస్తున్నాయి. వ్యర్థ జలాలను రీసైక్లింగ్‌ చేసి తిరిగి వాడుకోవాల్సిన ఫ్యాక్టరీ నిర్వాహకులు.. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో సమీపంలో ఉన్న పొలాలను లీజుకు తీసుకొని వాటిలోకి వదులుతున్నారు. ఇదేమని ప్రశ్నించే వారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.

- ఆంధ్రజ్యోతి, గద్వాల


ఇటిక్యాల మండలంలో 2012లో ఏర్పాటైన ఓ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ జలాలను సమీపంలో ఉండే నీటి వనరుల్లో యథేచ్ఛగా వదులుతున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. డీలింటింగ్‌ వాటర్‌ను శుద్ధి చేసుకోవాల్సిన కంపెనీ యాజమాన్యం ఆ ప్రక్రియ జోలికి పోవడం లేదు. సమీపంలో ఉండే భూములను లీజ్‌కు తీసుకుకి అక్కడే వదులుతున్నారు. సదరు ఫ్యాక్టరీలో స్టార్చ్‌ పౌడర్‌, రంగులు, పేపర్‌ తయారీలో ఉపయోగించే రసాయనాల తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ మొక్కజొన్నలు సల్ఫర్‌లో ఉడికించడం ద్వారా ఫౌడర్‌ను తయారు చేస్తారు. సల్ఫర్‌లో ఉడికించిన తర్వాత నీటిని ఎపులెంట్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా 60 వేలకు ఉన్న సీవోడీ(కెమికల్‌ ఆక్సీజన్‌ డిమాండ్‌) లెవల్స్‌ను 500 వరకు తగ్గించి పంపించాలి. కానీ అలా చేయకుండా 30 వేల కంటే ఎక్కువగా సీవోడీ లెవల్స్‌ ఉండే నీటిని బయటకు వదులుతున్నట్లు తెలుస్తోంది. ఆ నీటి వల్ల పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ నీరు సమీప పొలాలతో పాటు దగ్గర్లోని శేకుపల్లి వాగులో, అక్కడి నుంచి కృష్ణానదిలో కలుస్తున్నట్లు సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సమీప పొలాల్లోకి కూడా ఈ కలుషిత నీటిని వదులుతుండగా, లీజు ధర మార్కెట్‌ కంటే రైతులకు ఎక్కువగా చెల్లిస్తుండటంతో వారూ ప్రశ్నించడం లేదు. ఈ నీళ్లు వ్యవసాయ భూముల్లోకి రావడం వల్ల భూసారం తగ్గి, భవిష్యత్‌లో పంటలు పండించలేని స్థితికి వస్తాయని వారు గ్రహించలేకపోతున్నారు. 


గతంలోనూ ఆరోపణలు..

వాస్తవానికి ఇటిక్యాల మండలంలో ఏర్పాటైన ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు నదీ జలాలు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నట్లు గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్వాసనతో కొండేరు, జింకలపల్లి, శేకుపల్లి, పుటాన్‌దొడ్డి, ఎర్రవల్లి గ్రామాల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో కొట్టం ఇంజనీరింగ్‌ కళాశాల వారు ఈ విషయమై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దాంతో కంపెనీ వారు ఇలా ఎవరైనా వ్యతిరేక ఆరోపణలు చేసిన వారిని మచ్చిక చేసుకోవడమో లేదా బెదిరింపులకు దిగడమో చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యాక్టరీలో ఉన్న ఈఎస్‌పీ(ఎపులెంట్‌ సీనరేజ్‌ ప్లాంటు)కు విద్యుత్‌ ఆదా చేయడం కోసమే, వ్యర్థ జలాలను ట్రీట్‌ మెంట్‌ చేయకుండా సమీప పొలాల్లోకి వదులుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ కలుషిత నీటి వల్ల గతంలో మూగజీవాలు, చేపలు కూడా చనిపోయినట్లు విమర్శలు ఉన్నాయి. కంపెనీల కాలుష్యం, డీలింటింగ్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే సదరు కంపెనీ నిర్వాహ కులు యథేచ్ఛగా వ్యవహ రించడానికి కారణ మవుతోంది. నది, భూ గర్భ జలాలు కలు షితం కాకుండా ఇక నైనా వారు చర్యలు తీసుకోవాల్సిన అవ సరం ఉంది. రెండు నెలల కిందట కృష్ణా పరివాహకంలో ఉన్న ఫ్యాక్టరీల వ్యర్థ జలాలు నదిలో కలవడం వల్ల అక్కడి నీటిలో కాపర్‌, జింక్‌, కాడ్మియం, నికెల్‌, క్రోమియం వంటి లోహాల శాతం పెరిగి పోతోందని పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికను గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు అందజేసింది. తాజాగా ఓ కంపెనీ నిర్వాకం వల్ల భూగర్భజలాలు కలుషితమ వుతుండటం భవిష్యత్‌లో ఆ భూములు ఎందుకు పనిరాకుండా పోతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


బావిలోకి కలుషిత నీరు

నాకున్న పొలంలో బెండ తోట సాగు చేశాను. బోరు నీరే పొలానికి అందించాను. పంట ఎదగలేదు. దిగుబడి రావడం లేదు. నా బావిలోకి ఎస్‌ఎన్‌ఎస్‌ కంపెనీ నుంచి వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయి.  కంపెనీ వాళ్లకు చెప్తే లీజ్‌కు తీసుకుంటామని తీసుకోలేదు. కలుషిత నీటి వల్ల గతంలో మూగజీవాలు కూడా చనిపోయాయి. ఎంతోకొంత ఇచ్చి మేనేజ్‌ చేస్తున్నారు.

- యుగంధర్‌, రైతు, కొండేరు


దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి

ఫ్యాక్టరీ ద్వారా వచ్చే పొగ, దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నాం. పొగలు దట్టం గా వ్యాపించడంతో వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఇంటి దగ్గర ఉన్నా, పొలాల్లో ఉన్నా తప్పడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా పరిస్థితి మారడం లేదు. పిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీటితో పొలాలు నాశనం అవుతున్నాయి. అధికారులు స్పం దించి కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలి.

- ఈరన్న, రైతు, జింకలపల్లి 


పరిశీలించి విచారణ చేస్తాం

ఎస్‌ఎన్‌ఎస్‌ ఫ్యాక్టరీ నుంచి జల, వాయు కాలుష్యంపై పరిశీలన చేస్తాం. కాలుష్యం జరిగితే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. పశుపక్షాదులు కాలుష్యం వల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి పరిశీలన జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటాం.

- దయానంద్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారి





Updated Date - 2022-05-25T04:59:12+05:30 IST