Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 15 Dec 2021 07:23:00 IST

‘దుబాయ్‌ ఎక్స్‌పో’లోనూ అదే వైఖరి

twitter-iconwatsapp-iconfb-icon
దుబాయ్‌ ఎక్స్‌పోలోనూ అదే వైఖరి

భావోద్వేగ ధార్మిక రాజకీయాలకు అరబ్‌దేశాలు పెట్టింది పేరు. రాజకీయ అధికార సాధనకు మతాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో అరబ్‌లకు తెలిసినంతగా బహుశా ఇతరులకు తెలియకపోవచ్చు.


రాజకీయ ఆధిపత్యానికి ధర్మం అనే సున్నిత అంశాన్ని కవచంగా వాడుకున్న దేశాలు ధార్మిక రాజకీయాలు శాశ్వతం కావనే వాస్తవాన్ని గ్రహిస్తున్నాయి. వర్తమాన ప్రపంచంలో వెలుగొందాలంటే అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసిన ఆవశ్యకతను అవి గుర్తించాయి. ఇస్లాం జన్మభూమి అయిన సౌదీ అరేబియాలో ఎవరూ ఊహించనంతగా సంస్కరణలు ఊపందుకున్నాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయి. ఇస్లామిక్ ధర్మం అనే మౌలికసూత్రం ఆధారంగా పురుడు పోసుకున్న గల్ఫ్ దేశాలూ క్రమేణా మార్పును సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయి, ఆబుధాబిలలో విశాల హిందూ దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇస్లాం చరిత్రలో మతం ఆధారంగా ఏర్పడ్డ ప్రప్రథమదేశం పాకిస్థాన్, భాష కారణాన విడిపోయి, మత రాజకీయాలతో అధోగతి పాలైంది.


భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న కొన్ని అభ్యుదయ దేశాల పాలకులు తమ ప్రజలపై ధార్మిక రాజకీయాలను రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్‌లో హిందూత్వ, టర్కీలో ఇస్లామీకరణ పరిణామాలే ఇందుకు నిదర్శనాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఎరుదొగాన్ తమ స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ఎలాంటి సంకోచం లేకుండా సంస్కృతి పేరిట రాజకీయాలు చేస్తుంటారు. జాతి పురోగతిని ప్రదర్శించేందుకు ఇతరదేశాల నేతలు ప్రయత్నిస్తుండగా భారత్, టర్కీ ప్రభుత్వాధినేతలు మాత్రం భిన్నమార్గంలో పయనిస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాల మధ్య పారిశ్రామిక, వాణిజ్య అవకాశాల పెంపొందించుకునే లక్ష్యంతో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ‘ఎక్స్ పో’ల పేరిట భారీ వాణిజ్య ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి. 1900లో పారిస్ ఎక్స్ పో సందర్భంగా సందర్శకుల కోసం నిర్మితమైందే ఈఫిల్‌టవర్. దుబాయి ఎక్స్ పో -2021 మధ్య ప్రాచ్య దేశాలలో నిర్వహిస్తున్న ప్రప్రథమ ఎక్స్ పో. వాస్తవానికి గత ఏడాదే నిర్వహించవలసి ఉన్నప్పటికి కరోనా కారణాన వాయిదాపడి ప్రస్తుతం నడుస్తోంది.


దుబాయి ‘ఎక్స్‌పో’లో పాల్గొంటున్న 192 దేశాల్లో ప్రతి దేశమూ తమ అభివృద్ధి, సాంకేతిక విజయాలను ప్రదర్శిస్తూ వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తోంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా గ్రీన్ ఫ్యూయల్‌పై యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, సౌదీ అరేబియాలు కొన్ని వాణిజ్య ప్రతిపాదనలను ముందుంచాయి. అదేవిధంగా ఆహారభద్రత మొదలైన అంశాలపై యుఎఇ ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే కొవిడ్ వాక్సిన్‌ను ఇజ్రాయిల్, వివిధ ఆధునిక ఉత్పత్తులను ఇతర దేశాలు ప్రదర్శించాయి. అమెరికా, రష్యాలూ అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించాయి.


మొత్తం ఎక్స్‌పో లో భారతీయ ప్రదర్శనశాలే విశాలమైంది. 8,750 చదరపు గజాల వైశాల్యంలో మూడంతస్థులుగా అది నిర్మాణమయింది. ఈ ప్రదర్శనశాలలో భారత్ సాధించిన సాంకేతిక, వ్యవసాయక విజయాల కంటే మిన్నగా రాజకీయ లబ్ధిని ఆశిస్తూ ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలకు భారత ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. త్వరలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర పురోగతి కంటే అధ్యాత్మిక, ధార్మిక విషయాలను ముఖ్యంగా అయోధ్య రామమందిర నమూనాను ప్రధానంగా ప్రదర్శించనున్నది. కేరళ తమ పర్యాటక రంగం గురించి ప్రచారం చేయనున్నది. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రదర్శనలో ముగ్గురు హైదరాబాద్ ఇంజనీర్లు రూపొందించిన ఎయిర్ కండిషన్డ్ హెల్మెట్ యావత్ప్రపంచ నిర్మాణ, సాంకేతిక నిర్వహణ రంగాన్ని అబ్బురపరిచింది. దేశీయంగా రూపొందించి ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్‌ను ప్రధాన ఆకర్షణగా ఉంచడానికి బదులుగా స్నానపు ఘట్టాలను ఆకర్షణగా పెట్టారు! అయోధ్యలోని శ్రీరామ మందిరం నిస్సందేహంగా కోట్లాది భక్తుల స్వప్నం. అయితే ప్రపంచ దేశాలన్నీ తమ పారిశ్రామిక, సాంకేతిక పురోగతి ప్రదర్శించేచోట మనం భిన్న మార్గంలో వెళ్లుతున్నాం. 


ఇస్లాం ఏకైక నినాదంగా ఇప్పటివరకు మనుగడ సాగించిన అనేక దేశాలు సహనశీల సమాజాలుగా మారడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతదేశం ఇప్పటికీ నిస్సందేహాంగా వసుధైవ కుటుంబకం అనే ఆదర్శానికి నిదర్శనంగా ఉంది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆ సమున్నత ప్రతిష్ఠను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. 


మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.