205 పంచాయతీ వార్డులకు 15న పోలింగ్‌

ABN , First Publish Date - 2021-03-04T06:01:48+05:30 IST

జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 38మండలాల్లోని 205 వార్డు స్థానాలకు ఈనెల 15వ తేదీ పోలింగ్‌ జరగనుంది.

205 పంచాయతీ వార్డులకు 15న పోలింగ్‌

నోటిఫికేషన్‌ విడుదల చేసిన కలెక్టర్‌


చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 3: జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 38మండలాల్లోని 205 వార్డు స్థానాలకు ఈనెల 15వ తేదీ పోలింగ్‌ జరగనుంది. ఈమేరకు కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్కరు కూడా నామినేషన్లు వేయకపోవడం, ఇన్‌వ్యాలీడ్‌ లేదా అభ్యర్థులందరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడం తదితర కారణాలతో 38 మండలాల్లోని 205 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరగలేదు. ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ షేడ్యూల్‌ విడుదల చేశారు. ఆ మేరకు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్‌ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోలకు స్జేజ్‌-1, స్టేజ్‌-2 రిటర్నింగ్‌ అధికారుల నియామక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎంపీడీవోలను సమన్వయం చేసుకుని ఆర్వోల నియామకం పూర్తి చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. 4వ తేదీ గురువారం నుంచి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 7న స్ర్కూటినీ, 8న ఆర్డీవోల వద్ద అభ్యంతరాల పరిశీలన, 10న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 15వ తేదీ ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్‌ ఎన్నిక జరుగుతుంది.

Updated Date - 2021-03-04T06:01:48+05:30 IST