ఆదర్శం ముసుగులో రాజకీయం

ABN , First Publish Date - 2020-09-10T06:21:31+05:30 IST

ఈనెల నాలుగో తేదీనాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అస్నాల శ్రీనివాస్‌ ‘మృత భాషకు ప్రాణం పోయడమా?’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో సంస్కృత భాషా మనుగడ గురించి...

ఆదర్శం ముసుగులో రాజకీయం

తెలుగు పద్యాలలో గురు లఘువులను వాడతాం. కంప్యూటర్‌ భాష ద్విసంఖ్యామానంలో 0,1 పేరుతో అవే గుర్తులు ఉంటాయి. కంప్యూటర్‌ భాషా విస్తారణ, గురు లఘువుల విస్తరణ 99.5 శాతం ఒకే రీతిలో ఉంటుంది. కనీసం ఈ సత్యాన్ని కూడా గమనించని నేటి విద్యావ్యవస్థ తెలుగు ఛందస్సును విద్యార్థులకు అశాస్త్రీయ రీతిలోనే సిలబస్‌గా అందిస్తోంది.


ఈనెల నాలుగో తేదీనాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అస్నాల శ్రీనివాస్‌ ‘మృత భాషకు ప్రాణం పోయడమా?’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో సంస్కృత భాషా మనుగడ గురించి చర్చించారు. ఆ చర్చలో చారిత్రక వాస్తవాలు చాలా ఉన్నాయి. అయితే సంస్కృత భాషా మూలాలలోని శాస్త్రీయతకు సంబంధించిన అంశాలు మాత్రం అశాస్త్రీయంగా ఉన్నాయి. భారత ఉపఖండ చరిత్రలో సంస్కృతం ప్రజలభాషగా ఎప్పుడూ లేదన్నది ఎంత నిజమో అందులో మహోన్నతమయిన వ్యాకరణం, గణితం, రసాయనిక, జీవశాస్త్రాదులు ఉన్నాయన్నది అంత నిజం. ఇప్పటివరకు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌ వంటి సంస్థలు కూడ వాటిని విద్యావ్యవస్థకు ఉపయోగపడే సిలబస్‌గా మలచలేదన్నది కూడ నిజం; మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఆధ్యాత్మికవాదులు మన పురాణేతిహాసాలలో అన్ని రకాల శాస్త్రీయ విషయాలు ఉన్నాయని ఉపన్యాసాలు చెప్పడం వరకే పరిమితమవుతున్నారు.


నేడు సమాజంలో వేదగణితంగా చెలామణి అవుతున్నది నిజానికి వేదగణితం కాదు. వేగగణితం; అలా మారడానికి కారణం ఆది శంకర పీఠాధిపతి భారతీకృష్ణతీర్థ మేధస్సు. గణితంలో డిగ్రీ ఉన్న ఆయన పీఠాధిపతి అయ్యాక తన మేధస్సును అధర్వణ వేదానికి ముడివేసి వేగగణితాన్ని వేదగణితం చేశారు. దానివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగింది. కొన్ని సందర్భాలలో ఆధునిక గణితాన్ని తోసిరాజనగల గణితం వేదాలలో ఉంది. పీఠాధిపతి వల్ల అది కుచించుకుపోయింది. ఇంతవరకు ఈ విషయాన్ని ఏ సంస్థానం గుర్తించలేదు. సరిచేయలేదు. దానికి సంబంధించి అసలు శాస్త్రీయ సిలబస్సే లేదు. అయితే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్స్‌, విద్యుత్తు వంటివి ఉన్నాయని పెద్ద పెద్ద మాటల గారడీతో సంస్కృతం, సంస్కృతం అంటున్నారు. కంప్యూటర్‌ భాష ద్విసంఖ్యామానం వేదాంగాలలో ఒకటయిన ఛందస్సులో ఉంటుంది. వేదఛందస్సు, పద్యఛందస్సు అని ఛందస్సులో ఉప విభజనలు అనేకం ఉన్నాయి.


ఉదాహరణకు తెలుగు పద్యాలలో గురు లఘువులను వాడతాం. కంప్యూటర్‌ భాష ద్విసంఖ్యామానంలో 0, 1 పేరుతో అవే గుర్తులు ఉంటాయి. కంప్యూటర్‌ భాషా విస్తారణ, గురులఘువుల విస్తరణ 99.5 శాతం ఒకే రీతిలో ఉంటుంది. కనీసం ఈ సత్యాన్ని కూడా గమనించని నేటి విద్యావ్యవస్థ తెలుగు ఛందస్సును విద్యార్థులకు అశాస్త్రీయ రీతిలోనే సిలబస్‌గా అందిస్తోంది. మన తెలుగు ఛందోశాస్త్రాలను పరిశీలిస్తే ప్రస్తార ప్రక్రియ ఒకటి ఉంటుంది. అది ద్విసంఖ్యామాన గణిత విస్తారానికి దగ్గరగా ఉంటుంది. నేటి సిలబస్‌లో దాని ఊసే ఉండదు. ఇక ఛందస్సు విస్తారణకు, ద్విసంఖ్యామాన విస్తరణకు 0.5 శాతం తేడా రావడానికి కారణం ఛందస్సులో ఉన్న విభాగాలు; ఈ విభాగాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఉదాత్తానుదాత్తస్వరితాదులతో ఉచ్చరించవలసిన అక్షరాల గణితం ప్రత్యక్షమవుతుంది. దీనిని గమనించి మూలాల్లోకి వెడితే అసలు సిసలైన ద్విసంఖ్యామాన, త్రిసంఖ్యామాన, సప్తాంశమాన, ద్వాదశమానాది గణితాలు ఉద్భవిస్తాయి. పండితుల ఉదాత్తానుదాత్తాలలోనే కాదు, పామరులు మాట్లాడే ఆయా ప్రాంతాల యాసలలో కూడా గణితం ఉంటుందని శ్రీనివాస్‌ గమనించాలి. కాగా సంస్కృత సంస్థానాలకు 650 కోట్లే కాదు, వెయ్యి కోట్లు ఇచ్చినా వారు మన వేదవేదాంగాలలోని గణితాదులను శాస్త్రీయ సిలబస్‌గా మరో వంద సంవత్సరాలైనా మార్చగలరో లేరో చెప్పలేం; దీనికి ప్రధాన కారణం శ్రీనివాస్‌ అన్నట్లు ఇప్పటికీ ప్రచారంలో ఉన్న ఎక్కువ శాతం సంస్కృతం వర్గ కుల సమాజ పటిష్టతకు ఉపయోగపడే రీతిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆదర్శం ముసుగులో రాజకీయాలు చేయడం వలన సత్ఫలితాల కన్నా దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. నిజంగా మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరభాషా శాస్త్రీయ సంపదను ఆయా ప్రాంతీయ భాషల్లో సిలబస్‌గా చెయ్యాలి. పటిష్ట పారిభాషిక పదసంపదతో ఆ సిలబస్‌ ఉండాలి.

వాగమూడి లక్ష్మీరాఘవరావు

Updated Date - 2020-09-10T06:21:31+05:30 IST