నువ్వా.. నేనా..?

ABN , First Publish Date - 2022-05-10T06:26:19+05:30 IST

నువ్వా.. నేనా..?

నువ్వా.. నేనా..?

వంశీ, దుట్టా వర్గాల మధ్య మళ్లీ బలప్రదర్శన

నేడు చలో తాడేపల్లి బైక్‌ ర్యాలీకి వంశీ వ్యతిరేక వర్గం సన్నాహాలు

గడప గడపకు వైసీపీ ద్వారా ప్రజల్లోకి ఎమ్మెల్యే వంశీ


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గన్నవరం వైసీపీలో మళ్లీ అసమ్మతి చిచ్చు రాజుకుంది. ఓపక్క గడపగడపకు వైసీపీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వర్గం సిద్ధమవుతుండగా, మరోపక్క నియోజకవర్గానికి ఇన్‌చార్జిని ప్రకటించాలంటూ వంశీ వ్యతిరేక వర్గం ‘చలో తాడేపల్లి’ పేరుతో మంగళవారం బైక్‌ ర్యాలీకి పిలుపునిచ్చింది. 

కిందిస్థాయిలోనూ పోరు

కీలకమైన నాయకుల మధ్య నెలకొన్న ఈ ఆధిపత్య పోరు కిందిస్థాయి వరకు చేరి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఓపక్క రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోగా, ఆ పరిణామాలు తలనొప్పిగా పరిణమించనున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వంశీమోహన్‌ తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని దుట్టా, యార్లగడ్డ అనుచరులు తొలి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య అంతరం నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజాగా ఇరువర్గాల మధ్య దూరాన్ని బహిర్గతం చేస్తూ వంశీ వ్యతిరేక వర్గం మంగళవారం ‘చలో తాడేపల్లి’ బైక్‌ ర్యాలీకి పిలుపునివ్వడంతో నియోజకవర్గంలో చర్చ మళ్లీ మొదలైంది. ‘మాకు టీడీపీ నుంచి గెలిచిన వంశీ వద్దు. నియోజకవర్గానికి పార్టీ తరఫున ఇన్‌చార్జిని నియమించాలి.’ అనే డిమాండ్‌తో ఈ బైక్‌ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వంశీ వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. వంశీ వ్యతిరేక వర్గానికి చెందిన కార్యకర్తలు రెండు నెలల క్రితం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కలిసి గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జిని నియమించాలని కోరారు. అయినా స్పందన లేకపోవడంతో వారు బైక్‌ ర్యాలీతో తమ నిరసన తెలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ర్యాలీకి నియోజకవర్గంలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్‌ మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి వంశీ వ్యతిరేక వర్గానికి చెందినవారు హాజరుకానున్నట్లు సమాచారం. బైక్‌ ర్యాలీని విజయవంతం చేయాలంటూ వంశీ వ్యతిరేక వాట్సాప్‌ గ్రూపుల్లో  ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం మీద సుమారు 300 నుంచి 500 మంది వరకు ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 





Read more