Casino ED raids : మల్లికా షెరావత్‌కు రూ.కోటి చెల్లించిన చీకోటి ప్రవీణ్‌.. మిగతా చెల్లింపుల లిస్ట్ ఇదీ..

ABN , First Publish Date - 2022-07-29T01:17:01+05:30 IST

నేపాల్‌(Nepal)లో క్యాసినో ఈవెంట్ల(Casino Events) నిర్వహణ వ్యవహారంలో నిందితుల్లో ఒకడిగా చికోటి ప్రవీణ్(chikoti praveen) లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Casino ED raids : మల్లికా షెరావత్‌కు రూ.కోటి చెల్లించిన చీకోటి ప్రవీణ్‌.. మిగతా చెల్లింపుల లిస్ట్ ఇదీ..

హైదరాబాద్: నేపాల్‌(Nepal)లో క్యాసినో ఈవెంట్ల(Casino Events) నిర్వహణ వ్యవహారంలో నిందితుల్లో ఒకడిగా చికోటి ప్రవీణ్(chikoti praveen) లింకులు, చెల్లింపులు వెలుగుచూస్తున్నాయి. మల్లికా శెరావత్‌కు రూ. కోటి, ఈషా రెబ్బకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్ ఖాన్‌కు రూ.15 లక్షలు, అమీషా పటేల్‌కు రూ.80 లక్షలు, హయాతికి రూ.40 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు చొప్పున చీకోటి ప్రవీణ్ చెల్లించినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పారితోషకం అందుకున్న తారలకు నోటీసులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.


కస్టమర్ల జాబితా ఇదీ

అతగాడి కస్టమర్ల జాబితాలో ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు ఉన్నారు. తెలంగాణకు చెందిన ఒక మంత్రితోపాటు ఏపీ మాజీ మంత్రి ఒకరికి చికోటితో లింకులు ఉన్నాయని ఈడీ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఇక నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వినికిడి. ప్రవీణ్‌ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీ(VIP)ల భాగోతాలు ఉన్నాయని సమాచారం. చెన్నైకి చెందిన ఓ బంగారం వ్యాపారికి ప్రవీణ్ హవాలా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. కస్టమర్ల వద్ద ఒక్కో దేశానికి ఒక్కో రేటుతో డబ్బు వసూలు చేశాడు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌ దేశాలను అడ్డాలుగా మార్చుకున్నాడు. కస్టమర్లు కోల్‌కతా మీదుగా నేపాల్‌ తరలిస్తున్నారు. ఒక్కో విమానానికి రూ.50 లక్షలు, హోటల్‌కు రూ. 40 లక్షలు చెల్లింపు చేశారని సమాచారం. కస్టమర్ల నుంచి ప్రవీణ్ రూ.5లక్షలు వసూలు చేసినట్టు తేలింది. కాగా ప్రవీణ్‌ రెగ్యులర్‌ కస్టమర్లు 200 మంది వరకు ఉన్నారట.


లీగల్ వ్యాపారమే చేశా..

నేపాల్‌లో క్యాసినో చట్టబద్ధమేనని ఏబీఎన్ (ABN)తో చికోటి ప్రవీణ్ చెప్పాడు. తాను చేసింది లీగల్ వ్యాపారమే పేర్కొన్నాడు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని వివరించాడు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు చెప్పారని తెలిపాడు. విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తానని వెల్లడించాడు. తాను సామాన్య వ్యక్తినని, క్యాసినో వ్యవహారంలోనే ఈడీ రైడ్స్ చేసిందని పేర్కొన్నాడు.


అంతా నేరచరిత్ర..

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌ కాలనీకి చెందిన చీకోటి ప్రవీణ్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో ఒక సినీప్రముఖుణ్ని కిడ్నాప్‌ చేశాడనే ఆరోపణ అతడిపై ఉంది. ఇరవై ఏళ్ల క్రితం చిన్న సిరామిక్‌టైల్స్‌ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్‌.. తర్వాత నిర్మాతగా మారి సినిమా తీసి, విలన్‌గా నటించి దివాలా తీశాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి దాన్నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఆ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత.. గోవాలో ఓ పేకాట క్లబ్బులో కొన్ని టేబుళ్లలననుఉ  లీజుకు తీసుకుని జూద నిర్వహణలో ప్రస్థానం ప్రారంభించాడు. ఆతర్వాత అంచెలంచెలుగా తన క్యాసినా సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తాడు. రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే.. చినజీయర్‌ స్వామిని ప్రవీణ్‌ ఒక కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు ఇటీవల వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 2017లో దీపావళి నాడు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో పేకాట ఆడిస్తూ పోలీసులకు చిక్కాడు. అప్పుడు దాదాపు 30 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రవీణ్‌.. గోవాలో క్యాసినో నిర్వహించేవాడు. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించింది ప్రవీణే. అంతేకాదు.. బిగ్‌డాడీ పేరుతో గోవాతో పాటు నేపాల్‌, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్‌, తదితర దేశాల్లో క్యాసినోను నిర్వహిస్తుంటాడు. గత నెలలో తన పుట్టినరోజు వేడుకలను చంపాపేటలోని ఒక గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, ప్రకాశ్‌గౌడ్‌, అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారులు, పోలీసు అధికారులు హాజరవడం గమనార్హం.

Updated Date - 2022-07-29T01:17:01+05:30 IST