‘ఎయిర్‌పోర్ట్‌’పై రాజకీయ రగడ

ABN , First Publish Date - 2022-08-06T06:47:16+05:30 IST

ఎన్నో ఏళ్లుగా జిల్లావాసులను ఊరిస్తూ వస్తున్న జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కలగానే మారింది. విమానాశ్రయ నిర్మాణంపై మళ్లీ రాజకీయ రగడ మొదలయ్యింది. గత మూడేళ్ల క్రితమే కేంద్ర అధికారుల బృందం జిల్లాలో పర్యటించి అనుకూలమైన నివేదికను ఇచ్చినా..

‘ఎయిర్‌పోర్ట్‌’పై రాజకీయ రగడ
జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన స్థలం ఇదే

జిల్లాలో ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం

ఇప్పటికే 369 ఎకరాల భూమిని సేకరించిన వాయుసేన

పౌర విమానాయాన సేవలు  అందించాలని స్థానికుల డిమాండ్‌

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల పోటాపోటీ ప్రకటనలు

నేడు జిల్లా బంద్‌కు బీజేపీ పిలుపు

ప్రభుత్వం సహకరించడం లేదని ఆగ్రహం

ఆదిలాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా జిల్లావాసులను ఊరిస్తూ వస్తున్న జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కలగానే మారింది. విమానాశ్రయ నిర్మాణంపై మళ్లీ రాజకీయ రగడ మొదలయ్యింది. గత మూడేళ్ల క్రితమే కేంద్ర అధికారుల బృందం జిల్లాలో పర్యటించి అనుకూలమైన నివేదికను ఇచ్చినా.. అడుగు ముందుకు పడినట్లు కనిపించడం లేదు. దక్షిణాధి రాష్ర్టాలకు అందుబాటులో ఉండి ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే 44వ జాతీయ రహదారిపై ఉన్న జిల్లా కేంద్రంలో వాయుసేన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలోనే 369 ఎకరాల భూమిని సేకరించింది. దీంతో పాటు పౌర విమానయాన సేవలను కూడా అందించాలని జిల్లా ప్రజలు యేళ్ల తరబడి డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపకపోవడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా ఎయిర్‌పోర్టు నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చిచంది. ఇటీవల జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీనిలో భాగం గా భూ సేకరణ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్న డిమాండ్‌తో శనివారం జిల్లా బంద్‌కు బీజేపీ పిలుపునివ్వడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ప్రతీసారి ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు చేయడం పరిపాటిగా మారింది.  ఈసారి కూడా ముందస్తు ఊహాగాణాలు వినిపించడంతో అప్రమత్తమైన రాజకీయ పార్టీలు విమానాశ్రయంపై రగడ మొదలు పెట్టాయి. ఇప్పటికే గత కొన్నాళ్ల క్రితం సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ సాధన కమిటీ పేరిట ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి దీటుగా బీజేపీ జిల్లా నాయకత్వం విమానాశ్రాయ అంశాన్ని భుజాన వేసుకుని ఆందోళనలకు సిద్ధమవుతోంది. 

శాశ్వత పరిష్కారం ఏదీ?

ప్రతీసారి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటాపోటీగా ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కాగా, ఎన్నో ఏళ్లుగా దీర్ఘకాలిక సమస్యగా వస్తున్న ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈసారి అనుకున్నట్లుగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదే పార్టీకి చెందిన అభ్యర్థి జిల్లాలో పార్లమెంట్‌ సభ్యుడిగా గెలవడం కలిసి వస్తుందని అందరూ భావించినా.. నిరాశనే కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా గెలుపొందిన పార్టీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తాము అనుకూలమేనని కేంద్ర ప్రభుత్వ పెద్దలు జిల్లాలో పర్యటించిన సమయంలో ప్రకటనలు చేయడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నామని చెప్పడం గమనార్హం.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలతో జిల్లాలో గందరగోళ పరిస్థితులకు దారి తీస్తోంది. మొత్తానికి ఏళ్లు గడుస్తున్నా.. శాశ్వత పరిష్కారాన్ని చూపకపోవడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రస్తుతం జిల్లావాసులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

కేంద్రం సానుకూలమేనా?!

గతంలోనే జిల్లా కేంద్రంలో సేకరించిన 369 ఎకరాల భూమి ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. దీంతో ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 2014లోనే వాయుసేన అధికారులు జిల్లాలో పర్యటించి సాధ్య, అసాధ్యాలను పరిశీలించారు. అదనంగా మరికొంత భూమి అవసరమని కోరడంతో అప్పట్లో జిల్లా అధికారులు 1592.25 ఎకరాల భూమిని గుర్తించారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించ లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపితే.. రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కానీ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా.. పట్టించుకోకపోవడంతోనే పక్కన పెట్టాల్సి వచ్చిందని టీఆర్‌ఎస్‌ నేతలు పదేపదే చెబుతున్నారు. అయితే గతంలో రైతులు తమ భూములను వదులుకు నేందుకు ఇష్టం లేక ఆందోళనకు సైతం దిగారు. దీంతో పునరాలోచనలో పడిన వాయుసేన కొంత వెనుకడుగు వేసినట్లు తెలిసింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించిన సందర్భంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు.

సమన్వయం కరువు

జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మినీ ఎరోడ్రమ్‌ నిర్మాణానికి సానుకూలంగా ఉన్నట్లు పలుమార్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలను నిర్మించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరడంతో.. అధికారుల బృందం పరిశీలన జరిపిందంటూ టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. అధ్యయనానికి అవసరమైన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించినట్లు చెబుతున్నారు. దీంతో జిల్లాకేంద్రంలో విమానాశ్రయం నిర్మించే స్థలాన్ని కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. గతంలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీ సోయం బాపురావు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో కేంద్ర ప్రభుత్వం కొంతమేర ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. ఎంపీ సోయం స్వయంగా ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి వివరించడంతో కదలిక వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

Updated Date - 2022-08-06T06:47:16+05:30 IST